"సిద్ధం" సభల్లో గ్రీన్ మ్యాట్... వార్ ఆఫ్ వర్డ్స్ స్టార్ట్!
గుడిపాడు వద్ద ఈరోజు జరగనున్న "సిద్ధం" ఆఖరి సభకు సర్వం సిద్ధమైంది. ఈ సమయంలో ఆ సభా స్థలిలో గ్రీన్ మ్యాట్ లు వేయడంపట్ల టీడీపీ విమర్శలు చేసింది. దీనికి వైసీపీ కౌంటర్ కూడా ఇచ్చేసింది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ కార్యకర్తలను సమాయత్తం చేయడానికంటూ అధికార వైసీపీ "సిద్ధం" సభలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడుల్లో వైసీపీ భారీ బహిరంగ సభలు నిర్వహించింది. ఈ క్రమంలో... బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలో పి. గుడిపాడు వద్ద ఈరోజు జరగనున్న "సిద్ధం" ఆఖరి సభకు సర్వం సిద్ధమైంది. ఈ సమయంలో ఆ సభా స్థలిలో గ్రీన్ మ్యాట్ లు వేయడంపట్ల టీడీపీ విమర్శలు చేసింది. దీనికి వైసీపీ కౌంటర్ కూడా ఇచ్చేసింది.
అవును... సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ రాష్ట్రంలో 175కు 175 అసెంబ్లీ, 25కు 25 లోక్ సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులకు దిశానిర్ధేశం చేయడానికంటూ ఇప్పటికే మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించిన జగన్... వీటిలో ఆఖరి సభకు అన్ని ఏర్పాట్లూ చేశారు. దీనికోసం అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్ల వద్ద కోల్ కతా - చెన్నై నేషనల్ హైవే పక్కనే వందలాది ఎకరాల మైదానంలో ఈ సభను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి!
ఈ సభకోసం ప్రత్యేక కాన్సెప్ట్ తో "వై" ఆకారంలో ర్యాంప్ ను ఏర్పాటు చేశారు. జగన్.. వైనాట్ 175 అంటున్న క్రమంలో అందుకు సింబాలిక్ గా ఆ ర్యాంప్ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆ సభాస్థలిలో మొత్తం గ్రీన్ మ్యాట్ లు దర్శనమిస్తున్నాయి. పార్టీ జెండా రంగుల్లో ఒకటైన గ్రీన్ కలర్ మ్యాట్ లతో సభా ప్రాంగణాన్ని నింపేశారు. అయితే... ఈ కలర్ వేయడం వెనుక గ్రాఫిక్స్ కారణం ఉందని టీడీపీ ఆన్ లైన్ వేదికగా సెటైర్లు వేసింది.
ఇందులో భాగంగా... "జగన్ మాటల్లో నిజం ఉండదు. జగన్ సభల్లో జనం ఉండరు. అంతా జగన్మాయే!" "బాహుబలి సినిమాకి కూడా ఈ రేంజ్ లో గ్రీన్ మ్యాట్ లు వేసుండరు." అంటూ బాహుబలి సినిమా గ్రాఫిక్స్ తో సిద్ధం సభలకు వచ్చిన జనాన్ని కంపేర్ చేస్తూ ఎద్దేవా చేసే పనికి పూనుకుంది టీడీపీ. దీనికి కౌంటర్ గా స్పందించిన వైసీపీ... "భయం పట్టుకున్నట్లుంది" అని స్మైల్ ఎమోజీలతో రీట్వీట్ చేసింది! దీంతో ప్రస్తుతం నెట్టింట... ఈ గ్రీన్ మ్యాట్ అంశంపై చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది!
కాగా... "సిద్ధం" సభల్లో ఆఖరి సభ నేడు జరగనున్న సంగతి తెలిసిందే. దీనికోసం దక్షిణ కోస్తాలోని గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని 44 నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో కదలిరానున్నారని తెలుస్తుంది!