హెచ్ 1బీ వీసా రెన్యువల్ ప్రోగ్రాం షురూ.. విధివిధానాలివే
వచ్చే ఏడాది జనవరి 29 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రోగ్రాంకు సంబంధించిన పలు అంశాలు వెల్లడయ్యాయి.
అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న కీలక ప్రకటన వచ్చేసింది. అగ్రరాజ్యం అమెరికా జారీ చేసే హెచ్1బీ వీసా రెన్యువల్ విధానాన్ని మరింత సరళీకరణ చేసేందుకు వీలుగా కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.దీనికి సంబంధించిన ఒక పైలెట్ ప్రాజెక్టును బైడెన్ సర్కారు ఇటీవల ఓకే చెప్పటం తెలిసిందే.దీనికి సంబంధించిన విధివిధానాల్ని తాజాగా వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 29 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రోగ్రాంకు సంబంధించిన పలు అంశాలు వెల్లడయ్యాయి.
ఇందులో ముఖ్యమైనది.. సరళీకరించిన కొత్త విధానంలో మొదట 20వేల వీసాల రెన్యువల్ ను చేపడతారు. తొలి దశలో రెన్యువల్ ను భారతీయులు.. కెనడియన్లకు మాత్రమే కల్పించనున్నారు. ఈ విషయాన్ని తాజాగా విడుదల చేసిన నోటీసుల్లో యూఎస్ ఫెడరల్ రిజిస్ట్రీ తెలియజేసింది. పైలెట్ ప్రోగ్రాంలో భాగంగా 2024 జనవరి 29 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు హెచ్ 1బీ వీసాదారులు తమ వీసాల్ని అమెరికాలోనే రెన్యువల్ చేసుకోవచ్చు.
దీని కోసం ప్రతి వారం నాలుగు వేలు చొప్పున అప్లికేషన్ స్లాట్ ను అందుబాటులోకి తీసుకు రానున్నారు. ఈ నాలుగు వేలలో రెండు వేలు భారతీయులకు.. మరోరెండు వేలు కెనడియన్లకు కేటాయిస్తారు. జనవరి 29, ఫిబ్రవరి 5, ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 19, ఫిబ్రవరి 26 తేదీల్లో ఈ స్లాట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. వీసా రెన్యువల్ కోసం పత్రాల సమర్పణ కు 2024 ఏప్రిల్ 15 వరకు డెడ్ లైన్ ఇవ్వనున్నారు.
దరఖాస్తులు చేసుకోవాలని భావించే వారు https://travel.state.gov/content/travel/en/us-visas/employment/domestic-renewal.html వెబ్ సైట్ కు వెళ్లి తమ అప్లికేషన్లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రెన్యువల్ కోసం 205 యూఎస్ డాలర్లను చెల్లించాలి. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.17వేలవరకు ఉంటుంది. ఒకవేళ వీసా రిజెక్టు అయితే.. దీన్ని తిరిగి ఇవ్వరు. అప్లికేషన్లు ఇచ్చే వారు గతంలో వీసా అప్లికేషన్ సమయంలో 10 వేలి ముద్రలు ఇచ్చిన వారు.. వ్యక్తిగత ఇంటర్వ్యూ మినహాయింపుకోసం అర్హులై ఉన్న వారే ఉండాలి. సో.. ఆల్ ద బెస్ట్.