నేను బూతులు తిట్ట‌లేదు..: హ‌నుమ విహారీ

17వ ప్లేయర్‌గా ఉన్న అతడు నిబంధనల ప్రకారం.. మ్యాచ్‌ సమయంలో డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి రాకూడదని, అదే విషయంపై అతడిని వారించాన‌ని చెప్పాడు.

Update: 2024-02-29 14:06 GMT

స్టార్ క్రికెట‌ర్ హ‌నుమ విహారీ మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో ఏపీ నేతల పాత్ర పెరిగిపోయింద‌ని ఇటీవ‌ల ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఇవిరాజ‌కీయ దుమారానికి దారి తీశాయి. తాజాగా తాడేప‌ల్లి గూడెంలో జ‌రిగిన జెండా స‌భ‌లోనూ చంద్ర‌బాబు వైసీపీపై విరుచుకుప‌డేలా చేశాయి. ఏపీకి చెందిన ఓ కార్పొర‌ట‌ర్ జోక్యం కార‌ణంగా తాను తీవ్రంగా న‌ష్ట‌పోయాన‌ని విహారీ కొన్ని రోజుల కింద‌ట‌ చెప్పాడు. ఈ కార‌ణంగా తాను ఇక‌, ఆంధ్రాజ‌ట్టుకు ఆడేది లేద‌ని తెగేసి చెప్పాడు.

ఈ ఏడాది జ‌రిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ చేతిలో ఆంధ్ర జట్టు 4 పరుగుల తేడాతో ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ఈ రంజీ సీజన్ తొలి మ్యాచ్‌లో జట్టులోని 17వ ఆటగాడిపై తాను గ‌ట్టిగా మంద‌లించాన‌ని విహారీ పేర్కొన్నాడు అయితే.. స‌ద‌రు ఆట‌గాడు.. త‌న తండ్రి (కార్పొరేట‌ర్‌)కి చెప్ప‌డంతో త‌న‌ను టీంలో నుంచి త‌ప్పించార‌ని విహారీ ఆరోపించాడు. ఈ మేర‌కు ఇన్‌స్టా వేదిక‌గా ఆయ‌న పేర్కొన‌డం గ‌మ‌నార్హం. నేత జోక్యం కార‌ణంగా ఆంధ్రా జట్టు మేనేజ్‌మెంట్ తనను కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ఆదేశించింద‌న్నాడు.

త‌న ఆత్మ గౌర‌వం పోయింద‌ని విహారీ వ్యాఖ్యానించాడు. తాను చేయ‌ని త‌ప్పున‌కు త‌న‌ను మంద‌లించి నంత ప‌నిచేశార‌ని, కెప్టెన్సీ నుంచి తీసేశార‌ని పేర్కొన్నాడు. తాను అంకిత భావంతో ఆంధ్రా జ‌ట్టుకు ప‌నిచేశాన‌ని.. క్రీడ‌లో భాగంగా స‌ద‌రు క్రీడాకారుడిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాన‌ని.. దీనిని రాజ‌కీయంగా వినియోగించుకుని త‌న‌ను కెప్ట‌న్సీ నుంచి తీసేయ‌డం చాలా బాధాక‌ర‌ణ‌మని వ్యాఖ్యానించాడు. ఇది ఆత్మ‌గౌర‌వానికి సంబంధించిన విష‌యంగా పేర్కొన్నాడు. ఇక పై తాను ఆంధ్ర జ‌ట్టు ఆడ‌బోన‌ని తేల్చి చెప్పాడు.

ఇంత‌లో వైసీపీ నాయ‌కులు జోక్యం చేసుకుని విహారీపై విమ‌ర్శ‌లు చేశారు. ఆయ‌న ఇష్టాను సారం దుర్భాష‌లాడార‌ని అన్నారు. దీనిపై తాజాగా వివ‌ర‌ణ ఇచ్చిన హనుమ‌.. తాను ఎలాంటి బూతులు మాట్లాడ‌లేద‌న్నారు. 17వ ప్లేయర్‌గా ఉన్న అతడు నిబంధనల ప్రకారం.. మ్యాచ్‌ సమయంలో డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి రాకూడదని, అదే విషయంపై అతడిని వారించాన‌ని చెప్పాడు. అయితే, ఆ ప్లేయ‌ర్ మాత్రం తప్పుగా చిత్రీకరించి తన తండ్రికి ఫిర్యాదు చేయడంతో.. ఇది నెగిటివ్‌గా మారిపోయిందన్నాడు.

తాను ఎలాంటి తప్పు చేయకపోయినా కెప్టెన్సీ నుంచి తప్పించారని విహారీ తెలిపాడు. గత నెలలో ఈ ఘటన జరిగిందన్న ఆయ‌న ఇన్నాళ్లూ త‌న మనసులోనే దాచుకున్న‌ట్టు చెప్పాడు. ఈ ఘ‌ట‌న త‌న ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని, అందుకే బయ‌ట‌కు చెప్పాన‌ని వివ‌ర‌ణ ఇచ్చాడు.

Tags:    

Similar News