వచ్చే ఎన్నికల్లో జరిగేది ఏంటో చెప్పిన పేర్ని నాని...!
ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అయిదురుగు ఎడిటర్ల నుంచి వరసగా వచ్చే ప్రశ్నలకు పేర్ని నాని జవాబు చెప్పుకొచ్చారు.
వైసీపీ కీలక నేత మాజీ మంత్రి పేర్ని నాని వచ్చే ఎన్నికల్లో జరిగేది ఏంటో తనదైన రాజకీయ అనుభవంతో చెప్పుకొచ్చారు. ఈసారి ఎన్నికల్లో జగన్ కావాలా వద్దా అన్న దాని మీదనే ప్రజలు ఓటు వేస్తారు అని ఆయన విశ్లేషించారు. అంతే తప్ప టీడీపీ ఓటు బీజేపీ ఓటు జనసేన ఓటు కాంగ్రెస్ ఓటు అని ఇన్ని ఉండవని ఒక్క ముక్కలో తేల్చేశారు. వైసీపీ ఓటు మీద షర్మిల ప్రభావం సహా ఎవరిదీ ఉండదని తేల్చేశారు. తమకు పడే ప్రతీ ఓటూ అనుకూల ఓటే అని ఆయన నిర్ధారించారు.
ఏపీ ప్రజలకు జగన్ అవసరం ఉంది అనుకుంటే గెలిపించి తీరుతారు అని అన్నారు. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అయిదురుగు ఎడిటర్ల నుంచి వరసగా వచ్చే ప్రశ్నలకు పేర్ని నాని జవాబు చెప్పుకొచ్చారు. ఎన్నో విషయాలను కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. జగన్ కి వ్యతిరేకంగా ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకుని వచ్చినా జరిగేది మాత్రం వైసీపీ విజయమే అని నాని ధీమాగా చెప్పారు.
ఏపీలో అయిదేళ్ల కాలంలో వైసీపీ చేసిన అభివృద్ధి సంక్షేమం మీద గట్టి నమ్మకంతోనే వై నాట్ 175 అని తాము స్లోగన్ తో ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఇన్ని మంచి పనులు చేసిన తమ ప్రభుత్వం మళ్లీ మొత్తం సీట్లు ఎందుకు గెలుచుకోకూడదు అని నాని ప్రశ్నించారు. వైసీపీ 2019 ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసిందని ఆయన చెప్పారు. అదే విధంగా వివక్ష లేకుండా అన్ని వర్గాలకు మేలు చేసి చూపించిందని అన్నారు.
ఏపీలో మొత్తం ఓట్లలో తమ వాటా యాభై శాతం పైగానే ఉంటుందని అన్నారు. తమకు భయం ఎందుకు ఉంటుందని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుడి ఎడమలు చూడకుండా అన్ని పార్టీలతోనూ పొత్తు పెట్టుకుంటారని ఆయనకు గెలుపు ముఖ్యం తప్ప రాజకీయ విధానాలు సిద్ధాంతాలు లేవు అని అన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద తనకు కోపం కానీ ప్రేమ కానీ ప్రత్యేకంగా లేవని అన్నారు. ఆయన తమ ప్రత్యర్ధి అని అందుకే విమర్శించాల్సి వస్తోందని అన్నారు. తాను పవన్ ని ఒక రాజకీయ నేత కంటే కూడా చంద్రబాబు మేలు కోరుకునే వ్యక్తిగా చూస్తాను అని నాని అంటున్నారు.
ఏపీ రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండి అన్న ముఖ్యమంత్రి కానీ నాయకుడు కానీ జగన్ తప్ప మరొకరు లేరని నాని అన్నారు. ఇది దేశ రాజకీయాల్లోనే కొత్త ఒరవడిగా ఆయన అభివర్ణించారు. తాము ప్రత్యేక హోదా ఏపీకి తేలేకపోవడానికి కారణం కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రావడమే అని ఆయన అన్నారు.
మరో వైపు చూస్తే గత అయిదేళ్ళలో విభజన హామీలను గుర్తు చేస్తూనే ఉన్నామని బీజేపీ రాష్ట్రాలతో పోటీ పడుతూ ఏపీకి కేంద్రం నుంచి ఎక్కువ శాతం నిధులను సాధించామని నాని గుర్తు చేశారు. కేంద్రంలో ఈసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తి మెజారిటీ రాకపోతే కచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుందని అన్నారు.
తాము భారతీయ జనతా పార్టీతో పొత్తులు ఎపుడూ పెట్టుకోలేదని నాని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యన ఉండాల్సిన అనుబంధమే రెండు ప్రభుత్వాల మధ్యన ఉందని అన్నారు. 2014లోనే బీజేపీతో పొత్తు కోసం తమకు ఆహ్వానం వచ్చిందని ఆయన గుర్తు చేస్తూ నాడే తాము వద్దు అనుకున్నామని అన్నారు. ప్రజలు ఆదరిస్తే ఒంటరిగానే తాము ఎపుడూ గెలుస్తామని ఆయన అన్నారు.
ఏపీలో విపక్షాలకు దక్కే ఓట్లు సీట్లు గురించి తాను జోస్యం చెప్పలేనని, అయితే తమ టార్గెట్ 175 అన్నది రీచ్ అవుతామన్న విశ్వాసం ఉందని అన్నారు. తనకు సినిమాలలో నచ్చిన హీరో చిరంజీవి అని పేర్ని నాని చెప్పడం విశేషం. తాను స్వచ్చందంగానే రాజకీయాల నుంచి తప్పుకున్నానని తన కుమారుడు పేర్ని క్రిష్ణమూర్తికి టికెట్ కూడా జగన్ ని కోరలేదని, ఆయనే ఇచ్చారని అన్నారు.
రాజకీయాల్లో తన అవసరం ఉంది అని జగన్ భావిస్తే తాను వైసీపీకి సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంటాను తప్ప ఇక మీదట ప్రత్యక్ష రాజకీయాలలో పోటీ చేసేది లేదని అన్నారు. తన సొంత నియోజకవర్గం మచిలీపట్నానికి పోర్టు మెడికల్ కాలేజ్ తో పాటు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను అన్న సంతృప్తి తనకు ఉందని నాని అన్నారు.