హాట్‌ టాపిక్‌.. జగన్‌ కు సోనియా ఫోన్‌!

స్వయంగా కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత సోనియా గాంధీ.. జగన్‌ కు ఫోన్‌ చేసి ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది.

Update: 2024-06-07 06:32 GMT

ఈ లోక్‌ సభ ఎన్నికల్లో 400 స్థానాలు సాధించాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఉవ్విళ్లూరింది. అయితే చావు తప్పి కన్నులొట్టబోయినట్టు మెజారిటీ (272) కంటే 20 సీట్లు మాత్రమే అదనంగా గెలుచుకోగలిగింది. బీజేపీ కూటమికి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేయడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తారని జరిగిన ప్రచారం బీజేపీ అవకాశాలను భారీగా దెబ్బతీసింది.

మరోవైపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తల్లకిందులు చేస్తూ కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి మంచి ఫలితాలను సాధించింది. కాంగ్రెస్‌ పార్టీ 99 స్థానాలను సాధించింది. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు మొత్తం 234 సీట్లను గెలుచుకుని మెజారిటీకి 38 సీట్ల దూరంలో నిలిచిపోయాయి. ఇక ఏ కూటమిలోనూ చేరకుండా నిలిచిన పార్టీలు, స్వతంత్రులకు 17 ఎంపీ స్థానాలు దక్కాయి.

ఈ నేపథ్యంలో అధికారం చేజిక్కించుకోవడానికి ఉన్న ఏ అవకాశాన్ని పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ పార్టీ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత పెద్ద పార్టీలుగా ఉన్న టీడీపీ, జేడీయూలను కాంగ్రెస్‌ పార్టీ సంప్రదించిందనే వార్తలు వచ్చాయి. మరోవైపు లోక్‌ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు సాధించిన వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ను కూడా సంప్రదించారని టాక్‌ నడుస్తోంది. స్వయంగా కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత సోనియా గాంధీ.. జగన్‌ కు ఫోన్‌ చేసి ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది.

అయితే సోనియా ప్రతిపాదనను జగన్‌ సున్నితంగా తిరస్కరించారని అంటున్నారు. వాస్తవానికి 2011లో వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ కేంద్రంలో ఏ కూటమిలోనూ చేరలేదు. బీజేపీ, కాంగ్రెస్‌ కూటమిలకు సమాన దూరాన్నే పాటిస్తూ వచ్చింది. 2019 – 24 వరకు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి పలు సందర్భాల్లో వైసీపీ మద్దతు ఇచ్చింది. ముఖ్యంగా రాజ్యసభలో పలు కీలక బిల్లుల ఆమోదానికి మద్దతు తెలిపింది.

తాజా ఎన్నికల్లోనూ వైసీపీ రెండు కూటములకు సమాన దూరంలోనే ఉంది. ఏ కూటమిలోనూ చేరలేదు. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి బొటాబొటీ మెజారిటీ దక్కడం, మరో 40 మంది ఎంపీలను కూడగట్టుకుంటే కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమికి అవకాశం ఉండటంతో ఆ పార్టీ ఏ చిన్న ప్రయత్నాన్నీ వదులుకోవడం లేదు. ఇందులో భాగంగానే వైసీపీ అధినేత జగన్‌ కు సోనియా గాంధీ స్వయంగా ఫోన్‌ చేసి మద్దతు అడిగారనే వార్త హల్చల్‌ చేస్తోంది.

మరోవైపు మహారాష్ట్రలోని సాంగ్లీ నుంచి ఇండిపెండెంట్‌ గా గెలిచిన విశాల్‌ పాటిల్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ప్రకటించి ఆ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ 100 ఎంపీ స్థానాలను ఈ ఎన్నికల్లో గెల్చుకున్నట్టయింది.

Tags:    

Similar News