ఏమిటీ ‘మాంగ్’ కంపెనీలు? అందులో జాబ్ రావాలంటే ఏం చేయాలి?

నెలకు జీతం ఎంత కావాలంటే ఒక్కొక్కరు ఒక్కో మాట చెబుతారు.

Update: 2024-07-26 12:30 GMT

నెలకు జీతం ఎంత కావాలంటే ఒక్కొక్కరు ఒక్కో మాట చెబుతారు. ఐటీ రంగంలో ఉండి.. ఒకస్థాయిలో ఉండే చాలామందికి ఉండే కల వార్షిక జీతం రూ.కోటి రూపాయిలు. అందరికి సాధ్యం కాని దాన్ని అచీవ్ చేసేందుకు తెగ ప్రయత్నిస్తుంటారు. అలాంటిది కాలేజీలో విద్యార్థిగా ఉంటూనే రూ.కోటి వార్షిక జీతంతో కొలువును పట్టేయటం అంత తేలికైన విషయం కాదు. ఒక ఉద్యోగికి రూ.కోటి శాలరీ కల ఒక ఎత్తు అయితే.. క్యాంపస్ లోనే ఉండి రూ.కోటి వార్షిక జీతాన్ని అందించే కొలువును సొంతం చేసుకోవటం అంత తేలిక కాదు.

అలా అని అసాధ్యమేమీ కాదు. పక్కాగా ప్లాన్ చేయాలే కానీ.. సాధించే వీలున్న ఈ కొలువులను ఇచ్చే కంపెనీల మాటేమిటి? అన్నది ప్రశ్న వస్తుంది. నిజమే.. ఒక ఉద్యోగికి ఏడాదికి రూ.కోటి జీతం అంటే.. నెలకు దగ్గర దగ్గర రూ.9 లక్షల వరకు జీతం ఇచ్చే కంపెనీలు ఏం ఉంటాయి? అన్న ప్రశ్న మదిలో మెదలొచ్చు. నిజమే.. ఇంత భారీ జీతాన్ని అందించే కంపెనీలు కుప్పలు కుప్పలుగా ఉండవు. అంత భారీ శాలరీని ఆఫర్ చేసే కంపెనీలను వేళ్ల మీద లెక్కించొచ్చు.

కోటి రూపాయిల వార్షిక వేతనాన్ని అందించే కంపెనీల్లో ప్రధానంగా మాంగ్ కంపెనీలుగా చెబుతుంటారు. మాంగ్ కంపెనీలు అంటే అదేదో బ్రహ్మపదార్థం కాదు. మెటా.. అమెజాన్.. యాపిల్.. నెట్ ఫ్లిక్స్.. గూగుల్ కంపెనీల్లోని మొదటి అక్షరాన్ని కలిపితే.. మాంగ్ కంపెనీగా వ్యవహరిస్తుంటారు. నిజానికి ఈ కంపెనీల్లో పని చేయటానికి ప్రతి ఒక్కరు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. కానీ.. ఆ కంపెనీల్లో కొలువు సాధించటం అంత తేలికైన విషయం కాదు.ఈ కంపెనీల్లో ఉద్యోగాన్ని సొంతం చేసుకోవటం అంటే.. జాక్ పాట్ తగిలినట్లేనని ఫీల్ అయ్యే వారు బోలెడంత మంది.

ఇంతకూ ఈ కంపెనీల్లో కొలువుల్ని సొంతం చేసుకోవాలంటే పక్కా ప్లానింగ్ చాలా అవసరమని చెబుతారు. ఇంతకూ మాంగ్ కంపెనీల్లో కొలువులు సాధించేందుకు అవసరమైన అంశాలేమిటదన్న విషయాల్లోకి వెళితే..

- గ్రాడ్యుయేషన్ లో అత్యధిక స్కోరింగ్ తప్పనిసరి. కనీసం టెన్ అవుటాఫ్ టెన్ జీపీఏ స్కోరింగ్ అవసరం.

- ఈ విషయంలో చిన్నపాటి తేడా ఉండకూడదు.

- జీపీఏ 10/10 ఉన్నోళ్లను మాత్రమే రిక్రూట్ మెంట్ కు ఆహ్వానిస్తారు.

- గ్రాడ్యుయేషన్ తో పాటు స్టూడెంట్ లైఫ్.. దానికి ముందున్న విద్యార్థి దశ నుంచి అకడమిక్ ట్రాక్ ఎంత బాగా ఉంటే అంతలా ప్రాధాన్యత ఇస్తారు.

- మాంగ్ లో ఉన్న కంపెనీలన్నీ కంప్యూటర్ సైన్స్ లో బలంగా ఉండాలి. ప్రతి సబ్జెక్టులోనూ పట్టు ఉండాలి.

- ఏ ప్రాజెక్టును తీసుకున్నా అందులో రాణించే సత్తా ఉండాలి.

- కోడింగ్ ను అవలీలగా చేసే నైపుణ్యం ఉండాలి.

- ఎలాంటి ప్రోగ్రామింగ్ అయినా ఇట్టే చేసేయటం.. అప్డేటెడ్ టెక్నాలజీస్ లో ప్రాజెక్టులను చేసిన ఉండాలి.

- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. మెషీన్ లెర్నింగ్ లాంటి ఆధునిక టెక్నాలజీల ప్రాతిపదికగా ప్రాజెక్టు కానీ అప్రెంటిస్ షిప్ ఉండాలి.

- మాంగ్ కంపెనీల్లో కొలువులు కోరుకునే వారు ఏదో ఒకట్రెండు ప్రాజెక్టులు అని కాకుండా.. వీలైనన్ని విభిన్నమైన ప్రాజెక్టులు చేసి ఉండటం.. అప్రెంటిస్ షిప్ అవసరం.

- కొలువు కోరుకునే కంపెనీకి సంబంధించిన సమగ్ర సమాచారంతో పాటు.. కంపెనీకి సంబంధించిన అన్ని అంశాల్లో వీలైనంత అవగాహన ఉండటం చాలా అవసరం. ఒక్కమాటలో చెప్పాలంటే 360 డిగ్రీస్ లో అవగాహన అవసరం.

- ఉదాహరణకు వెళ్లే కంపెనీ ప్రధాన కార్యాలయం.. దాని సీఈవో.. మార్కెట్ లో షేర్ విలువ.. ఉద్యోగులు.. ఇటీవల కాలంలో కంపెనీ ఎదుర్కొన్న సమస్యలు.. సాధించిన విజయాలు.. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు.. సదరు ప్రాజెక్టులను ఏ ప్లాట్ ఫాం మీద చేస్తున్నారు? లాంటి అన్ని అంశాల మీద అవగాహన ముఖ్యం.

- మొత్తంగా చూస్తే.. సదరు ఉద్యోగార్థి ఇంటర్వ్యూ కోసం వచ్చినట్లు కాకుండా.. ఏదైనా పని చెబితే కంపెనీలో ఇట్టే అల్లుకుపోతాడన్న భావన కలిగేలా ఉండాలి.

- విషయాల మీద అవగాహన.. నాల్డెజ్ మాత్రమే కాదు.. వ్యక్తిత్వ అంశాల్ని కూడా పరిశీలిస్తారన్నది మర్చిపోకూడదు. ఒత్తిడిని తట్టుకునే సత్తా.. ప్రతికూల - సానుకూల పరిస్థితుల్ని ఎదుర్కొనే మానసిక శక్తి ఉందా? లేదా? అన్నది చెక్ చేస్తారు.

- మాంగ్ కంపెనీల్లో ఎంపిక మిగిలిన కంపెనీలకు భిన్నంగా ఉంటుంది. ఇతర సంస్థల్లో ఒకట్రెండు టెక్నికల్.. ఒక హెచ్ ఆర్ రౌండ్ ఉంటే.. మాంగ్ కంపెనీల్లో మాత్రం నాలుగైదు టెక్నికల్ రౌండ్స్ ఉంటాయి. దీనికి ముందు అభ్యర్థికి సబ్జెక్టుపై ఇచ్చే పరీక్షలో మంచి స్కోర్ ఉండాలి.

- టెస్టును క్లియర్ చేశాకే టెక్నికల్ రౌండ్లు స్టార్ట్ అవుతాయి. పరీక్షలు ప్రశ్నలు కాకుండా.. ప్రోగ్రామింగ్స్.. కేస్ స్టడీస్.. లేటెస్టు టెక్నాలజీ మీదా ఉంటాయి. ఇన్ని రౌండ్స్ ద్వారా అభ్యర్థిని టెస్టు చేయటానికి కారణం.. తాము తీసుకున్న వెంటనే ఎలాంటి అదనపు ట్రైనింగ్ అవసరం లేకుండా పనిలోకి వెళ్లిపోయేలా ఉండాలనుకోవటమే.

- రూ.కోటి కొలువుల్ని సొంతం చేసుకోవటానికి.. అవకాశాల్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండటం.. నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోవటం.. అందుకోసం అవిశ్రాంతంగా శ్రమిస్తూ ఉండటం.. తమ గురించిన ఆన్ లైన్ ప్రొఫైల్ సిద్ధం చేసుకోవటం.. ఇండస్ట్రీ ఈవెంట్స్.. వెబినార్స్ ను ఫాలో అవుతుండటం.. కంపెనీలకు అనుగుణంగా రెజ్యూమెలను సిద్ధం చేసుకోవటం.. ఇంటర్వ్యూలకు ప్రాక్టీస్ చేయటం లాంటివి చేస్తేనే అనుకున్న లక్ష్యాల్ని చేరుకునే వీలుంటుంది. డబ్బులు ఊరికే రావు అన్నట్లే.. రూ.కోటి కొలువు అంత వీజీగా రాదు.

Tags:    

Similar News