భార్య ఆత్మహత్యకు భర్తే కారణమని చెప్పలేం!

ఈ కేసులో భర్తకు భారతీయ సాక్ష్య చట్టంలోని సెక్షన్‌ 113ఎ వర్తించదని సుప్రీంకోర్టు తెలిపింది.

Update: 2024-03-01 06:32 GMT

భార్య ఆత్మహత్య కేసులో సరైన సాక్ష్యం లేకపోతే భర్తను దోషిగా నిర్ధారించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు 30 ఏళ్ల నాటి కేసులో ఓ వ్యక్తిని నిర్దోషిగా పేర్కొంటూ తాజాగా తీర్పు ఇచ్చింది. ఈ కేసులో భర్తకు భారతీయ సాక్ష్య చట్టంలోని సెక్షన్‌ 113ఎ వర్తించదని సుప్రీంకోర్టు తెలిపింది.

పెళ్లైన ఏడేళ్లలోపు మహిళ ఆత్మహత్యకు పాల్పడితే అందుకు భర్త, అతని బంధువులే కారణమవుతారని ఊహించడాన్ని సెక్షన్‌ 113ఎ నిర్ధారిస్తుంది. అయితే కేవలం భర్త వేధింపులే ఆత్మహత్యకు ప్రేరణ అయ్యాయని భావించలేమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర ధర్మాసనం తమ తీర్పులో వెల్లడించింది.

భార్య ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితుల్లో నిందితుడు ప్రత్యక్ష చర్య ఉందా లేదా అన్నది కూడా కీలకమేనని సుప్రీంకోర్టు తెలిపింది. పెళ్లై ఏడేళ్లలోపే ఆత్మహత్య జరిగింది కాబట్టి అందుకు నిందితుడే కారణమని చెప్పలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. భర్త వైపు నుంచి క్రూరత్వం ఉందని కూడా నిరూపించాలంది. ఈ నేపథ్యంలో సరైన సాక్ష్యం లేకుండా సెక్షన్‌ 113ఎ ప్రకారం నిందితుడిని దోషిగా భావించలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

నరేష్‌ కుమార్‌ అనే వ్యక్తి 1993లో అతని భార్య ఆత్మహత్యకు కారణమైనట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రయల్‌ కోర్టు భర్త, అతడి బంధువుల వేధింపులతోనే నరేశ్‌ భార్య ఆత్మహత్య చేసుకుందని నిర్ధారించింది. ట్రయల్‌ కోర్టు తీర్పుపై నరేశ్‌ పంజాబ్, హరియాణా ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సైతం ట్రయల్‌ కోర్టు తీర్పును సమర్థించింది. దీంతో అతడు చివరకు సుప్రీంకోర్టు తలుపుతట్టాడు.

ఈ నేపథ్యంలో ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు భర్త చేతిలో వేధింపుల వల్లే భార్య మరణించిందని చెప్పడం ఊహాజనితమేనని తేల్చింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ జెబి పార్దివాలా, మనోజ్‌ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నరేశ్‌ ను నిర్దోషిగా విడుదల చేసింది.

1993లో తన భార్య ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు నరేష్‌ పై పోలీసులు నమోదు చేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. అతడిని నిర్దోషిగా ప్రకటించింది. తద్వారా అతడి మూడు దశాబ్దాల న్యాయ పోరాటానికి సుప్రీంకోర్టు ముగింపు పలికింది.

Tags:    

Similar News