కార్ల డోర్లలో రూ.1.2 కోట్ల క్యాష్.. హైదరాబాద్ పోలీసులు ఎలా పట్టుకున్నారంటే

గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా తరలిస్తున్న క్యాష్ ను పట్టేసిన వైనం షాకిచ్చేలా మారింది.

Update: 2023-11-23 05:18 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో లెక్కలకు రాని కోట్లాది రూపాయిల క్యాష్ ను పోలీసులు పట్టేస్తున్నారు. ఒక ఉదంతం తర్వాత మరో ఉదంతం తెర మీదకు వస్తోంది. కీలక పోలింగ్ గడువు దగ్గరకు వస్తున్న కొద్దీ.. తనిఖీల్లో పట్టుబడుతున్న నోట్ల కట్టల లెక్క అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా హైదరాబాద్ పోలీసులు మరో భారీ నోట్ల కట్టల్ని పట్టేశారు. గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా తరలిస్తున్న క్యాష్ ను పట్టేసిన వైనం షాకిచ్చేలా మారింది.

హైదరాబాద్ మహా నగర శివారుకు చెందిన నాచారం పోలీసులు అక్రమ రవాణను అడ్డుకునేందుకు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నాచారం పోలీస్ స్టేషన్ కు సమీపంలోని మొయిన్ రోడ్డు మీద సీఐ ప్రభాకర్ రెడ్డి.. ఎస్సైలు గంగాధర్.. సారంగపాణిలు తమ సిబ్బందితో కలిసి తనిఖీలు చేస్తుననారు. అన్ని వాహనాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ..అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో నాగోల్ కు చెందిన సునీల్.. మెకానిక్ శరత్ బాబులు కలిసి తమ కారులో నాచారం నుంచి భువనగిరికి వెళుతున్నారు. ఈ క్రమంలో వారి కారును నాచారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. కారులో ఎలాంటి క్యాష్ లభించలేదు. కానీ.. కారులోని వారి వ్యవహారశైలి.. వారి తీరు అనుమానాస్పదంగా మారింది. దీంతో.. మరింత లోతుగా కారును తనిఖీలు చేయసాగారు.

ఈ క్రమంలో భయాందోళనలకు గురైన సునీల్ రెడ్డి.. తమ తప్పును ఒప్పుకుంటూ కారు డోర్లను స్కూడ్రైవర్లతో తీశారు. అందులో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు నీట్ గా పేర్చి ఉంచటంతో పోలీసులు సైతం అవాక్కు అయ్యారు. దీంతో.. కారులో దాచి పెట్టిన నోట్ల లెక్కల గుట్టు రట్టు చేశారు. మొత్తం క్యాష్ ను లెక్క వేయగా.. రూ.1.2కోట్లు ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో సదరు నగదును స్వాధీనం చేసుకొని.. ఆరా తీస్తున్నారు. పట్టుకున్న భారీ మొత్తం హవాలా మొత్తమా? ఎవరైనా రాజకీయ నాయకుల డబ్బా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News