భారత్ లో రూ.5,000, రూ.10,000 నోట్లు... ఎందుకు నిలిపేశారో తెలుసా?

ప్రస్తుతం భారతదేశంలో రూ.500 నోటు అత్యధిక విలువైనదిగా ఉన్న సంగతి తెలిసిందే.

Update: 2024-09-29 00:30 GMT

ప్రస్తుతం భారతదేశంలో రూ.500 నోటు అత్యధిక విలువైనదిగా ఉన్న సంగతి తెలిసిందే. 2016 డిమోనిటైజేషన్ తర్వాత ప్రవేశపెట్టబడిన రూ.2,000 నోటు అంతక మందు దేశంలో అత్యధిక విలువైన నోటుగా ఉండేది. అయితే... భారత్ లో ఒకప్పుడు రూ.5,000.. రూ.10,000 వంటి అధిక విలువున్నవి నోట్లు ఉన్న సంగతి చాలా మందికి తెలిసి ఉండదు.

అవును.. దేశ ఆర్థిక చరిత్రలో అంతగా తెలియని రూ.5,000.. రూ.10,000 నోట్ల అధ్యాయం ఓ ఆసక్తికర అంశం. వాస్తవానికి భారతదేశంలో రూ.10,000 నోటు స్వాతంత్ర్యానికి పూర్వం ఉండేది. 1938లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మొదట రూ.10,000 నోటును విడుదల చేసింది.

ఇదే ఇప్పటివరకూ దేశంలో చలామణిలో ఉన్న అతిపెద్ద డినామినెషన్ గా నిలిచింది. అయితే 1946 జనవరిలో బ్రిటీష్ ప్రభుత్వం ఈ రూ.10,000 నోటును రద్దు చేయాలని నిర్ణయించింది. ప్రధానంగా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో పెరిగిన బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలను అరికట్టడానికి నాడు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్రమంలో స్వాతంత్రయం అనంతరం 1954లో రూ.10,000.. రూ.5,000 నోట్లను తిరిగి చలామణిలో పెట్టారు. ఈ నేపథ్యంలో 1978లో రూ.10,000 నోటు వ్యవహారం మరో మలుపు తిరిగింది. భారత ప్రభుత్వం ఈ నోటుతో పాటు ఐదువేల రూపాయల నోటును మళ్లీ డీమోనిటైజ్ చేయాలని నిర్ణయించుకుంది.

ఈ అధిక విలువైన నోట్లను సాధారణ ప్రజలు విస్తృతంగా ఉపయోగించేవారు కాదు కానీ... వాణిజ్యంలో పెద్ద పెద్ద లావాదేవీలకు, బ్లాక్ మార్కెట్ లావాదేవీలకు ఉపయోగించేవారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం డీమోనిటైజేషన్ చేయాలని నిర్ణయించింది.

అయితే... ఇటీవల రూ.5,000.. రూ.10,000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టాలనే విషయంపై కొంత పరిశీలన జరిగింది. ఆ సమయంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఈ అధిక విలువ గల నోట్లు తిరిగి రావొచ్చను సూచించారు! అయితే అంతిమంగా ఆ ఆలోచనను విరమించుకున్నారు!

దానికి బదులుగా 2016 డీమోనిటైజేషన్ సమయంలో రూ.500, రూ.1,000 నోట్ల ఉపసంహరించుకున్నప్పుడు.. ప్రభుత్వం రూ.2,000 నోటును ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. అయితే... 2023 మే 19న రూ.2,000 నోట్లనూ చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.

Tags:    

Similar News