భారత్ గా మార్చేస్తే.. ఇస్రో పేరు ఏమవుతుంది? అదొక్కటేనా?
మనసుకు నచ్చినట్లుగా పేర్లు మార్చేసుకోవటానికి ఇదేం చిన్నపిల్లల ఆట కాదు. దశాబ్దాల తరబడి ఒక దేశాన్ని పిలుస్తున్న పేరును మార్చేయటం కొత్త సమస్యలకు తెర తీసినట్లే
మనసుకు నచ్చినట్లుగా పేర్లు మార్చేసుకోవటానికి ఇదేం చిన్నపిల్లల ఆట కాదు. దశాబ్దాల తరబడి ఒక దేశాన్ని పిలుస్తున్న పేరును మార్చేయటం కొత్త సమస్యలకు తెర తీసినట్లే. ఇండియా అయినా భారత్ అయినా ఒకటే అయినప్పుడు.. ఇప్పుడున్న పేరును తీసేసి.. భారత్ అనే పేరునే వాడాలన్నట్లుగా కేంద్రంలోని మోడీ సర్కారు చేస్తున్న చేష్టలతో కొత్త సమస్యలు బోలెడన్ని తలెత్తుతాయని చెబుతున్నారు. అంతర్జాతీయంగా మన దేశాన్ని 'ఇండియా'గా పిలిచే వేళలో.. అందుకు భిన్నంగా 'భారత్' అంటూ మార్చేస్తూ.. జీ20 సదస్సు సందర్భంగా ఇన్విటేషన్ కార్డుల్లో మార్చేసిన వైనంపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది?
ఎవరికి నచ్చినట్లుగా వారు దేశం పేరును మార్చేస్తే తలెత్తే ఇబ్బందుల్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే ఇండియా పేరు మీద బోలెడన్ని ప్రభుత్వ రంగ సంస్థలు.. విద్యాలయాలు.. చెప్పుకుంటూ పోతే బోలెడన్ని ఉన్నాయి. వీటి పేర్లను ఇండియా స్థానంలోభారత్ అంటూ మార్చేస్తే.. వాటికి వచ్చే అర్థం ఎబ్బెట్టుగా ఉంటుందని చెబుతున్నారు. ఎక్కడిదాకానో ఎందుకు అందరికి సుపరిచితమైన ఇస్రో (ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్) పేరుతో నెలకొల్పారు. ఇప్పుడు భారత్ పేరుతో వ్యవహరించాలంటే దీనికి ''బిస్రో''గా పిలవాల్సి ఉంటుంది. ఎయిరిండియా పేరును ఎయిర్ భారత్ గా పిలవాల్సి ఉంటుంది. ఇక ఐఏఎస్.. ఐపీఎస్.. ఐఎఫ్ఎస్ లాంటి ఎన్నోంటినో మార్చాల్సి వస్తుంది.
అదే జరిగితే.. బీఏఎస్.. బీపీఎస్.. బీఎఫ్ఎస్.. అన్నట్లుగా వ్యవహరించాల్సి వస్తుంది. భారత్ ఆడ్మినిస్ట్రేషన్ సర్వీస్.. భారత పోలీస్ సర్వీస్.. ఇలా పిలవాల్సి వస్తుంది. ఇక ఆర్ బీఐ ను కాస్తా ఆర్ బీబీ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ భారత్) అని పిలవాల్సి ఉంటుంది. ఎయిమ్స్ ను ఎబీఎంఎంఎస్గా.. బీసీసీఐను బీసీసీబీగా.. ఐఐటీని బీఐటీగా.. ఐఐఎంను బీఐఎంగా ఇలా చెప్పుకుంటూ బోలెడన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. మారిన పేర్లకు తగ్గట్లుగా వెబ్ సైట్ లలో పేర్లు మార్చటం ఒక పెద్ద పని. దీంతో సరిపోదు కదా? మరి.. వాటి యూఆర్ఎల్స్ ను మార్చాల్సి ఉంటుంది. అదే జరిగితే.. ఇప్పుడు ఈ పేర్లకు తగ్గట్లుగా యూఆర్ఎల్స్ దొరక్కపోతే అదో తలనొప్పి. పేరును మార్చేయటం వల్ల జరిగే ఇంత గజిబిజి గందరగోళం చూసినప్పుడు.. ఇంత అవసరమా? అన్న భావన కలుగక మానదు.