కర్రసాము చేసి... అవ్వను కుమ్మినట్టుంది 'ఇండియా' పరిస్థితి!
వెనకటికి ఒక సామెత ఉంది. ఆరు మాసాలు కర్రసాము నేర్చుకుని.. ఇంట్లో కాటికికాళ్లు చాపుకున్న అవ్వను కుమ్మేశాడట ఒక వెంగళప్ప
వెనకటికి ఒక సామెత ఉంది. ఆరు మాసాలు కర్రసాము నేర్చుకుని.. ఇంట్లో కాటికికాళ్లు చాపుకున్న అవ్వను కుమ్మేశాడట ఒక వెంగళప్ప. అచ్చు.. ఇప్పుడు జాతీయ స్థాయిలో విపక్ష పార్టీల కూటమి 'ఇండియా' చేస్తు న్న పనికూడా ఇలానే ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. తాజాగా ఇండియా కూటమి సంచలన నిర్ణయం తీసుకుంది. తమపై వ్యతిరేక వార్తలు రాసే పత్రికలను, తమకు అనుకూలంగా లేని మీడియా ఛానెళ్లను బహిష్కరించాలన్నది ఈ 'సంచలన నిర్ణయం'. ఇప్పుడు ఈ నిర్ణయంపైనే దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.
మీడియా అనేది తమకు మాత్రమే అనుకూలంగా ఉండాలనేది రాజకీయ పార్టీల కోరిక కావొచ్చు. లేదా వాటికి ఒక ఆకాంక్ష కావొచ్చు. అంతమాత్రాన మీడియా ఎల్లవేళలా.. ఒక పార్టీకి కొమ్ము కాయాలనే నియమం అంటూ ఏమీలేదు. పైగా.. మీడియాలోకి కార్పొరేట్ వాతావరణం వచ్చిన తర్వాత.. సహజంగానే రాజకీయ పార్టీలకు-మీడియాకు మధ్య అవినాభావ సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో కొన్ని పార్టీలకు, లేదా వ్యక్తులకు, నాయకులకు అనుకూలంగా మీడియా సంస్థలు ఉండడం సహజ పరిణామంగా మారింది.
ఇది ఒక్క మన దేశంలోనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి ఉందన్నది ఐక్యరాజ్యసమితి గత నెలలో వెల్లడించిన ''మీడియా రిపోర్టే'' స్పష్టం చేసింది. ఇక, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మీడి యా పరిస్థితి కొంత భిన్నంగా ఉండడం సహజమే. పైగా స్వీయ నియంత్రణ పాటించాలనే నియమాలను కూడా అన్ని సంస్థలు పాటిస్తున్నాయి. అంతమాత్రాన కొన్ని పార్టీలకు, నేతలకు పూర్తిస్థాయిలో అందరూ కట్టుబడాలని, తాము చెప్పిందే వేదం అన్నట్టుగా ప్రచారం చేయాలని ఆశించడం రాజకీయ పార్టీలకు అత్యాస కాకపోవచ్చు.
కానీ.. విస్తృత ప్రజా ప్రయోజనమే గీటు రాయిగా వర్థిల్లాల్సిన మీడియా సంస్థలకు అది అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. ఏది మంచి ఏది చెడు అని చెప్పే విశ్లేషణ ప్రాతిపదికన మీడియా తన పనితాను ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. అలాంటి గురుతర బాధ్యతను పోషిస్తున్న మీడియాను తమను అనుకూలంగా లేదని భావిస్తూ.. నిషేధించడం.. కొందరు పత్రికా విలేకరులపై కేసులు కూడా పెట్టాలని ఇండియా నేతలు భావించడం.. వారి విజ్ఞతకే వదిలేసినా.. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్రను ఎవరూ తక్కువ చేయలేరు.
అయినా.. ఎవరు ఏ మీడియా తరఫున ఎన్ని అనుకూల, వ్యతిరేక ప్రచారాలు చేసినా.. అంతిమంగా తేల్చాల్సింది ప్రజలు. ప్రజల పక్షాన గళం వినిపించాల్సిన నాయకులు, పార్టీలు వ్యక్తిగత ప్రాతిపదికన రాజకీయాలు చేసినంత వరకు.. ప్రజామోదం పొందడం ''ఎంతెంత దూరం..'' అన్న చందంగానే అఘోరిస్తుందనడంలో సందేహం లేదు.