భారతీయుడి పట్ల అమానుషం.. మాటలకందని దారుణం!
పొట్టకూటి కోసం, తమ కుటుంబాలను పోషించుకోవడం కోసం దేశాన్ని విడిచి వేరే దేశాలకు వెళ్లే వలస భారతీయ కార్మికులు ఎందరో ఉన్నారు
పొట్టకూటి కోసం, తమ కుటుంబాలను పోషించుకోవడం కోసం దేశాన్ని విడిచి వేరే దేశాలకు వెళ్లే వలస భారతీయ కార్మికులు ఎందరో ఉన్నారు. అయితే ప్రభుత్వ గుర్తింపు పొందిన అధీకృత ఏజెన్సీల ద్వారా కాకుండా వెళ్లినవారు సరైన జీతాలు, వసతులు, సౌకర్యాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఇలా వెళ్లిన వలస కార్మికులు అనారోగ్యం పాలయినా, మరణించినా వారిని యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు.
తాజాగా ఇటలీలో దారుణం జరిగింది. అక్కడ వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేయడానికి భారత్ నుంచి వెళ్లిన ఒక వ్యవసాయ కూలీ విషయంలో ఇటలీలోని యాజమాన్యం అమానుషంగా ప్రవర్తించింది.
భారత్ లోని పంజాబ్ కు చెందిన సత్నామ్ సింగ్ తన కుటుంబంతో కలిసి ఇటలీలోని వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేయడానికి వెళ్లాడు. ఈ క్రమంలో తాజాగా ఇటలీలోని లాటినా ప్రాంతంలో పొలంలో పనిచేస్తుండగా వ్యవసాయ యంత్రంలో పడి సత్నామ్ సింగ్ చేయి తెగిపోయింది. తీవ్ర రక్తస్రావంతో రక్తమోడింది. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడాల్సిన యాజమాన్యం సత్నామ్ సింగ్ ను అలాగే వదిలేసింది.
ఈ సమాచారాన్ని ఆలస్యంగా తెలుసుకున్న సత్నామ్ సింగ్ భార్య, అతడి స్నేహితులు అత్యవసర సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు ఎయిర్ అంబులెన్స్ ద్వారా అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సత్నామ్ సింగ్ మరణించాడు.
ఈ వ్యవహారం ఇటలీలో తీవ్ర దుమారానికి దారితీసింది. వలస కార్మికుల విషయంలో యాజమాన్యాలు దారుణంగా ప్రవర్తిస్తున్నాయని.. వారి వల్ల దేశానికి చెడ్డ పేరు వస్తోందనే విమర్శలు రేగాయి.
తాజాగా ఈ అంశం ఇటలీ పార్లమెంటులో చర్చకు వచ్చింది.
ఆ దేశ కార్మికశాఖ మంత్రి మెరీనా కాల్డెరోన్ పార్లమెంటులో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది నిజంగా అనాగరిక చర్య అని ఆమె మండిపడ్డారు. ఇప్పటికే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
ఈ అమానుష ఘటనను ఇటలీలోని ప్రధాన పార్టీ అయిన సెంటర్ లెఫ్ట్ డెమోక్రెటిక్ పార్టీ తీవ్రంగా ఖండించింది. మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపింది. అతడి కుటుంబానికి అన్ని విధాలా అండదండలు అందిస్తామని ప్రకటించింది. వలస కార్మికులకు గౌరవప్రదమైన పని, జీవన సౌకర్యాల కోసం తాము పోరాటం చేస్తామని వెల్లడించింది.
కాగా భారత్ నుంచి వెళ్లిన పది వేల మంది వలస కార్మికులు ఇటలీ రాజధాని రోమ్ కు దక్షిణంగా ఉన్న లాటినా అనే ప్రాంతంలో పనిచేస్తున్నారు. కాగా 31 ఏళ్ల సత్నామ్ సింగ్ చట్టపరమైన పత్రాలేవీ లేకుండా ఇటలీలో పనిచేస్తున్నట్టు ఇటలీ ట్రేడ్ యూనియన్ తెలిపింది. వ్యవసాయ యంత్రంలో చేతిని కోల్పోయిన సత్నామ్ సింగ్ ను చెత్త మూటలా వదిలేసి యాజమాన్యం వెళ్లిపోయిందని మండిపడింది. ఇది హారర్ చిత్రాన్ని తలపిస్తోందని వ్యాఖ్యానించింది.