ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్యలో అమెరికా... ఇంట్రస్టింగ్ వార్నింగ్ ఆగయా!

ఈ సందర్భంగా స్పందించిన ఇరాన్ సుప్రీంనేత అయతుల్లా అలీ ఖమెనీ.. ఇజ్రయెల్ - అమెరికాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Update: 2024-11-04 03:42 GMT

గత నెల ఇరాన్ పై ఇజ్రాయెల్ భారీ స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ పై దాడి విషయంలో ప్రతీకారం తప్పదంటూ ఇరాన్ కాస్తగట్టిగానే హెచ్చరికలు జారీ చేసింది. ఈ సందర్భంగా స్పందించిన ఇరాన్ సుప్రీంనేత అయతుల్లా అలీ ఖమెనీ.. ఇజ్రయెల్ - అమెరికాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఇందులో భాగంగా... శత్రువులు జియోనిస్టులు అయినా, అమెరికా అయినా.. ఇరాన్ కు వ్యతిరేకంగా వారు చేస్తున్న పనులకు తగిన ఫలితం అనుభవిస్తారు. తమపై దాడులకు యత్నించినవారిని కోలుకోలేని దెబ్బ కొడతాం అని ఖమేనీ ఓ వీడియో మెసేజ్ విడుదల చేశారు. దీంతో... అమెరికా స్పందించింది. ఇరాన్ కు హెచ్చరికలు పంపింది!

అవును... ఇజ్రాయెల్ దాడికి తీవ్రంగా స్పందిస్తామంటూ ఇరాన్ సుప్రీంనేత అయాతుల్లా అలీ ఖమేనీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా స్పందించింది. ఇరాన్ సంయమనం పాటించాలని సూచించింది. అలాకాకుండా ప్రతిదాడికి పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ.. తేడా వస్తే ఈసారి ఇజ్రాయెల్ ను ఆపడం తమవల్ల కూడా కాదని క్లారిటీ ఇచ్చింది.

ఇదే సమయంలో ఇటీవల ఇరాన్ పై దాడి సమయంలో... అణు, చమురు క్షేత్రలపై దాడి చేయకుండా ఇజ్రాయెల్ ను నిరోధించామని, టెహ్రాన్ ప్రతిదాడికి పాల్పడితే టెల్ అవీవ్ ను తాము నియంత్రించలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ కు అమెరికా అధికారులు సందేశం పంపినట్లు కథనాలు వెలువడుతున్నాయి.

కాగా... అక్టోబర్ 26న ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భారీస్థాయిలో దాడి చేసిన సంగతి తెలిసిందే. టెహ్రాన్ సహా పలు ప్రావిన్సుల్లో రాడార్ వ్యవస్థలను, డోన్లను, క్షిపణులను తయారు చేసే కేంద్రాలను ధ్వంసం చేసింది.

మరోపక్క... అమెరికాకు చెందిన బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబులు పశ్చిమాసియాకు చేరుకున్నాయని.. యూఎస్ సైన్యానికి చెందిన సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. వీటితో పాటు ఫైటర్ జెట్లు, ట్యాంకర్ ఎయిర్ క్రాఫ్ట్ లు, బాలిస్టిక్ మిస్సైల్స్ కూడా తరలించింది. ఈ సమయంలో ఇరాన్ నుంచి ప్రతిదాడులు వస్తే... పరిస్థితులు ఊహకు అందవు అన్నట్లుగా అమెరికా హెచ్చరించింది.

Tags:    

Similar News