సెంటర్ పాయింట్ పవనేనా ?

నిజానికి నాడూ నేడూ పవన్ కళ్యాణ్ తాను చెప్పదలచుకున్నది సభా వేదికగా గట్టిగానే చెబుతూ వస్తున్నారు.

Update: 2024-11-09 08:30 GMT

ఏపీ రాజకీయాల్లో కింగ్ మేకర్ కావాలని ఒకనాడు ఆలోచించిన పవన్ కి ఇపుడు కాలం కలసి వచ్చింది. ఆయనలో ఆవేశపరుడినే అంతా గతంలో చూశారు. ఇపుడు ఆయన ఆవేశం వెనక అర్ధాలను వెతికే పనిలో పడ్డారు. నిజానికి నాడూ నేడూ పవన్ కళ్యాణ్ తాను చెప్పదలచుకున్నది సభా వేదికగా గట్టిగానే చెబుతూ వస్తున్నారు.

ఆ సమయంలో ఆయన తాను అధికార పక్షమా లేక ప్రతిపక్షమా అన్నది కూడా ఆలోచించరన్నది కూడా అంతా అనుకునే విషయమే. ఆయన జనం కోసం వారి సమస్యల కోసమే మాట్లాడుతారు అని అంటారు. అయితే ఇదే పవన్ గతంలో బిగ్గరగా మాట్లాడితే ఆయన ఆవేశపరుడని అంతా తలచే వారు. ఇక ఆయన పేరుని కొన్ని పార్టీలు పలికేందుకే సంకోచించే పరిస్థితి ఉండేది.

కానీ ఇపుడు సీన్ మొత్తం మారింది. నిజంగా విశ్లేషించుకుంటే 2022 అక్టోబర్ నెలలో జనసేనానిగా పవన్ విశాఖలో పర్యటించారు. ఆ సమయంలో ఆయన మీద అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్భంధం విధించింది. ఆయన ఉంటున్న హొటల్ వద్ద భారీ బందోబస్తుని పెట్టి మరీ ఆయనని కట్టడి చేయడానికి చూశారు. దానిని ప్రతిఘటించి మరీ ఆయన జనంలోకి వచ్చారు. ఆ సంఘటనతో పవన్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

ఇక ఆ తరువాతనే టీడీపీ జనసేన దోస్తీ బాగా పెరిగింది. ఇక సరిగ్గా మరో ఏడాది అంటే 2023 సెప్టెంబర్ లో చంద్రబాబుని అరెస్ట్ చేయడంతో పవన్ బాబు కలసి కూటమి కట్టడానికి అది ఒక చోదక శక్తిగా మారింది. అలా నాటి నుంచి పవన్ ఏపీ రాజకీయాలో అత్యంత కీలకంగా మారిపోయారు. ఆయన లేనిదే పాలిటిక్స్ లేదు అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది.

ఈ రోజున కేంద్రంలో బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చిందంటే ఏపీ నుంచి ఎంపీల మద్దతు కారణం. అలా ఏపీలో కూటమి కట్టి గెలవడం వెనక పవన్ ఉన్నారని బీజేపీ భావించడం బట్టే ఆయనకు ఎక్కువ విలువ ఇస్తోంది అని అంటున్నారు. కేంద్రంలో ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా కూడా పవన్ ని బలమైన శక్తిగా భవిష్యత్తులో ఏపీ రాజకీయాలకు ఆశా కిరణంగా కూడా భావిస్తున్నారు.

ఇంకో వైపు చూస్తే పవన్ పిఠాపురంలో ఆవేశంతో చేసిన ప్రసంగం తరువాత కూటమి ప్రభుత్వం కూడా జోరు పెంచింది. పోలీసులు సోషల్ మీడియా యాక్టివిస్ట్ ల మీద యాక్షన్ కి దిగిపోయారు. ఇలా పవన్ కోరుకున్నదే ఒక విధంగా జరుగుతోంది.

ఏపీలో సుదీర్ఘమైన అనుభవం కలిగిన చంద్రబాబు కూడా తొలిసారి ఎమ్మెల్యే అయి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అంటే కచ్చితంగా ఏపీ పాలిటిక్స్ లో పవన్ స్థానం బలంగా ఉందని చెప్పక తప్పదు అనే అంటున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం పవన్ ని పిలిపించుకుని అపాయింట్మెంట్ ఇచ్చారు అంటే జాతీయ నేతలు సైతం ఆయన అవసరాన్ని గుర్తిస్తున్నారు అని అంటున్నారు.

ఇక వైసీపీ అధినేత జగన్ నోటి వెంట పవన్ అన్న మూడు అక్షరాలు ఎపుడూ వచ్చేవి కావు. కానీ ఇపుడు ఆయన కూడా తమ మీడియా సమావేశాలలో ఒకటికి పది సార్లు ఆయన పేరు చెప్పాల్సి వస్తోంది అంటే పవన్ ఏపీ పాలిటిక్స్ లో ఎంతలా స్పేస్ సంపాదించుకున్నరో అర్థం అవుతోంది అని అంటున్నారు. ఇక్కడ ఒక్క మాటను అంతా అంగీకరిస్తున్నారు.

ఏపీ పాలిటిక్స్ లో నిన్నా నేడూ రేపూ కూడా పవన్ లేకుండా ఆయన కాకుండా ఆయన ప్రమేయాన్ని పక్కన పెట్టి రాజకీయం చేసేది ఉండదనే అంటున్నారు. పవన్ కలయిక ఒకరికి ప్లస్ అయితే ఒకరికి మైనస్. అలాగే పవన్ ఎటు వైపు ఉంటే అటు వైపు విజయం అని అంటున్నారు. ఆయనకు విస్తారంగా ఉన్న అభిమాన గణం, అలాగే బలమైన సామాజిక వర్గం అండదండలు ఇవన్నీ కూడా ఆయన పొలిటికల్ ఇమేజ్ ని రెట్టింపు చేస్తున్నాయి. ఏపీ పాలిటిక్స్ లో ఆయన అవసరాన్ని అనివార్యం చేస్తున్నాయి.

Tags:    

Similar News