కాంగ్రెస్ స్పెషల్ డ్రైవ్ చేస్తోందా ?

ఇతర పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరితే పార్టీకి బాగా హైప్ వస్తుందని సీనియర్ నేతలు నమ్ముతున్నారు.

Update: 2023-11-04 05:37 GMT

రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ స్పెషల్ డ్రైవ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ స్పెషల్ డ్రైవ్ ఎందుకంటే ప్రత్యర్ధి పార్టీల్లోని ప్రముఖ నేతలను ఆకర్షించేందుకే. బీజేపీలోని సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి రెండురోజుల క్రితం కాంగ్రెస్ లో చేరటం ఇందులో భాగమనే అనుకోవాలి. వివేక్ తో ఆగకుండా మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతితో కూడా హస్తంపార్టీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

బీఆర్ఎస్, బీజేపీల్లోని కీలక నేతలు, ద్వితీయశ్రేణి నేతలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టిపెట్టినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇతర పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరితే పార్టీకి బాగా హైప్ వస్తుందని సీనియర్ నేతలు నమ్ముతున్నారు. వారంరోజుల పాటు ఇతర పార్టీల్లోని నేతలను చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ స్పెషల్ డ్రైవ్ మొదలుపెట్టబోతోందట. ఈ స్పెషల్ డ్రైవ్ గనుక సక్సెస్ అయితే ఇదే ఊపు ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించటం ఖాయమని హస్తంపార్టీ నమ్ముతోంది.

స్పెషల్ డ్రైవ్ కారణంగా ఏమవుతుందంటే ఇప్పటివరకు ఊగిసలాటలో ఉన్న నేతలంతా గట్టి నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ లో చేరటం ఖాయమని అనుకుంటున్నారు సీనియర్ నేతలు. ఇప్పటికిప్పుడు ఇలా చేరిన వారికి అందరికీ టికెట్లు ఇవ్వలేకపోవచ్చు. అందుకనే ఇపుడు స్పెషల్ డ్రైవ్ లో చేర్చుకోవాలని అనుకుంటున్న సీనియర్ నేతల్లో ఎక్కువమందిని ఎంపీ ఎన్నికలకు అభ్యర్ధులుగా రెడీ చేయబోతోందని సమాచారం. పార్టీ అధికారంలోకి రాగానే మిగిలిన నేతలకు ఇచ్చిన హామీలకు తగ్గట్లుగా నెరవేర్చాలని కూడా డిసైడ్ అయ్యింది.

ఇదంతా చూస్తుంటే ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పకడ్బందీగా ఎంతటి గ్రౌండ్ వర్క్ చేస్తోందో అర్ధమవుతోంది. విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో గనుక అధికారంలోకి రాకపోతే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు కష్టమనే అనుకోవాలి. ఎందుకంటే 15 ఏళ్ళు అధికారంలో ఉండకపోతే పార్టీ జవసత్వాలన్నీ కోల్పోవటం ఖాయం. ఇపుడు కాంగ్రెస్ పరిస్ధితి దాదాపు ఇలాగే ఉంది. అందుకనే చావో రేవో అన్నట్లుగా సీనియర్లంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నది. మరి ఈ పోరాట పలితం ఎలాగుంటుందో చూడాల్సిందే.

Tags:    

Similar News