అభ్యంతరకర వ్యాఖ్యల ఫలితం... విడిపోనున్న ఇటలీ ప్రధాని జంట!

వివరాళ్లోకి వెళ్తే... ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన భాగస్వామి ఆండ్రియా గియాంబ్రునోతో విడిపోతున్నారు. ఈ సందర్భంగా తమ పదేళ్ల బంధం ముగిసిపోయిందని సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రకటన చేశారు.

Update: 2023-10-20 11:37 GMT

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. అదుపు.. మాట పొదుపు అని మరికొందరంటారు. కాలు జారినా తీసుకోవచ్చు కానీ.. నోరు జారితే తీసుకోలేమని ఇంకొందరంటారు. ఎవరు ఎలా చెప్పినా.. ఏదైనా విషయంపై మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి, ఆచి తూచి మాట్లాడాలని అర్ధం. అలా కానిపక్షంలో జరిగే ఉపద్రవాలు ఏ స్థాయికైనా చేరిపోతాయి. ఇప్పుడు ఆ నోటి మాట ఫలితంగా ఇటలీ ప్రధాని జంట విడిపోబోతోంది!


అవును... అత్యాచార ఘటనల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో... "అత్యాచారాన్ని నివారించాలంటే.. మీరు స్పృహ కోల్పోకుండా ఉండాలి" అంటూ చేసిన వ్యాఖ్యలు ఇటలీ ప్రధాని జంట విడిపోవడానికి ప్రధాన కారణం. ఇటలీ ప్రధాని భర్త... మహిళలు సృహ కోల్పోయే స్థాయిలో తాగడం వల్ల అత్యాచారలు జరుగుతున్నాయన్నట్లుగా మాట్లాడటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. తీవ్ర విమర్శలకు దారితీసింది.

వివరాళ్లోకి వెళ్తే... ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన భాగస్వామి ఆండ్రియా గియాంబ్రునోతో విడిపోతున్నారు. ఈ సందర్భంగా తమ పదేళ్ల బంధం ముగిసిపోయిందని సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రకటన చేశారు. అయితే... ఇటీవల ఆమె భర్త గియాంబ్రునో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలే ఈ బంధం బీటలు వారడానికి కారణమైందని తెలుస్తోంది.

దేశంలో వెలుగుచూసిన సామూహిక అత్యాచార ఘటనల గురించి కొద్దినెలల క్రితం గియాంబ్రునో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ విషయాలపై స్పందించిన ఆయన... "మీరు సరదాగా గడిపేందుకు వెళ్లినప్పుడు తాగుతారు. అయితే ఆ సమయంలో అతిగా మద్యం సేవించకుండా ఉంటే.. మీరు ఇబ్బందుల్లో పడరు. అత్యాచారాన్ని నివారించాలంటే.. మీరు స్పృహలో ఉండాలి" అంటూ వ్యాఖ్యానించారు.

అంటే... దేశంలో జరుగుతున్న అత్యాచారాలకు అమ్మాయిలే కారణం అని, వారు సృహకోల్పోయేలా తాగడం వల్లే రేప్ లు జరుగుతున్నాయన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారంటూ తీవ్ర విమర్శలు వెళ్లువెత్తాయి. దీంతో... డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు ఉపక్రమించారు గియాంబ్రునో.

ఇందులో... మద్యం సేవించేందుకు, డ్రగ్స్‌ కోసం యువత బయటకు వెళ్లొద్దని చెప్పడమే తన ఉద్దేశ్యం అని సన్నాయి నొక్కులు నొక్కారు. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. దీంతో ఇటలీ ప్రధాని స్పందించారు. తన భాగస్వామి ప్రవర్తనతో తనపై ఒక అంచనాకు రావొద్దని, ఆయన ప్రవర్తనపై భవిష్యత్తులో తాను ఎలాంటి సమాధానాలు ఇవ్వనని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో... ఇక అలసిపోయారో, విసిగిపోయారో తెలియదు కానీ... ఇటలీకి తొలి మహిళా ప్రధాని అయిన జార్జియా మెలోనీ ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా... "ఆండ్రియా గియాంబ్రునోతో పదేళ్ల నా అనుబంధం ఇప్పటితో ముగిసిపోయింది. కొంతకాలంగా మేం ప్రయాణించే దారులు మారాయి. ఆ విషయాన్ని గుర్తించే సమయం ఆసన్నమైంది" అని పేర్కొంది. వీరిద్దరికీ ఒక కుమర్తె ఉంది!

Tags:    

Similar News