పవన్ గురించి జగన్... వాటే చేంజ్ !
ఇక ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న మంత్రులు మాజీ మంత్రులు సరేసరి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో ఎన్నికల ముందు వరకూ జగన్ కానీ వైసీపీ నేతలు కానీ పూర్తి స్థాయిలో విరుచుకుపడేవారు. జగన్ అయితే ఆయన వ్యక్తిగత విషయాల్లో కూడా ప్రస్తావిస్తూ కామెంట్స్ చేసేవారు. ఇక ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న మంత్రులు మాజీ మంత్రులు సరేసరి. పవన్ మీద అంతా ఒక్కటిగా చేరి తమ బాణాలు ఎక్కుపెట్టేవారు.
ఇక ఎన్నికలు ముగిసిన తరువాత పూర్తిగా వైసీపీలో మార్పు వచ్చింది. అది కూడా జగన్ స్థాయి నుంచే అయి చెప్పాలి. గత నాలుగు నెలలుగా పవన్ ని ఒక్క మాట కూడా అనడం లేదు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ పవన్ పేరుని కూడా తలవకుండా దత్తపుత్రుడు ని పేరు పెట్టి ర్యాగింగ్ చేసేవారు.
కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన సాయంత్రమే మీడియా ముందుకు వచ్చి తన రెస్పాన్స్ తెలియచేస్తూ పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు అని చెప్పారు. ఆ తరువాత ఆయన పవన్ గురించి ఏ మాత్రం విమర్శలు చేయడం లేదు. వైసీపీ నేతలు అలాగే ఉన్నారు.
అటువంటి జగన్ పిఠాపురం వచ్చారు. వరద బాధితుల పరామర్శ కోసం వచ్చిన ఆయన పవన్ సొంత నియోజకవర్గంలో ఆయన మీద విమర్శలు ధాటీగా చేస్తారు అని అందుకే పిఠాపురాన్ని ఎంచుకున్నారు అని అనుకున్నారు. కానీ జగన్ తన విమర్శలు అన్నీ బాబు మీదనే ఎక్కు పెట్టారు. పైగా పవన్ ప్రస్తావన ఆయనే తెస్తూ పాపం పవన్ కళ్యాణ్ అన్నారు.
పవన్ సినిమా స్టార్ అని కూడా అన్నారు. కానీ ఆయనను మించిపోయిన డ్రామా ఆర్టిస్టు చంద్రబాబు అన్నారు. పవన్ కొత్తగా బాధ్యతలు చేపట్టారు. కానీ అన్నీ తెలిసిన చంద్రబాబు మాత్రం అచ్చమైన డ్రామా ఆర్టిస్టు అయిపోయారు అని జగన్ నిందించారు. ఈ విధంగా పవన్ మీద పాపం అంటూ పాజిటివ్ గా జగన్ రియాక్ట్ కావడం చూసిన వారు వాటే చేంజ్ అనుకుంటున్నారు.
పవన్ పేరు ఎత్తడానికే సంకోచించే జగన్ ఇపుడు ఆయన మీద ఒక విధంగా సాఫ్ట్ కార్నర్ తో ఉంటున్నారు అనడానికి ఆయన తాజా ప్రెస్ మీట్ నిదర్శనం అని అంటున్నారు. మరో వైపు చూస్తే పవన్ వల్లనే బాబుకు అధికారం దక్కింది అని వైసీపీ అసలైన విశ్లేషణ. పవన్ ని టార్గెట్ చేసి తాము నష్టపోయాం అన్న ఆలోచన కూడా ఉంది. అందుకే పవన్ ని ఏమీ అనకుండా జాగ్రత్త పడుతున్నారు అని అంటున్నారు.
చంద్రబాబునే టార్గెట్ చేయడం ద్వారా పొలిటికల్ గా మైలేజ్ ని అందుకోవడమే కాకుండా మరో వైపు రాజకీయంగా కూడా ముందు ముందు మారే పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు రూపొందించుకోవచ్చు అన్న లెక్కలేవో ఉండే ఉంటాయని అంటున్నారు. మొత్తానికి పవన్ విషయంలో జగన్ చాలానే మారారు అని అంటున్నారు. ఆయన మీద పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతున్నారు అని అంటున్నారు మరి ఇది ఏపీ రాజకీయాల్లో ఒక కీలకమైన మార్పుగా చూడాలా అంటే దీని మీద ముందు ముందు మరింత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది అని అంటున్నారు.