జగన్‌కు 'కోడికత్తి' సెగ.. ఇంకా లాగితే.. రాజకీయంగా మైనస్సే..!
విశాఖ విమానాశ్రయంలో 2018లో వైసీపీ అధినేత, అప్పటి విపక్ష నాయకుడు జగన్‌పై కోడికత్తి దాడి జరిగిన విషయం తెలిసిందే.
విశాఖ విమానాశ్రయంలో 2018లో వైసీపీ అధినేత, అప్పటి విపక్ష నాయకుడు జగన్‌పై కోడికత్తి దాడి జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో దీనిని ఆయనపై జరిగిన హత్యాయత్నంగా వైసీపీ ప్రొజెక్టు చేసింది. దీని వెనుక చంద్రబాబు ఉన్నారని కూడా చెప్పింది. పెద్ద ఎత్తునదుమారం రేగింది. ఈ క్రమంలో కోడికత్తి తో దాడికి దిగిన జనుపల్లి శ్రీనివాసరావును అరెస్టు చేశారు. జైల్లో పెట్టారు. సుదీర్ఘ జైలు జీవితంలో ఆయన బెయిల్ పొందే ప్రయత్నం చేసినా.. జగన్ సాక్ష్యం చెప్పకపోవడంతో అది కూడా దక్కలేదు.
ఈ విషయంలో జనుపల్లి కుటుంబం రోడ్డెక్కింది. ఎట్టకేలకు ఎన్ ఐఏ అధికారులు ఈ ఘటనలో ఎలాంటి ఉద్దేశం లేదని.. జగన్‌ను చంపాలన్న ఉద్దేశం అసలే లేదని తేల్చి చెప్పారు. దీంతో విశాఖలోని ఎన్ ఐఏ కేసులు విచారించే కోర్టు జనుపల్లికి బెయిల్ ఇచ్చింది. అయితే.. ఈ కేసు విచారణ మాత్రం కొనసాగు తోంది. ఇక, ఇప్పుడు సాక్షిగా(బాధితుడిగా కూడా) ఉన్న జగన్ కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ, జగన్ సీఎం గా ఉన్న సమయంలో తాను ముఖ్యమంత్రినని, పాలనలో బిజీగా ఉన్నానని తప్పించుకున్నారు.
కానీ, ఇప్పుడు కూడా తాజాగా జరిగిన విచారణకు జగన్ హాజరు కాలేదు. దీనిని సీరియస్‌గా తీసుకున్న జనుపల్లి తరఫు న్యాయవాది.. జగన్‌ను సూటిప్రశ్నలతో నిలదీశారు. ``జగన్ ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేనే కదా.. కోర్టులో విచారణకు హాజరుకావడానికి ఆయనకు ఇబ్బంది ఏమిటి..?`` అని న్యాయవాది ప్రశ్నించారు. మరోవైపు ఈ కేసు జగన్ హాజరు కోసం.. వచ్చే నెల 15కు వాయిదా వేశారు. దీంతో అప్పుడు ఖచ్చితంగా జగన్ హాజరు కాకతప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
ఎందుకంటే.. బాధితుడిగా ఉన్న వ్యక్తి వచ్చి సాక్ష్యం చెప్పకపోతే.. ఈ కేసును కొట్టేసేందుకు కోర్టుకు సర్వహక్కులూ ఉన్నాయి. ఇదే విషయాన్ని సలీం చెప్పుకొచ్చారు. మరోవైపు.. జగన్‌కు కూడా ఈ కేసును కొట్టివేస్తే.. రాజకీయంగా మరింత ఇబ్బంది వస్తుందన్న సంకేతాలు వస్తున్నాయి. ఎందుకంటే.. 2019 ఎన్నికల్లో ఈ కేసును వాడుకున్నారు. ఎన్నికల్లో ఆదిక్యం కూడా తెచ్చుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఆయన కారణంగానే కేసును కొట్టేసే పరిస్థితి వస్తే.. జగన్ రాజకీయంగా మరింత ఇబ్బంది పాలవడం ఖాయం. అందుకే కోర్టుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడనుందని అంటున్నారు పరిశీలకులు.