జనంతోనే జగన్ పందెం...ఏపీ ఎలక్షన్ వెరీ ఇంటరెస్టింగ్...!
అయితే జగన్ మాత్రం జనాలనే దేవుళ్ళుగా భావిస్తున్నారు. తనకు పైన దేవుడు, ఎదురుగా కనిపించే దేవుళ్ళు అయిన జనాలే ముఖ్యం అని అనేక సార్లు జగన్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
భగవంతుడితోనే భక్తుడు పందెం కడతాడు. ఏకంగా పరీక్ష కూడా పెడతాడు. ఇది ఎన్నో పురాణ గాధలలో ఉంటుంది. చివరికి ఆ దేవుడే తన భక్తుడిని గెలిపించి భక్తిని లోకానికి చాటుతాడు. ఇక రాజకీయాల్లోకి వస్తే జనాలే దేవుళ్ళు అని రాజకీయ పార్టీల అధినేతలు తరచూ అంటూ ఉంటారు. కానీ మనసు లోపల మాత్రం తామే అసలైన దేవుళ్ళమని భావన ఉంటుంది.
అయితే జగన్ మాత్రం జనాలనే దేవుళ్ళుగా భావిస్తున్నారు. తనకు పైన దేవుడు, ఎదురుగా కనిపించే దేవుళ్ళు అయిన జనాలే ముఖ్యం అని అనేక సార్లు జగన్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. తన గెలుపుని ఖాయం చేసేది ఆ ఇద్దరే తప్ప ఎవరూ కాదని నికరంగా నిజాయతీగా నమ్మే ఏకైక నాయకుడు బహుశా జగన్ తప్ప ఎవరూ ఉండరేమో.
నిజంగా జనం మీద జగన్ కి అంత గురి అని కూడా అంటారు. తాను ప్రజలకు మేలు చేశాను ఇచ్చిన హామీలను తుచ తప్పకుండా నెరవేర్చాను ఇక తనను గెలిపించాల్సింది ప్రజలే అన్నది జగన్ నమ్మకం. అదే ఆయన ఫిలాసఫీ. టాలీవుడ్ డైరెక్టర్ ఆర్జీవీ అన్నట్లుగా జగన్ కి ఏ వ్యూహాలు లేవు. ఉండవు కూడా. ఆయనది అంతా కుండబద్ధలు కొట్టే తత్వం.
లేకపోతే నూరు రోజూలకు పైగా ఇంకా అధికారం ఉంది. ఎమ్మెల్యేలను అంతవరకూ కూడా ఉంచుకోవచ్చు. వారిని మభ్యపెట్టి టికెట్ విషయంలో ఊరించవచ్చు. అలా కాకుండా ఉన్నది ఉన్నట్లుగా జగన్ చెప్పడంలోనే నిజాయతీ కనిపిస్తోంది. అదే టైం లో మీకు నేను అన్ని విధాలుగా చూసుకుంటాను ఆ మీదట మీ ఇష్టం అని చెప్పేస్తున్నారు. జగన్ పట్ల విశ్వాసం ఉన్న వారు టికెట్ రాకపోయినా సైలెంట్ గా ఉంటున్నారు.
అలా కుదరదు అనుకుంటున్న వారు మాత్రం ఫిరాయిస్తున్నారు. ఇది కూడా జగన్ లైట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరి ఫిలాసఫీ వారిది. జగన్ సిద్ధాంతం అయితే తాను ఎంత గాఢంగా జనాలను నమ్ముకున్నానో అంతే గట్టిగా తనను నమ్మమనే పార్టీ వారిని కోరుతున్నారు. కానీ ట్రెడిషనల్ పాలిటిక్స్ చేసేవారిలో అలా ఉండదు.
వారికి రేపటి బాధ ఉంటుంది. పదవి పోయినా రాకపోయినా ఇబ్బంది అవుతుంది అనుకున్న వారూ ఉంటారు. మొత్తానికి చూస్తే జగన్ సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి చెప్పినా మరొకరు చెప్పినా సాక్ష్యాత్తు జగనే అనేక సభలలో చెప్పినా జనాలే జగన్ ధీమా. వారే అతనికి కొండంత ధైర్యం. వారినే నమ్ముకుని జగన్ 2024 ఎన్నికల కురుక్షేత్రంలోకి వస్తున్నారు.
దేవుడిని నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోరు అని ఒక సామెత ఉంది. అలాగే జనాలను నమ్ముకున్న వారు కూడా చెడిపోయిన దాఖలాలు లేవు. దీనికి తెలుగు రాజకీయాలలోనే అచ్చమైన ఉదాహరణ ఎన్టీయార్. జగన్ ది వైసీపీ అయినా ఆయనకు దివంగత నేత ఎన్టీయార్ కి ఎన్నో విషయాల్లో పోలికలు ఉన్నాయి. ఎన్టీయార్ కూడా జనాలనే నమ్ముకుని రాజకీయాలు చేసేవారు.
చాలా డేరింగ్ గా స్టెప్స్ వేసేవారు. ఆయన కూడా ఎపుడూ రాజకీయాల్లో కూడికలూ తీసివేతలు గురించి ఆలోచించలేదు. వాటిని చూసి కలవరపడలేదు, ఎక్కడా అదరలేదు, బెదరలేదు. 1995 ఆగస్టు ఎపిసోడ్ లో వెన్నుపోటుతో ఎన్టీయార్ గద్దె దిగారు కానీ ఆయనకు దేవుడు మరింత కాలం ఆయుష్షు ఇచ్చి ఉంటే 1996లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కచ్చితంగా ఎన్టీయార్ మెజారిటీ ఎంపీ సీట్లు గెలిచేవారు అనేది అప్పటికీ ఇప్పటికీ ఒక కఠిన రాజకీయ విశ్లేషణగా చాలా మంది చెబుతారు.
అంటే ఎన్టీయార్ పట్ల జనానికి అంతటి అభిమానం ఉంది అని అంటారు. అలా నేరుగా జనాలతో కనెక్షన్ పెట్టుకుని రాజకీయాలు చేసే నేతలు బహు అరుదుగా ఉంటారు. జగన్ కూడా ఆ కోవలోకే వస్తారు. ఇక్కడ మరో విషయం కూడా చూడాలి. జగన్ ని చూసే జనాలు ఓటు వేస్తారు. ఆయన పాలన రేపటి ఎన్నికల్లో తీర్పునకు వస్తుంది. ఇచ్చిన హామీలను నెరవేర్చే నాయకుడు మళ్లీ కావాలా అని జగనే జనాలలోకి వెళ్లి అడుగుతారు. తాను మేలు చేస్తేనే ఓటు వేయమని ఇప్పటికే ఆయన కోరుతున్నారు.
ప్రజలతోనే ఆయన విధంగా రాజకీయ పందెం కాస్తున్నారు. ముందే చెప్పినట్లుగా ఆయన పార్టీని అభ్యర్ధులను టెక్నికల్ అంశాలుగానే చూస్తున్నారు. జనానికి జగన్ పాలన నచ్చితే మళ్ళీ 151 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని నిబ్బరంగా అడుగులు వేస్తున్నారు ఈ నేపధ్యంలో పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్లినా వైసీపీ పట్టించుకోవడంలేదు.
మెటీరియల్ ఉంటేనే ఏ మేస్తీ అయినా అందమైన భవనం కడతారు. వైసీపీలో నిండుగా మెటీరియల్ ఉందని జగన్ నమ్ముతున్నారు. అలా ఆయన 2024 ఎన్నికలను ఫేస్ చేస్తున్నారు. సో అలా కనుక చూసుకుంటే ఏపీలో ఈసారి జరిగే ఎన్నికలు వెరీ ఇంటరెస్టింగ్ అనే చెప్పాలి.