‘‘68’’ సీట్ల మీదనే జగన్ ఫుల్ ఫోకస్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్న నినాదాన్ని తీసుకున్న వైనాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తుంటారు.;
అసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం తప్పేం కాదు. డ్రీం బిగ్ అన్నట్లుగా చారిత్రక విజయం ఎప్పుడూ అసాధారణ లక్ష్యంతోనే మొదలవుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్న నినాదాన్ని తీసుకున్న వైనాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తుంటారు. సాపేక్షంగా చూస్తే.. ఇదేమీ అసాధ్యమైన అంశం కాదు. ఎందుకంటే.. మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఒక వర్గం తీవ్రమైన వ్యతిరేకతతో ప్రచారం చేస్తున్నప్పటికి ఏపీ అధికార పార్టీకి సానుకూలాంశాలు ఎక్కువగా ఉండటం దేనికి సంకేతం? అదే సమయంలో ఆ పార్టీ ప్రత్యర్థులైన టీడీపీ.. జనసేన.. బీజేపీలు విజయం కోసం చెమటలు చిందించటం చూస్తేనే.. వైసీపీ ఎంత బలంగా ఉందన్న విషయం అర్థమవుతుంది.
అలాంటప్పుడు వైనాట్ 175? అంటూ నినదించటం అత్యాశేమీ కాదన్న మాట వినిపిస్తోంది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య రీతిలో 151 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ ఇప్పుడు అంతకు మించిన స్థానాల్లో గెలుపు సాధ్యమేనా? అంటే అవునన్న సమాధానం వస్తోంది. కాకుంటే.. చిన్నపాటి ఫార్ములాను ఫాలో అయితే అనూహ్య గెలుపు పక్కా అన్న వాదనను వినిపిస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలిచిన 151 స్థానాల్ని చూస్తే.. అందులో కనిష్ఠంగా ఉన్న మెజార్టీ ‘‘25’’ ఓట్లు అయితే.. గరిష్ఠంగా వచ్చిన మెజార్టీ ‘‘90,110’’. ఈ గణాంకాలతో ఏం చెప్పబోతున్నారంటారా? కాస్త డిటైల్డ్ గా చదివేయండి.
గత ఎన్నికల్లో గెలిచిన 151 స్థానాల్లో పది వేల కంటే తక్కువ మెజార్టీ వచ్చిన సీట్లు 44. ఓడిన సీట్లు 24 (తెలుగుదేశం 23, జనసేన 1) మొత్తంగా 68 సీట్లు. వీటిల్లో 12 అసెంబ్లీ స్థానాల్లో 5 వేల కంటే తక్కువ మెజార్టీతో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో 22 మంది ఎమ్మెల్యేలు ఐదు వేల నుంచి పది వేల లోపు మెజార్టీతో విజయం సాధించారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో డేంజర్ బెల్ మోగించే నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయంటే ఇవే అవుతాయి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో పది వేలకు మించి మెజార్టీ సాధించటం అంటే.. మెజార్టీలో 30 శాతం తగ్గినా కూడా గెలుపు ధీమా ఉన్నట్లే.
అందుకే పది వేల కంటే తక్కువ మెజార్టీ వచ్చిన 44 స్థానాలతో పాటు విపక్షాలు గెలిచిన 24 స్థానాల మీద ప్రత్యేక శ్రద్ధను ప్రదర్శిస్తే వైనాట్ 175కు దగ్గరగా వెళ్లొచ్చన్న మాట వినిపిస్తోంది. అధికార పార్టీగా తొలుత తాను ఓడిన 24 స్థానాల మీద ఎక్కువ ఫోకస్ చేయటంతోపాటు.. 5వేల కంటే తక్కువ మెజార్టీ వచ్చిన 12 స్థానాల మీద ప్రత్యేక ఫోకస్ పెడితే అనూహ్య ఫలితాలకు అవకాశం ఉంటుందన్న మాట వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఐదు వేల కంటే తక్కువ మెజార్టీ వచ్చిన 12 నియోజకవర్గాల్ని చూస్తే..
నియోజకవర్గం మెజార్టీ
విజయవాడ సెంట్రల్ 25
తిరుపతి 708
పొన్నూరు 1,112
నెల్లూరు సిటీ 1,988
తణుకు 2,195
నగరి 2,708
కొత్తపేట 4,038
ఏలూరు 4,072
ఎలమంచిలి 4,146
తాడికొండ (ఎస్సీ) 4,433
ప్రత్తిపాడు 4,611
జగ్గయ్యపేట 4,778
అదే సమయంలో 10వేల కంటే తక్కువ మెజార్టీ వచ్చిన 22 స్థానాలు.. వాటి మెజార్టీని చూస్తే..
రామచంద్రపురం 5,168
మంగళగిరి 5,337
కర్నూలు 5,353
ముమ్మిడివరం 5,547
శ్రీకాకుళం 5,777
మచిలీపట్టణం 5,851
విజయనగరం 6,417
నరసాపురం 6,436
ప్రత్తిపాడు (ఎస్సీ) 7,398
తాడిపత్రి 7,511
విజయవాడ వెస్ట్ 7,671
పెడన 7,839
పీలేరు 7,874
అనకాపల్లి 8,169
చిలకలూరిపేట 8,301
బొబ్బిలి 8,352
భీమవరం 8,357
కాకినాడ రూరల్ 8,789
సంతనూతలపాడు 9,078
కైకలూరు 9,357
భీమిలి 9,712
వేమూరు (ఎస్సీ) 9,999
పది వేల కంటే తక్కువ మెజార్టీ వచ్చిన 34 స్థానాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టటం ద్వారా అనూహ్య ఫలితాలకు అవకాశం ఉంటుంది. ఆ దిశగా వైసీపీ ఇప్పటికే వ్యూహ రచన చేసిందన్న మాట వినిపిస్తోంది. దీనికి విరుగుడుగా విపక్షాలు ఎలా రియాక్టు అవుతాయో చూడాలి.