కరెక్ట్ టైంలో కేసీయార్ తో జగన్ భేటీ...మ్యాటర్ సీరియస్ నా..!?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏమి చేసినా సంచలనమే. దానికి కారణం ఆయన ట్రెడిషనల్ గా ఏదీ చేయరు, అలా ఆలోచించరు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏమి చేసినా సంచలనమే. దానికి కారణం ఆయన ట్రెడిషనల్ గా ఏదీ చేయరు, అలా ఆలోచించరు. ఆయన పొలిటికల్ స్టైల్ భిన్నంగా ఉంటుంది. ఏపీ పాలిటిక్స్ లో ఒక విధంగా జగన్ స్టైల్ కార్పోరేట్ కల్చర్ తో సాగుతుంది అని కూడా చెబుతారు ఇదిలా ఉంటే జగన్ ఇపుడు సడెన్ గా తెలంగాణా మాజీ సీఎం కేసీఆర్ ని కలవబోతున్నారు.
హైదరాబాద్ వెళ్తున్న జగన్ నేరుగా కేసీఆర్ ఇంటికి వెళ్ళి ఆయన్ని పరామర్శిస్తారు అని అంటున్నారు. ఎందుకు అంటే తెలిసిన విషయమే. కేసీఆర్ తన ఫాం హౌజ్ లో బాత్ రూం లో కాలు జారి పడి ఆయన తుంటి ఎముకకు గాయం అయింది. దాంతో ఆయనకు ఆపరేషన్ కూడా చేశారు. ఇపుడు ఆయన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే కేసీఆర్ ని అందరూ పరామర్శించారు. ఆయనకు గాయం అయి నెల అయింది. ఇపుడు ఏపీ సీఎం జగన్ కేసీఆర్ ని పరామర్శిస్తారు అని అంటున్నారు. ఇందులో తప్పు లేదు కానీ ఆయన వెళ్తున్న టైం తోనే హాట్ డిస్కషన్ స్టార్ట్ అయింది.
ఏపీలో అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. దాంతో జగన్ ఆ పనిలో బిజీగా ఉన్నారు. ఈ టైం లో కేసీఆర్ తో భేటీ కావడం మీదనే అంతా చర్చించుకుంటున్నారు. అయితే గత నెలలోనే కేసీఆర్ ని జగన్ పరామర్శించాల్సి ఉందని అయితే ఆ టైం లో ఎక్కువ మంది పరామర్శకు వస్తే ఆయనకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది అని వైద్యులు సూచించడంతో జగన్ అప్పట్లో పరామర్శను వాయిదా వేశారు అని అంటున్నారు.
దీంతో కేసీఆర్ ని పరామర్శించేందుకు ప్రత్యేకంగా ఏపీ సీఎం జగన్ ఈ నెల 4న అంతే గురువారం హైదరాబాద్ వెళ్తున్నారు. ఇక కేసీఆర్ ఇంటికి లంచ్ మీటింగ్ కి కూడా జగన్ హాజరవుతారు అని అంటున్నారు. కేసీఆర్ కి జగన్ కి మధ్య మొదటి నుంచి మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ ఇద్దరు నాయకులు ఒకరి గురించి మరొకరు మంచిగా ఆలోచించేవారే అని రాజకీయ వర్గాలలో చర్చ కూడా ఉంది.
ఏపీకి సీఎం గా జగన్ కావాలని కేసీఆర్ కోరుకున్నారని ప్రచారం ఉంది. అలాగే మరోసారి బీఆర్ఎస్ తెలంగాణాలో అధికారంలోకి రావాలని వైసీపీ కోరుకుంది అని కూడా అంటారు. రాజకీయాలకు అతీతంగా ఈ ఇద్దరి మధ్యన బంధం ఉంది. ఇక తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఆయన పూర్వాశ్రమంలో టీడీపీలో చురుకైన నాయకుడు.
అంతే కాదు చంద్రబాబుకు సన్నిహితుడు అని పేరుంది. అదే టైం లో జగన్ సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరి ఏపీ పాలిటిక్స్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపధ్యంలో కేసీఆర్ జగన్ ల మధ్య భేటీలో అనేక విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉందా అని కూడా ఆలోచిస్తున్న వారు ఉన్నారు. ఏది ఏమైనా చాలా కాలం తరువాత కేసీఆర్ జగన్ భేటీ మాత్రం ఫుల్ మీడియా ఫోకస్ కి చాన్స్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు అంటున్నారు.