కేంద్ర ప్రభుత్వం పడిపోతే అప్పుడెలా?

కేంద్ర రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని మోదీ బలంగా కోరుకుంటున్నారు.

Update: 2024-12-18 05:36 GMT

కేంద్ర రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని మోదీ బలంగా కోరుకుంటున్నారు. తరచూ ఎన్నికలు రావడం వల్ల డెవలప్మెంట్ నిలిచిపోతుందని చెబుతున్నారు. అయితే ఈ బిల్లుక పార్లమెంటు ఆమోదం లభిస్తుందా? కేంద్ర ప్రభుత్వమే పదవీకాలానికి ముందు పడిపోతే అప్పుడేం చేస్తారు?

జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్డడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఒక దేశం ఒకే ఎన్నిక భావనతో ముందుకొచ్చిన జమిలి బిల్లుతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆటంకం లేని పాలన కోసం మొదలైన కసరత్తు ఎలాంటి ముగింపునిస్తుంది? ఏదైన రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో కూలిపోతే తదుపరి సార్వత్రిక ఎన్నికల వరకు రాష్ట్రపతి పాలన విధించడమో, మధ్యాంతర ఎన్నికలు నిర్వహిస్తే మిగిలిన గడువుకే కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. మరి కేంద్రంలో ప్రభుత్వమే మధ్యలో పడిపోతే అప్పుడు ఏం చేస్తారనే కీలక ప్రశ్నకు సరైన సమాధానం లభించడం లేదు.

వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అంటూ గద దశాబ్ద కాలంగా బీజేపీ నినదిస్తోంది. వివిధ దశలు, చర్చలు జరిగిన తర్వాత ఎట్టకేలకు పార్లమెంటు ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఈ ప్రతిపాదనకు పార్లమెంట్లో 2/3 వంతు మెజార్టీ అవసరం. ప్రస్తుతం కేంద్రంలో అధికారం చలాయిస్తున్న ఎన్డీఏకి ఆ స్థాయిలో బలం లేకపోవడంతో ప్రతిపక్షాల మద్దతు అవసరం. ఇంతటి కీలకమైన బిల్లుకు ప్రతిపక్షాలు ఆమోదం తెలుపుతాయా? లేదా? అనే విషయం పక్కన పెడితే ఈ బిల్లుపై కొన్ని సందేహాలు జమిలి బిల్లుకు చిక్కులు తెచ్చేలా కనిపిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేది ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. దీనికి ప్రాతిపదికగా 2029 సార్వత్రిక ఎన్నికలను తీసుకున్నారు. ఆ సమయానికి దేశవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీలను రద్దు చేసి పార్లమెంట్ తోపాటే రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ ఎన్నిక తర్వాత దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా పదవీకాలానికి ముందే సభ్యుల విశ్వాసం కోల్పోయి, మధ్యాంతర ఎన్నికలు నిర్వహించాల్సివస్తే, తదుపరి సార్వత్రిక ఎన్నికల వరకు మిగిలిన పదవీకాలానికి ఎన్నిక నిర్వహిస్తామని బిల్లులో స్పష్టం చేశారు. అయితే రాష్ట్రాల వరకు దీనిపై క్లారిటీ ఉన్నా, కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటు విశ్వాసాన్ని కోల్పోతే అప్పుడు ఏం చేస్తారనేది మిస్టరీగా మారింది.

మన దేశంలో మధ్యాంతర ఎన్నికలు జరగడమనేది కొత్తేమీ కాదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1952లో కేంద్ర, రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. 1968లో హర్యానా, కేరళ రాష్ట్రాలకు మధ్యాంతరం రావడంతో బ్రేక్ పడింది. ఆ తర్వాత 1970లో కేంద్ర ప్రభుత్వం రద్దు కావడంతో పార్లమెంటుకు రాష్ట్రాలకన్నా ముందే ఎన్నికలు నిర్వహించాల్సివచ్చింది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల ఎన్నికలు రకరకాల సమయాల్లో జరగడం మొదలైంది. ఇక 1996 నుంచి 1999 మధ్య మైనార్టీ ప్రభుత్వాలు ఏర్పడటంతో పార్లమెంటుకు మధ్యాంతర ఎన్నికలు జరిగాయి. 2004 నుంచి 2024 వరకు యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు సంపూర్ణ మెజార్టీతో ఏర్పడ్డాయి.

2014, 2019 ఎన్నికల్లో బీజేపీకి సింగిల్గా మెజార్టీ ఉండటంతో ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగుతోంది. 2024లో బీజేపీకి సొంతంగా బలం లేకపోయినా ఎన్డీఏ కూటమి పార్టీల మద్దతుతో మోదీ ప్రభుత్వం మూడోసారి కొలువుదీరింది. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వానికి ముప్పేమీ లేకపోయినా, భవిష్యత్లో కూటమి మధ్య భేదాభిప్రాయాలు పొడచూపితే? పరిస్థితి ఎక్కడికైనా దారితీయొచ్చు. అదేవిధంగా 2029 తర్వాత ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ లభించకపోతే సంకీర్ణ ప్రభుత్వాలే పాలన సాగించొచ్చు. మన దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఎంతటి స్థిరత్వంతో పనిచేశాయనే అనుభవం ఉంది. ఈ పరిస్థితుల్లో జమిలి ఎన్నికల బిల్లులో ఈ ప్రశ్నకు ఎలాంటి సమాధానం లభిస్తుందనే ఆసక్తి వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News