హిజ్ బుల్లా చీఫ్ కోసం జమ్మూకశ్మీర్ లో నిరసనలు.. వీడియో!

లెబనాన్ తీవ్రవాద గ్రూపు హెజ్ బొల్లాకు ఊహించని షాక్ తగిలిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-29 03:31 GMT

లెబనాన్ తీవ్రవాద గ్రూపు హెజ్ బొల్లాకు ఊహించని షాక్ తగిలిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హెజ్ బొల్లా అధినేత హసన్ నస్రల్లా (64) మృతిచెందారు. ఈ విషయాన్ని అటు ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) తో పాటు ఇటు హెజ్ బొల్లా కూడా ధృవీకరించింది. ఈ సమయంలో ఆ హత్య ఎఫెక్ట్ జమ్మూకశ్మీర్ లో కనిపించడం గమనార్హం.

అవును... ఐడీఎఫ్ దాడుల్లో హెజ్ బొల్ల అధినేత హసన్ నస్రల్లా మృతి చెందారు. ఈ సందర్భంగా స్పందించిన ఐడీఎఫ్... హసన్ నస్రల్లా ఇక ఈ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేయలేడు అని ఎక్స్ వేదికగా వెళ్లడించింది. మరోపక్క... నస్రల్లా మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెజ్ బొల్లా, రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించాయి.

మరోపక్క.. హిజ్ బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యను ఖండిస్తూ జమ్మూకశ్మీర్ లో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. బుద్గామ్ లో నిర్వహించిన నిరసన ప్రదర్శనల్లో మహిళలు, పిల్లలు సహా పెద్ద సంఖ్యలో ప్రజలు హిజ్ బుల్లా చీఫ్ ఫోటోలు పట్టుకుని నిరసన తెలిపారు.

ఇదే సమయంలో ఈ హత్యను ఖండిస్తూ జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. లెబనాన్ & గాజా అమరవీరులకు ముఖ్యంగా హసన్ నసరుల్లాకు సంఘీభావంగా తన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపిన ఆమె.. పాలస్తీనా & లెబనాన్ ప్రజలకు తాము అండగా నిలుస్తామని పేర్కొన్నారు.

కాగా.. ఇరాన్ మద్దతుగల ఉగ్రవాద సంస్థ హిజ్ బుల్లా నాయకుడు నస్రుల్లా బీరుట్ లోని గ్రూపు ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మరణించాడు. అటు ఇజ్రాయెల్, ఇటు హిజ్ బుల్లా లు అతడి మరణాన్ని ధృవీకరించాయి. ఇది ఇజ్రాయెల్ తో సాయుధ పోరటంలో నిమగ్నమై ఉన్న సమూహానికి భారీ దెబ్బ అని అంటున్నారు.

రివల్యూషనరీ గార్డ్స్ కు చెందిన సీనియర్ ఇరాన్ జనరల్ అబ్బాస్ నిల్ఫౌరౌషన్ కూడా ఈ దాడుల్లో మరణించారని.. వారితో పాటు నస్రల్లా కుమార్తె జైనాబ్ నస్రల్లా, హుజ్ బుల్లా సదరన్ ఫ్రంట్ కమాండర్ అలీ కరాకీ కూడా మరణించినవారిలో ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి.

Tags:    

Similar News