జానకీపురం సర్పంచ్ నవ్య పోటీ...టెన్షన్ పడుతున్న పార్టీలు
తనను సర్పంచ్ గా గెలిపించినందుకు కోరిక తీర్చమని వత్తిడి చేస్తున్నారు అని కూడా తీవ్రమైన ఆరోపణలను నవ్య చేసింది.
ఆమె ఒక సర్పంచ్. కానీ ఇటీవల కాలంలో పాపులర్ అయ్యారు. ఆమె ఎవరో కాదు తెలంగాణాలోని ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని జానకీపురం సర్పంచ్ నవ్య. ఆమె నవతరం ప్రతినిధిగా ఈసారి బరిలోకి వచ్చారు. ఆమె ఇండిపెండెంట్ గా పోటీ దిగిపోయారు.
ఆమె పేరు కొద్ది రోజుల క్రితం బాగా పాపులర్ అయింది. ఆమె అధికార బీయారెస్ కి చెందిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తన మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించి సంచలనం రేపారు. ఈ ఇద్దరి మధ్య ఒక రకంగా సమరమే సాగింది.
తనను సర్పంచ్ గా గెలిపించినందుకు కోరిక తీర్చమని వత్తిడి చేస్తున్నారు అని కూడా తీవ్రమైన ఆరోపణలను నవ్య చేసింది. ఇది తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపింది. దాంతో ఎమ్మెల్యే రాజయ్య నవ్య ఇంటికి వెళ్ళి రాజీ కుదుర్చుకున్నారు. జానకీపురం గ్రామానికి అభివృద్ధి కోసం నిధులు ఇస్తామని కూడా హామీ ఇచ్చి వచ్చారు. అలా నవ్య ఒక బాధిత మహిళగా అంతకు ముంచి ఎమ్మెల్యేను ఎదిరించిన ప్రజా ప్రతినిధిగా జనం గుండెలలో నిలిచారు. ఎవరైనా గట్టిగా ఎదిరిస్తే తప్పకుండా కామాంధులకు చెక్ పడుతుంది అని నవ్య నిరూపించారని అంతా ప్రశంసించారు.
ఈ నేపధ్యంలో ఇంతకాలం సైలెంట్ గా ఉన్న నవ్య ఇపుడు ఎన్నికల వేళ ఇండిపెండెంట్ గా పోటీకి దిగడం ఆసక్తిని రేపుతోంది. స్టేషన్ ఘన్ పూర్ నుంచి బీయారెస్ అభ్యర్ధిగా సీనియర్ నేత కడియం శ్రీహరి పోటీ చేస్తున్నారు. రాజయ్యకు ఈ సారి టికెట్ దక్కలేదు అంటే అందులో నవ్యని బాధించిన ఎపిసోడ్ కూడా ఉందని అనుకున్నారు.
అలా రాజయ్య సైడ్ అయిపోగా, ఇపుడు నవ్య తెర మీదకు రావడం మాత్రం ఆశ్చర్యంగానే ఉంది. ఆమె పోటీ మాత్రం ఆసక్తిని రేపుతోంది. ఆమె ఎంతో కొంత ఓట్లను చీల్చడం ఖాయమని అంటున్నారు. ఆమె ఓట్లు ఎవరివి చీలుస్తారు అన్నదే చర్చగా ఉంది. ఆమె బీయారెస్ అధికారంలో ఉన్నపుడు ఆ పార్టీ ఎమ్మెల్యే చేతల వల్ల బాధితురాలు అయింది కాబట్టి కచ్చితంగా ఆ ఎఫెక్ట్ బీయారెస్ కే అంటున్నారు. అయితే రాజయ్య బరిలో లేరు కాబట్టి ఆమె పోటీ కాంగ్రెస్ కీ ఇబ్బందే అంటున్న వారూ ఉన్నారు
తాను యువత రాజకీయాల్లొకి రావాలన్న స్పూర్తి కోసమే పోటీకి దిగాను అని నవ్య అంటున్నారు. తాను పేదల పక్షం అని చెబుతున్నారు. తాను రాజకీయంగా ఎదిగితే పేదలకే మేలు జరుగుతుంది ఆమె చెబుతున్నారు. ఒక సర్పంచ్ గా తన ధైర్య సాహసాలను నిరూపించుకున్న నవ్య పట్ల జనాలు కొంత ఆసక్తిని అయితే చూపిస్తున్నారు.