ఎస్పీని కలిసిన పవన్... మహిళా సీఐపై ఫిర్యాదు!
ఒక జనసేన కార్యకర్తపై భౌతికంగా దాడి
ఒక జనసేన కార్యకర్తపై భౌతికంగా దాడి చేసిన వ్యవహారానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ విషయంపై సీరియస్ గా స్పందించిన జనసేన అధినేత తిరుపతి జిల్లాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్... జిల్లా ఎస్పీని కలిశారు.
అవును... శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ బహిరంగంగా ఓ జనసేన నేతపై దాడి చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారన్ని సుమోటాగా స్వీకరించిన ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంజూ యాదవ్ తో పాటు సంబంధిత అధికారులకు నోటీసులు జారీచేసింది. ఈ సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి జిల్లాకు చేరుకున్నారు.
అక్కడి నుంచి నేరుగా జిల్లా సూపరెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీసుకు వెళ్లారు పవన్ కల్యాణ్. అంతక ముందు తిరుపతి విమానాశ్రయం నుంచి ర్యాలీగా బయలుదేరారు పవన్ కల్యాణ్! అయితే జిల్లా ఎస్పీని కలిసేందుకు మాత్రం పవన్ తో కలిపి ఏడుగురికి మాత్రమే అనుమతి ఉందని తెలుస్తుంది.
ఈ సమయంలో నాదెండ్ల మనోహర్ తో పాటు స్థానిక నాయకులతో జిల్లా ఎస్పీని కలిసిన పవన్ కల్యాణ్... సీఐ అంజూ యాదవ్ పై ఫిర్యాదు చేశారు.
ఆ సంగతి అలా ఉంటే... మరోవైపు పవన్ తిరుపతిలో భారీ ర్యాలీగా వెళ్తోన్న క్రమంలో స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది. పవన్ తిరుపతికి వచ్చింది ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు కాదని, దండయాత్రలాగా ఆయన ఆధ్యాత్మిక నగరానికి వచ్చారని కరుణాకర్ మండిపడ్డారని అంటున్నారు.
అవును... వినతిపత్రం పేరుతో పవన్ తిరుపతికి దండయాత్రకు వచ్చినట్టు ఉందని భూమన అన్నారని తెలుస్తుంది. ప్రజాస్వామ్యబద్దంగా పాలన చేస్తున్న అధికార పార్టీపై నిత్యం పవన్ నిందలు వేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తుంది.
తనకు ఓటు వేస్తే ఏం చేస్తాననే విషయాన్ని ప్రజలకు చెప్పకుండా... నిత్యం పగ, ప్రతీకారాలతో ఆయన కాలంగడుపుతున్నారని ఎద్దేవా చేశారని సమాచారం.