టీడీపీ సీనియర్ల సీట్లకే టెండర్ పెట్టిన జనసేన...!

ఇంతకీ ఆ బిగ్ షాట్స్ ఇద్దరూ ఎవరు అంటే ఒకరు రాజమండ్రికి చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రెండవవారు అనంతపురం జిల్లాకు చెందిన వైకుంఠం ప్రభాకర్ చౌదరి.

Update: 2023-12-10 03:53 GMT

టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న నేత ఒకరు అయితే టీడీపీలో డైనమిక్ లీడర్ గా ఉంటూ జిల్లాలో పార్టీకి పెద్ద గొంతుకగా ఉన్న వారు మరొకరు. అయితే ఈ ఇద్దరు నేతల సీట్లకు జనసేన బాగానే ఎసరు పెడుతోంది. ఇంతకీ ఆ బిగ్ షాట్స్ ఇద్దరూ ఎవరు అంటే ఒకరు రాజమండ్రికి చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రెండవవారు అనంతపురం జిల్లాకు చెందిన వైకుంఠం ప్రభాకర్ చౌదరి.

ఈ ఇద్దరి సీట్లనూ జనసేన కోరుతోంది. ముందుగా గోరంట్ల విషయానికి వస్తే ఆయన 1983లోనే అన్న గారు టికెట్ ఇస్తే గెలిచారు. ఇక 1985లో కూడా గెలిచారు. అలాగే 1994, 1999లలో గెలిచారు. ఇక 2014, 2019లలో రాజమండ్రి రూరల్ నుంచి వరసగా గెలిచారు. ఆయన ఎన్టీఆర్ ప్రభుత్వంలో కొంతకాలం మంత్రిగా పనిచేశారు.

చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు మంత్రిగా అవకాశం దక్కుతుందని భావించినా చాన్స్ రాలేదు. ప్రస్తుతం ఆయన వయసు ఏడున్నర పదులు దాటింది. దాంతో ఆయనని సైడ్ చేసి రాజమండ్రి రూరల్ టికెట్ ని జనసేనకు ఇవ్వాలని టీడీపీ డిసైడ్ అయింది అని అంటున్నారు. జనసేనకు ఇక్కడ కందుల దుర్గేష్ అనే లీడర్ ఉన్నారు. ఆయన 2019లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి 42 వేల 685 ఓట్లు సాధించారు.

ఆయనకు పవన్ హామీ కూడా ఇచ్చేశారు. దాంతో పెద్దాయనకు ఈసారి నో చెబుతున్నారు అని అంటున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వవచ్చు అని టాక్ నడుస్తోంది. దాంతో అయిష్టంగానే పెద్దాయన తప్పుకోవాల్సి వస్తోంది అని అంటున్నారు. ఇక అనంతపురం జిల్లాకు వెళ్తే అక్కడ ప్రభాకర్ చౌదరి సీటుని జనసేన కోరుతోంది.

ఆయన 2014లో దాదాపు పదివేల ఓట్ల తేడాతో అనంతపురం అర్బన్ నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. 2019లో మాత్రం వైసీపీ చేతిలో ఓడిపోయారు. ఇక ఇదే సీటు మీద జేసీ బ్రదర్స్ కన్ను వేశారు. ఈ సీటుని తన కుమారుడికి జేసీ ప్రభాకర్ రెడ్డి అడుగుతున్నారు. జేసీ పవన్ రెడ్డి 2019లో అనంతపురం ఎంపీ అభ్యర్ధిగా టీడీపీ తరఫున పోటీ చేసి ఓడారు. ఈసారి మాత్రం ఆయనను అసెంబ్లీ ద్వారా చట్ట సభకు పంపించాలని దివాకర్ రెడ్డి చూస్తున్నారు.

దీంతో జేసీ బ్రదర్స్ అనంతపురం అర్బన్ లో హల్ చల్ చేస్తున్నారు. దాంతో ప్రభాకర చౌదరి వర్గానికి జేసీ వర్గానికి రచ్చ సాగుతోంది. ఇలా రెండు వర్గాలుగా విడిపోయారు. అది టీడీపీకి తలకాయ నొప్పిగా మారింది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో అనంతపురం అర్బన్ టికెట్ ఇస్తే తాము గట్టిగా ప్రచారం చేసుకుని గెలుస్తామని జనసేన చెబుతోంది. పైగా బలిజ సామాజికవర్గం అక్కడ ఎక్కువగా ఉన్నారని కూడా అంటోంది.

ఇక చూస్తే జనసేన తరఫున 2019లో టీసీ వరుణ్ పోటీ చేశారు. పదివేల దాకా ఓట్లు రాబట్టారు. ఈసారి టీడీపీతో పొత్తు పెరిగిన జనసేన గ్రాఫ్ అన్నీ కలసి ఆ సీటు తమకు దక్కుతుందని జనసేన భావిస్తోంది. దానికి టీడీపీ హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అని అంటున్నారు. ఇక ప్రభాకర్ చౌదరికి వేరే ఎక్కడైనా సీటు చూపిస్తారు అని అంటున్నారు. మొత్తానికి టీడీపీ సీనియర్ల సీట్లకు జనసేన టెండర్ పెట్టేసింది అని అంటున్నారు.

Tags:    

Similar News