జనసేనలో చిచ్చు... వీళ్లంతా అవుటే...!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనలో అంతర్గత చిచ్చు రాజుకుందనే చర్చ జోరుగా సాగు తోంది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనలో అంతర్గత చిచ్చు రాజుకుందనే చర్చ జోరుగా సాగు తోంది. పార్టీని బలోపేతం చేయాలన్న వ్యూహం లేకపోవడంతోపాటు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మద్దతిస్తు న్నారని కొందరు నాయకులు ఇప్పటికే గుస్సాగా ఉన్నారు. పైగా.. టీడీపీకి వ్యతిరేకంగా ఎవరు నోరు విప్పినా.. వారిపై వ్యతిరేకులనే ముద్ర వేయడంతోపాటు .. పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తామని కూడా పవన్ గతంలోనే హెచ్చరించారు.
అంతేకాదు.. క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలతో కలిసి పనిచేయాలని పవన్ ఆదేశించారు. ఇవి పైకి చెప్పకపో యినా.. అంతర్గత చర్చల్లో మాత్రం ఆయన ఆదేశించారని కేడర్ చెప్పుకొంటున్నారు. దీంతో మంగళగిరి, తాడికొండ, విజయవాడ వంటి కీలక నియోజకవర్గాల్లో జనసేన కేడర్.. టీడీపీతో మమేకమై తిరుగుతోంది. ఇది పవన్ ఆలోచనల వరకు బాగానే ఉందని అనుకున్నా.. అంతర్గతంగా చూస్తే.. పార్టీకి తీవ్రమైన దెబ్బ తగులుతోందనే చర్చ జరుగుతోంది.
టీడీపీతో కలిసి తిరుగుతున్న కేడర్.. ఆ పార్టీలో విలీనం అయిపోతున్నారనేది ప్రధాన సమస్య. మంగళ గిరి నియోజకవర్గంలో ఏకంగా 160 మంది క్షేత్రస్థాయి నాయకులు పార్టీ మారిపోయారు. నిన్న మొన్నటి వరకు పార్టీ జెండా మోసిన వీరంతా.. ఇప్పుడు టీడీపీ ఆఫీసుకే పరిమితం అయ్యారు. అంతేకాదు.. టీడీపీ నేతల వెంటే తిరుగుతున్నారు. పొత్తులో భాగంగా ఇది మంచిదేనని అనుకున్నా.. జనసేన వైపు కన్నెత్తి చూడకపోవడం.. ఆ పార్టీ నాయకుల ఫోన్లకు కూడా స్పందించక పోవడం జనసేన నాయకులను ఇబ్బంది పెడుతోందని అంటున్నారు.
మరోవైపు.. టీడీపీలో ఉంటే తమకు అన్ని పనులు జరుగుతున్నాయని, కనీస ఖర్చులు అయినా.. తీరుతు న్నాయని నాయకులు చెబుతున్నారు. జనసేనలో ఈ పరిస్థితి లేదని.. అన్నింటికీ తామే ఖర్చులు పెట్టు కోవాల్సి వస్తోందని.. అధినేత వస్తుంటే..బ్యానర్లు కట్టడానికి కూడా రూ.500, రూ.1000 చొప్పున చందాలు వేసుకునే పరిస్థితి ఉందని వారు అంటున్నారు. రాజకీయం ఏదైనా ఒక్కటే కాబట్టి.. తమకు టీడీపీలోనే బాగుందనే కేడర్ కూడా కనిపిస్తుండడం గమనార్హం. అంతిమంగా చూస్తే.. ఇది సుదీర్ఘ జనసేన భవిష్యత్తుకు ప్రమాదంగా మారిందని పార్టీ నాయకులు చెబుతున్నారు.
''పొత్తు మంచిదే.. అదేసమయంలో కేడర్ను కూడా కాపాడుకోవాలి'' అని మంగళగిరికి చెందిన జనసేన నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. కానీ, ఇప్పుడున్న పరిస్థితిలో తమ చేతుల్లో ఏమీ లేదని ఆయన వాపోవడం గమనార్హం.