జోగి రమేష్ కుమారుడు అరెస్ట్... చంద్రబాబుకు మాజీమంత్రి ప్రశ్నలు!

అనంతరం కొన్ని గంటలకే జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2024-08-13 06:07 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఈ రోజు తెల్లవారుజామున వియవాడ శివార్లలోని ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను తనిఖీ చేసినట్లు చెబుతున్నారు. అనంతరం కొన్ని గంటలకే జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అవును... మంగళవారం తెల్లవారుజామున సుమారు 15 మంది అధికారు జోగి రమేష్ నివాసంలో సోధాలు చేపట్టారు. ఈ క్రమంలో పలు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ సోదాలు అయిన కొన్ని గంటలకే జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సీఐడీ స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను మరికొంతమందితో కలిసి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ సందర్భంగా స్పందించిన జోగి రాజీవ్... తన తండ్రిపై ఉన్న కక్షతోనే తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. ఇదే సమయంలో... కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామని వెల్లడించారు. మరోపక్క తన కుమారుడు రాజీవ్ అరెస్ట్ పై మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాబుని ప్రశ్నించారు.

ఇందులో భాగంగా... అగ్రిగోల్డ్ వ్యవహారంలో తాను ఎలాంటి తప్పూ చేయలేదని చెప్పిన జోగి రమేష్.. తాను కానీ, తన కుటుంబం కానీ అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో ఏదైనా తప్పు చేసి ఉంటే విజయవాడ నడిరోడ్డులో ఉరేసుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా... బలహీన వర్గాలకు చెందిన తమను వేధించడం న్యాయమా చంద్రబాబు నాయూ అంటూ ప్రశ్నించారు. తన కుటుంబంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడితే పైన దేవుడున్నాడని అన్నారు.

ఇదే క్రమంలో... "మీరు మమ్మల్ని తొక్కొచ్చు.. రెడ్ బుక్ తీయొచ్చు.. మాపై కేసులు పెట్టోచ్చు.. మీరు మరీ ఇంత దుర్మార్గంగా ఏమీ తెలియని కుర్రాడిపై కేసుపెట్టి జైల్లో పెట్టాలన్న వంకర బుద్దిని మార్చుకోవాలి" అని జోగి రమేష్ అన్నారు.

Tags:    

Similar News