జగన్ ఇలాకాలో కూటమి భారీ షాక్..!
కడప మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గా వైసీపీ నాయకుడు సురేష్‌బాబు ఉన్నారు. అయితే.. ఈయనను తప్పించాలన్నది కూటమి ప్రయత్నం.;
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో కూటమి నేతలు జోరుగా చక్రం తిప్పుతున్నారు. ముఖ్యంగా కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్ బ్రాండ్‌గా మారి.. ఇక్కడ వైసీపీని కంట్రోల్ చేసేపని చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా కడప మేయర్ పీఠాన్ని వైసీపీకి దూరం చేసే ప్రక్రియ జోరుగా సాగుతోంది. వాస్తవానికి ఇక్కడ అంతా వైసీపీకి అనుకూలమే. అయితే.. మేయర్ ను తప్పించేందుకు.. ఆయనను పదవీచ్యుతుడిని చేసేందుకు కూటమి నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం న్యాయనిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నారు. దీంతో కడప మేయర్ వ్యవహారం.. సీమలో హాట్ టాపిక్‌గా మారింది.
ఏం జరిగింది?
కడప మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గా వైసీపీ నాయకుడు సురేష్‌బాబు ఉన్నారు. అయితే.. ఈయనను తప్పించాలన్నది కూటమి ప్రయత్నం. దీనిలో భాగంగా ఆయన మేయర్‌గా ఉంటూనే.. కడప కార్పొరేషన్ పరిధిలో సొంతగా కాంట్రాక్టు పనులు చేస్తున్నారనిఎమ్మెల్యే మాధవీ రెడ్డి గుర్తించారు. ఈ విషయాన్ని సర్కారుకు ఆమె చేరవేశారు. దీంతో ప్రభుత్వం మొత్తం కూపీ లాగుతోంది. మేయర్ వ్యవహారం.. ఆయన కాంట్రాక్టు కంపెనీ, చేపట్టిన పనులు.. తీసుకున్న సొమ్ములు.. ఇలా.. అన్ని విషయాలపైనా విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అనంతరం.. ఈ నివేదిక ఆధారంగా వేటు వేయడానికి రంగం సిద్ధమవుతోంది.
ఇక, మేయర్ సురేష్‌బాబు విషయానికి వస్తే.. వ్యక్తిగతంగా ఆయన ప్రముఖ కాంట్రాక్టర్. అయితే.. మేయర్ పదవిని చేపట్టిన తర్వాత.. తన కాంట్రాక్టు కంపెనీని భార్య, కుమారడి పేరుతో మార్చారు. అయినప్పటికీ.. ఆయన ఆధ్వర్యంలోని కార్పొరేషన్ తరఫున ఈ కంపెనీకే ఎక్కువగా పనులు దక్కాయి. ఈ క్రమంలో ప్రజాధనం రూ.కోట్లలో సురేష్‌బాబు కంపెనీకి చేరిందన్నది ప్రధాన అభియోగం. ఈ ఆరోపణలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కడప నగరంలో అభివృద్ధి పనులను ఇష్టారా జ్యంగా తన కుటుంబానికి చెందిన కాంట్రాక్టు సంస్థ 'ఎంఎస్ వర్దిని కన్‌స్ట్రక్షన్స్' ద్వారా చేయించినట్లు విజిలెన్స్ ఆధారాలు సేకరిం చింది.
మేయర్ పదవిలో ఉంటూ.. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆయన తన కుటుంబసభ్యులు పనులు చేయవచ్చా? లేదా? అనే విషయంపై న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నారు. ఈ కంపెనీ డైరెక్టర్లుగా మేయర్ కుమారుడు అమరేశ్, భార్య జయశ్రీ ఉన్నారు. కార్పొరేషన్ చట్టం నిబంధనలు అతిక్రమించినందున పదవులకు అనర్హులవుతారనే సమాచారాన్ని కమిషనర్ మనోజ్‌రెడ్డి నుంచి రాతమూలకంగా తీసుకున్నారు. ఇదే విషయాన్ని మేయర్‌కు సైతం తెలియజేస్తూ కమిషనర్ లేఖ రాశారు. దీనిపై మేయర్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో కమిషనర్ ఇచ్చిన సమాచారంతో విజిలెన్స్ ప్రభుత్వానికి విచారణ నివేదిక అందించింది. ఈ క్రమంలో త్వరలోనే సురేష్‌బాబుపై వేటు పడనుందని అంటున్నారు పరిశీలకులు.