విధి ఆడిన నాటకం.. గంట తేడాతో అన్నదమ్ముల దుర్మరణం

బాలానగర్ నుంచి టూవీలర్ మీద బయలుదేరిన అతడు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో శంషాబాద్ వద్ద అతి వేగంతో అదుపు తప్పి కిందపడిపోయాడు

Update: 2023-10-20 04:15 GMT

విధి ఆడిన నాటకం ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నింపేసింది. ఒకే కుటుంబానికి ఇద్దరు అన్నదమ్ములు.. గంట వ్యవధిలో ప్రమాదవశాత్తు ప్రాణాలు విడిచిన వైనం తీవ్రంగా కలిచివేస్తుంది. ఇరువురు ప్రమాదవశాత్తు చనిపోవటం ఒక ఎత్తు అయితే.. చేతికి వచ్చిన వేళ.. గంట వ్యవధిలో దుర్మరణం పాలైన అరుదైన ఉదంతం ఉమ్మడి కడప జిల్లా మైదుకూరులో చోటు చేసుకుంది.

వైఎస్సార్ కడప జిల్లాలోని మైదుకూరు మండలం గంజికుంట గ్రామానికి చెందిన రాజా.. నాగలక్షుమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు.. ఒక కుమార్తె. నరేంద్రకు 29 ఏళ్లు కాగా రాజేష్ కు పాతికేళ్లు. నరేంద్ర ఊళ్లో ఉంటూ తల్లిదండ్రులతో ఉంటూ వ్యవసాయం చేస్తుంటాడు. రెండో కొడుకు రాజేష్ హైదరాబాద్ లోని బాలానగర్ లో ఉంటూ ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తుంటాడు.

రోజు మాదిరే గురువారం తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లాడు నరేంద్ర. అక్కడ పంపుసెట్టుకు స్టార్టర్ అమర్చే క్రమంలో 11 గంటల సమయంలో కరెంటు షాక్ కు గురయ్యాడు. వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అక్కడ ట్రీట్ మెంట్ పొందుతూ మరణించాడు. ఈ విషాద సమాచారాన్ని అందుకున్న రాజేశ్.. హుటాహుటిన హైదరాబాద్ నుంచి టూ వీలర్ మీద బయలుదేరాడు.

బాలానగర్ నుంచి టూవీలర్ మీద బయలుదేరిన అతడు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో శంషాబాద్ వద్ద అతి వేగంతో అదుపు తప్పి కిందపడిపోయాడు. అక్కడికక్కడే మరణించాడు. పెద్ద కొడుకును కోల్పోయి.. పుట్టెడు శోకంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు.. రెండో కొడుకు ఊరికి వస్తూ మరణించిన వైనం గురించి తెలిసి గుండెలవిసేలా రోదించసాగారు. ఒకేరోజు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు గంట వ్యవధిలో మరణించటం షాక్ కు గురి చేసింది. దీంతో.. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఈ ఉదంతం గురించి తెలిసిన వారు సైతం అయ్యో అనుకునే పరిస్థితి.

Tags:    

Similar News