జనసేనలోకి కామినేని శ్రీనివాస్....?
బీజేపీ నేతగా మాజీ మంత్రిగా ఉన్న ఉమ్మడి క్రిష్ణా జిల్లా నాయకుడు కామినేని శ్రీనివాస్ జనసేనలోకి వస్తారా అన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది
బీజేపీ నేతగా మాజీ మంత్రిగా ఉన్న ఉమ్మడి క్రిష్ణా జిల్లా నాయకుడు కామినేని శ్రీనివాస్ జనసేనలోకి వస్తారా అన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఆయన పూర్వాశ్రమమంలో ప్రజారాజ్యం పార్టీ నేత. ఆయన రాజకీయ జీవితం అలా స్టార్ట్ అయింది. 2009 ఎన్నికల్లో కైకలూరు నుంచి మొదటిసారి ఆయన పీయార్పీ నుంచి పోటీ చేసి ఏకంగా 44 వేల ఓట్లకు పైగా తెచ్చుకుని గెలుపు అంచుని ముద్దాడారు. ఆయన మీద టీడీపీ అభ్యర్ధి జయమంగళ వెంకటరమణ జస్ట్ 974 ఓట్ల తేడాతో గెలిచారు.
ఇక 2014 నాటికి ఏపీ విభజన జరిగింది. దాంతో పాటు పీయార్పీ కాంగ్రెస్ లో విలీనం అయింది. కాంగ్రెస్ కి ఏపీలో ఏమీ లేకుండా పోయింది. ఈ క్రమంలో ఆయన బీజేపీలోకి చేరారు. జనసేన టీడీపీ పొత్తుతో మొదటి సారి కైకలూరు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధి ఉప్పల రాం ప్రసాద్ మీద ఏకంగా 21 వేల పై చిలుకు మెజారిటీతో గెలిచారు. ఆయనను బీజేపీతో పొత్తులో భాగంగా చంద్రబాబు మంత్రి పదవికి తీసుకున్నారు. అలా నాలుగేళ్ల పాటు ఆయన మంత్రి హోదాలో ఉన్నారు.
ఇక 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇపుడు 2024 ఎన్నికలు వస్తున్నాయి. బీజేపీ జనసేన పొత్తులో ఉన్నాయి. కానీ జనసేన టీడీపీతో పొత్తుని అఫీషియల్ గా ప్రకటించింది. దాంతో బీజేపీ తటపటాయిస్తోంది. ఈ నేపధ్యంలో ఆయన తాజాగా కైకలూరులో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో సమావేశమవడం రాజకీయంగా కాక రేపుతోంది.
ఆయన బీజేపీ నేత కాబట్టి తన పార్టీ వారితో భేటీ అయితే ఒక లెక్క. ఇక జనసేనతో పొత్తు ఉంది కాబట్టి ఆ పార్టీ నేతలతో కూడా భేటీ కావచ్చు. కానీ టీడీపీ నేతలను కూడా కలుపుకుని మీటింగ్ పెట్టారు. పైగా పవన్ వారాహీ యాత్ర విజయవంతం కోసం ఈ మీటింగ్ అని చెప్పడంతోనే ఏదో జరగబోతోంది అంటున్నారు.
ఇప్పటిదాకా పవన్ వారాహీ యాత్రలో ఎక్కడా బీజేపీ జెండా ఎగరలేదు. పైగా బీజేపీ నేతలు కూడా పవన్ వారాహి యాత్ర కోసం తన నియోజకవర్గాలలో ముందస్తు కసరత్తులు ఏవీ చేయలేదు. మరి దీని అర్ధం ఏంటి అన్నదే చర్చించుకుంటున్నారు.
ఇక పోతే అక్టోబరు 6న పవన్ కల్యాణ్ కైకలూరులో వారాహి విజయయాత్రకు రానున్నారు. ఈ నేపథ్యంలోనే మూడు పార్టీల నేతలతో కామినేని శ్రీనివాస్ సన్నాహక భేటీ నిర్వహించారని అంటున్నారు. పవన్ వారాహీ యాత్రను టీడీపీ-జనసేన సమన్వయంతో వారాహి యాత్రను విజయవంతం చేయాలని ఈ బీజేపీ నేత పిలుపు ఇస్తున్నారు.
అంతే కాదు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరూ ఐక్యపోరాటం చేయాలని అచ్చం పవన్ రాజకీయ పరిభాషలో కోరుతున్నారు. ఇక కైకలూరు పర్యటనలో పవన్ కల్యాణ్ కొల్లేరు, ఆక్వా సమస్యలపై ప్రస్తావిస్తారని వెల్లడించారు. వైసీపీ పాలనలో ఆక్వా రైతుల పరిస్థితి దుర్భరంగా మారిందని కామినేని చెబుతున్నారు.
ఇవన్నీ చూస్తూంటే బీజేపీ టీడీపీ జనసేనలతో పొత్తు ఉంటే కామినేనికి జంప్ చేయాల్సిన ఆయాసం ఎటూ ఉండదు, కానీ అలా జరగని పక్షంలో ఆయన జనసేన నుంచి కైకలూరు అభ్యర్ధిగా పోటీ చేస్తారు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అందుకే పవన్ కళ్యాణ్ యాత్ర విజయవంతం కోసం స్పెషల్ ఫోకస్ తీసుకుంటూ కాషాయ నేతల్లో తాను తేడా అని నిరూపించుకుంటున్నారు అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో, కామినేని పొలిటికల్ రూట్ ఎటు వైపో.