కాపులకు వెన్నుపోటు.. కత్తి అందించిన పవన్.. పెద్దలెక్కడ?

ఈయన వాలకం చూస్తుంటే తాజాగా కాపు సమాజానికి చంద్రబాబు పొడిచిన పోటుకు కత్తి ఈయనే అందించినట్లుగా అనిపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు కాపు సామాజికవర్గానికి చెందిన ప్రజానికం!

Update: 2024-02-25 02:30 GMT

టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విడుదల చేశారు. ఈ సమయంలో 118 సీట్లకు ప్రకటించిన చంద్రబాబు... అందులో 94 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు మిగిలిన 24 స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. ఈ సమయంలో 94 నియోజకవర్గాలు, అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ప్రకటించారు. జనసేన అధినేత మాత్రం ఐదు నియోజకవర్గాల పేర్లు, అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు.

ఆ ఐదింటిలోనూ నాదెండ్ల మనోహర్ పేరు ఉండగా... పవన్ కల్యాణ్ పేరు కనిపించకపోవడం గమనార్హం. మరోపక్క చంద్రబాబు, లోకేష్, బాలయ్య పేర్లు, సీట్లు కన్ ఫాం అయ్యాయి! ఆ సంగతి అలా ఉంటే... జనసేనకు ఇచ్చిన సీట్ల సంఖ్య ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా చంద్రబాబు కాపులకు పెద్ద పోటే పోడిచారని చెబుతున్న వేళ... పవన్ సమర్ధింపు మరింత ఇబ్బందిగా ఉందనే మాటలు వినిపిస్తున్నాయి.

అంటే... మొగుడు కొట్టినందుకు కాదు.. తోడి కోడలు నవ్వినందుకు అన్నట్లన్నమాట! ఇప్పటికే జనసేనకు 24 సీట్లే ఇచ్చారని ఆవేదన చెందుతున్న జనసేన మద్దతు దారుల, జనసైనికులు, వీర మహిళల బాదను రెట్టింపు చేస్తున్నట్లుగా పవన్ ఒక వ్యాఖ్య చేశారు. ఇందులో భాగంగా.. చాలా మంది 60 లేదా 70 సీట్లలో పోటీ చేయాలని చెప్పారు కానీ గతంలో 10 సీట్లు గెలిచి ఉండుంటే అడగటానికి ఉండేది అని అన్నారు!!

దీంతో... ఈయన వాలకం చూస్తుంటే తాజాగా కాపు సమాజానికి చంద్రబాబు పొడిచిన పోటుకు కత్తి ఈయనే అందించినట్లుగా అనిపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు కాపు సామాజికవర్గానికి చెందిన ప్రజానికం! ఈ సమయంలో హరిరామ జోగయ్య, ముద్రగడల ప్రస్థావన తెరపైకి వస్తుంది! పొత్తులో భాగంగా జనసేనకు కనీసం 60 స్థానాలు కేటాయించకపోతే కాపుల ఓట్లు గంపగుత్తగా టీడీపీకి ట్రాన్స్ ఫర్ కావని జోగయ్య గతంలో పలుమార్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఈ సమయంలో జోగయ్య రాసిన లేఖలు అన్నీ ఇన్నీ కాదు! అవన్నీ పవన్ కల్యాణ్ తప్ప అందరూ చదివారేమో అనిపిస్తుంది తాజా పరిస్థితి చూసుంటే అని అంటున్నారు జనసేన సానుభూతిపరులు! పైగా... గౌరవప్రదమైన స్థానాలే జనసేనకు కేటాయించబడతాయంటూ పవన్ పలు మార్పు చెప్పుకొచ్చారు! ఇప్పుడేమో... గత ఎన్నికల్లో 10 స్థానాల్లో అయినా గెలిచి ఉంటే... ఎక్కువ సీట్లు అడగడానికి ఉండేది అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

దీంతో ఈ మాటలు మరింత ఆవేదనను కలిగిస్తున్నాయనే కామెంట్లు ఆ సామాజికవర్గ ప్రజానికం నుంచి వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కాపుల ఆత్మాభిమానాన్ని చంద్రబాబు పాదాల వద్ద తాకట్టు పెట్టొందంటూ జోగయ్య, ముద్రగడ లాంటి కాపు సామాజికవర్గంలోని పెద్దలు కొంతమంది పవన్ వద్ద పలుమార్లు ప్రస్థావించారని చెబుతుంటారు. అయితే తాజా పరిస్థితిని చూస్తుంటే వారి మాటలను పవన్ కూరలో కరివేపాకు చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

దీంతో.. 175 నియోజకవర్గాల్లో కాపుల ఓట్లు కావాలంటూ.. కేవలం 24 నియోజకవర్గాలు మాత్రమే జనసేనకు కేటాయించడంపై కాపు సామాజికవర్గంలోని పెద్దలు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. పవన్ కల్యాణ్ తన స్వార్థ ప్రయోజనాలకోసం కాపులను తాకట్టు పెడుతున్నారనే కామెంట్లకు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి. జగన్ ని గద్దె దించడం అంటే చంద్రబాబుని గద్దెనెక్కించడం కాదని ఆ పెద్దలే గతంలో చెప్పిన మాటను మరోసారి ప్రస్థావిస్తారా? ఇప్పుడు కాపుల ఓట్లు కూటమికి గంపగుత్తగా ట్రాన్స్ ఫర్ అవుతాయో లేదో చెబుతారా? అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.

Tags:    

Similar News