ఐటీ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై సెగలు!

సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా, ఐటీ హబ్‌ ఆఫ్‌ ఇండియాగా కర్ణాటక రాజధాని బెంగళూరు నగరానికి పేరుంది.

Update: 2024-07-17 07:32 GMT

సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా, ఐటీ హబ్‌ ఆఫ్‌ ఇండియాగా కర్ణాటక రాజధాని బెంగళూరు నగరానికి పేరుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సెగలు రేపుతోంది. కర్ణాటకలో ఉన్న పరిశ్రమలు, ఇతర సంస్థల్లోని ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్రంలోని మేనేజ్మెంట్‌ ఉద్యోగాల్లో అయితే 50 శాతం రిజర్వేషన్లు, నాన్‌ మేనేజ్మెంట్‌ ఉద్యోగాలయితే 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కేటాయించాలని రూపొందించిన ముసాయిదా బిల్లుకు కర్ణాటక మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రైవేటు రంగంలోని అన్ని కంపెనీలతోపాటు ఐటీ రంగానికి కూడా వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌ గా మారింది.

కర్ణాటక ప్రభుత్వం ఆమోదించిన బిల్లు ప్రకారం.. ఉద్యోగ నియామకాల్లో కన్నడిగులకు ప్రాధాన్యత ఇవ్వని కంపెనీలకు జరిమానా విధిస్తారు. దీన్ని కూడా బిల్లులో పొందుపరిచారు. బిల్లులోని నిబంధనలను పాటించని కంపెనీలపై రూ. 10,000 నుండి రూ. 25,000 వరకు జరిమానా విధిస్తారు. యజమాని నిబంధనలు పాటించేవరకు రోజుకు రూ. 100 వసూలు చేస్తారు.

ముసాయిదా బిల్లు ప్రకారం.. మేనేజ్మెంట్, నాన్‌ మేనేజ్మెంట్‌ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ పొందాలనుకునే అభ్యర్థులు కన్నడ భాషను చదివినట్టు సెకండరీ స్కూల్‌ సర్టిఫికేట్‌ ఉండాలి. లేదా నోడల్‌ ఏజెన్సీ ద్వారా నిర్దేశించిన కన్నడ ప్రావీణ్యత పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

అర్హత ఉన్న లేదా తగిన స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకుంటే... పరిశ్రమ లేదా ఫ్యాక్టరీ లేదా ఇతర సంస్థలు మూడు సంవత్సరాలలోపు స్థానిక అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలి.

‘తగినంత స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకుంటే‘ సంస్థలకు మినహాయింపును అందించే నిబంధన కూడా బిల్లులో పొందుపరిచారు. అటువంటి సందర్భంలో ఆయా సంస్థలు ఈ చట్టంలోని నిబంధనల నుండి సడలింపు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం విచారణ చేసి తగిన ఉత్తర్వులను జారీ చేస్తుంది.

అన్ని ప్రైవేట్‌ సంస్థలు గ్రూప్‌ ‘సి’, ‘డి’ బ్లూ కాలర్‌ ఉద్యోగాల కోసం కన్నడిగులను మాత్రమే నియమించుకోవాలని బిల్లులో స్పష్టం చేశారు.

ఈ మేరకు కర్ణాటక కార్మిక మంత్రి సంతోష్‌ లాడ్‌ ఎక్స్‌ లో ఒక పోస్టు చేశారు. ‘‘కన్నడిగులకు ప్రైవేట్‌ రంగాలలో ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించే బిల్లును క్యాబినెట్‌ సమావేశంలో ఆమోదించామని మీ అందరికి చెప్పడం ఆనందంగా ఉంది. ఈ బిల్లు అమలుతో రాష్ట్రంలోని ప్రైవేట్‌ రంగ ఉద్యోగాల్లో కన్నడిగులకు 50% నుంచి 75% రిజర్వేషన్లు లభిస్తాయి’ అని పేర్కొన్నారు.

కాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఎక్స్‌ లో ఒక పోస్టు చేశారు. అన్ని ప్రైవేట్‌ పరిశ్రమలు గ్రూప్‌ ‘సి’, ‘డి’ ఉద్యోగాలలో కన్నడిగులను మాత్రమే నియమించుకోవడాన్ని తప్పనిసరి చేసే చట్టాన్ని కూడా క్యాబినెట్‌ ఆమోదించిందని తెలిపారు.

ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమల్లో స్థానికులకే 50 శాతం 75 శాతం ఉద్యోగాలు ఇస్తే నైపుణ్యాలు ఉన్న మానవ వనరులు లభించక కంపెనీలు నష్టపోవడం ఖాయమని అంటున్నారు. ముఖ్యంగా ఐటీ రంగం అసలే ఒడిదుడుకుల్లో ఉందని.. నైపుణ్యాలు లేనివారిని నియమించుకుంటే ఐటీ రంగం మరింత కుదేలవుతుందని చెబుతున్నారు.

కర్ణాటక నుంచి ఆయా కంపెనీలు, పరిశ్రమలు బిచాణా ఎత్తేసిన ఆశ్చర్యపోనవసరం లేదని నిపుణులు అంటున్నారు. ఇలాగే హరియాణాలో కూడా గతంలో ఇలాంటి బిల్లునే ప్రవేశపెట్టారని.. అక్కడ ఈ నిర్ణయం ఘోరంగా విఫలమైందని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ బిల్లును కర్ణాటక ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఐటీ కంపెనీలు హైదరాబాద్, పుణే వంటి నగరాలకు వెళ్లిపోవడం ఖాయమని చెబుతున్నారు. మరి ఈ నిరసనలపై కర్ణాటక ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే!

Tags:    

Similar News

ఇక ఈడీ వంతు