తెలుగు జాతిని అవమానించలేదంటోన్న కస్తూరి
తమిళ నటి, బీజేపీ మహిళా నేత కస్తూరి తన వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే.
తమిళ నటి, బీజేపీ మహిళా నేత కస్తూరి తన వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. గతంలో ఇద్దరు యువతులు ఓ మద్యం షాపు దగ్గర మద్యం కొనుగోలు చేస్తున్న వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన కస్తూరి ‘‘బాగా తాగండి అమ్మాయిలూ’’ అంటూ ఇచ్చిన క్యాప్షన్ అప్పట్లో దుమారం రేపింది. ఇక, నయనతార సరోగసి వ్యవహారంపై, ఏఆర్ రెహమాన్ భార్య సైరా భాను తమిళంలో సరిగా మాట్లాడలేకపోవడంపై, ఆది పురుష్ చిత్రంలో ప్రభాస్ పాత్రపై కూడా కస్తూరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
అయినా సరే తన తీరు మార్చుకోని కస్తూరి తాజాగా తెలుగుజాతిని, తెలుగు ప్రజలను ఘోరంగా అవమానించే రీతిలో చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. 300 ఏళ్ల క్రితం ఒక రాజు దగ్గర అంత:పుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగువారు ఇప్పుడు తమది తమిళ జాతి అంటున్నారని కస్తూరి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. అటువంటి వారంతా తాము తమిళులమంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని కస్తూరి ఎద్దేవా చేశారు.
ఎప్పుడో ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి మీరెవరు అంటూ కస్తూరి చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. కస్తూరి చేసిన వ్యాఖ్యలు రాజకీయపరంగా, సినీ పరంగా స్థానిక పరంగా దుమారం రేపాయి. ఇటు, సోషల్ మీడియాలో, అటు మీడియాలో దుమారం రేపాయి. దీంతో, తన వ్యాఖ్యలను కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు కస్తూరి.
తన వ్యాఖ్యలను వక్రీకరించారని, డీఎంకే తనపై విష ప్రచారం చేస్తోందని కస్తూరి అన్నారు. తనకు తెలుగు మెట్టినిల్లు అని, తెలుగు ప్రజలు తన కుటుంబం అని అన్నారు. తెలుగు వారు తనపై ప్రేమాభిమానాలు చూపిస్తుంటారని, అది తెలియని కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తన కామెంట్లను వక్రీకరిస్తూ వస్తున్న వ్యాఖ్యలను నమ్మొద్దని కోరారు. తనపై విష ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు డీఎంకే ప్రయత్నిస్తోందని కస్తూరి ఆరోపించారు. తెలుగువారికి వ్యతిరేకంగా తాను మాట్లాడానంటూ దుష్ప్రచారం చేస్తోందని, తనను బెదిరించేందుకు ప్రయ్నత్నిస్తోందని ఆరోపించారు.