అంతఃపుర కాంతలకు సేవ చేసేందుకే తెలుగు వారు వచ్చారు: తమిళనాట మరో వివాదం!
తమిళనాడు రాజకీయాల్లో అయితే.. మతం, లేకపోతే కులం అన్నట్టుగా రాజకీయాలు తయారయ్యాయి.
తమిళనాడు రాజకీయాల్లో అయితే.. మతం, లేకపోతే కులం అన్నట్టుగా రాజకీయాలు తయారయ్యాయి. నిన్నటి వరకు ప్రస్తుత డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ చేసిన ''సనాతన ధర్మం'' పై వివాదాస్పద వ్యాఖ్యలు కాక రేపాయి. ఇవి దేశవ్యాప్తంగా చర్చకు కూడా వచ్చాయి. ఈ మంటలు ఇంకా చల్లారక ముందే.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టు, బుల్లితెర నటి కస్తూరి మరో రూపంలో పెను వివాదానికి ఆజ్యం పోశారు. తెలుగు మాట్లాడే తమిళియన్లను, తెలుగు వారిని కూడా ఆమె టార్గెట్ చేసుకున్నారు.
నటిగా ఉన్న కస్తూరి కొన్నాళ్ల కిందట బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆమె ఓ జిల్లాకు చీఫ్‌గా కూడా వ్యవహరి స్తున్నారు. మరో ఏడాదిన్నరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని రాష్ట్రంలో బీజేపీ రాజకీయంగా పావులు కదుపుతోంది. అధికార డీఎంకేలో చీలికలు తీసుకురావడంతోపాటు.. కొన్ని వర్గాలను కూడా తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తోంది. బహుశ దీనిలో భాగంగానే ఏమో.. తెలియదు కానీ, కస్తూరి తాజాగా తెలుగు స్పీకింగ్ పీపుల్ ను టార్గెట్ చేసుకుని కామెంట్లు చేశారు.
చెన్నైలోని గురుమూర్తి నగరంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి మాట్లాడుతూ.. ``గతం లో రాజుల కాలంలో అంతఃపుర కాంతలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగువారు`` అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఇలా వచ్చిన వారు వచ్చినట్టు ఉండక.. తాము తమిళులమని, తమది తమిళ జాతి అని చెప్పుకొంటున్నారని కస్తూరి తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో ద్రవిడులకు తామే పెద్ద దిక్కు అని చెప్పుకొనే డీఎంకేను ఆమె టార్గెట్ చేశారు.
తెలుగు నేల నుంచి వచ్చిన వారు తాము తమిళులమని చెప్పుకొంటుంటే.. అంతకు ముందే తమిళనాడుకు వచ్చి స్థిరపడిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి మీరెవరని ఆమె ద్రవిడ వాదుల్ని నిలదీశారు. అంతేకాదు.. తెలుగు మాట్లాడే వారికి .. డీఎంకే ప్రభుత్వం ప్రాధాన్య మిస్తోందని, తమిళులను అణచివేస్తోందని కూడా వ్యాఖ్యానించారు.
``ప్రస్తుత రాష్ట్ర కేబినెట్ లో ఐదుగురు తెలుగు మాట్లాడే మంత్రులు ఉన్నారు. తమకు ప్రభుత్వంలో భాగం, అధికారంలో భాగం కావాలంటూ డీపీఐ ప్రధాన కార్యదర్శి తిరుమాళవన్(బ్రాహ్మణుడు) కొత్త నినాదం తెస్తున్నారు`` అని నటి కస్తూరి వ్యాఖ్యానించారు.
మొత్తానికి ఆమె ఏ కాంటెస్టులో ఈ వ్యాఖ్యలు చేసినా.. వివాదాన్ని మాత్రం రగిలించారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. తద్వారా డీఎంకేకు.. వాస్తవ తమిళ బ్రాహ్మణులను దూరం చేయడం ద్వారా బీజేపీకి వారిని చేరువ చేయాలన్న లక్ష్యం అయితే కనిపిస్తోందన్నది చర్చగా మారింది.