మంట పుట్టేలా.. కారు సారు బస్సు యాత్ర.. ఎన్ని రోజులంటే?
చేతిలో అధికారం ఉంటే ఆ తీరు వేరుగా ఉంటుంది. ఒకసారి పవర్ చేజారితే అప్పటివరకు వెంట ఉండే రాజసం ఒక్కసారి మాయమవుతుంది.
చేతిలో అధికారం ఉంటే ఆ తీరు వేరుగా ఉంటుంది. ఒకసారి పవర్ చేజారితే అప్పటివరకు వెంట ఉండే రాజసం ఒక్కసారి మాయమవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు గులాబీ బాస్ కేసీఆర్ వ్యవహరించిన తీరుకు.. తాజాగా వ్యవహరిస్తున్న తీరుకు సంబంధం లేని పరిస్థితి. తెలంగాణలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల వేళ తీవ్రమైన గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న కేసీఆర్.. వాతావరణాన్నితనకు అనుకూలంగా మార్చుకోవటానికి బస్సు యాత్రను షురూ చేశారు. బుధవారం నుంచి మొదలయ్యే ఈ బస్సు యాత్ర.. పొద్దున.. సాయంత్రం అన్న తేడా లేకుండా రాత్రి వరకునాన్ స్టాప్ గా సాగనుంది.
దాదాపు 17రోజుల పాటు తెలంగాణ మొత్తాన్ని చుట్టు ముట్టేలా కేసీఆర్ భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. పదేళ్ల క్రితం నాటి ఉద్యమ నాయకుడ్నిచూపిస్తానంటూ మొన్నీమధ్యనే మాట్లాడిన సందర్భంలో చెప్పిన కేసీఆర్.. ఆ మాటకు తగ్గట్లే తాజా ఎన్నికల ప్రచారాన్ని డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఉద్యమ నేత నుంచి రాజకీయ నేతగా తాను మారినట్లుగా అధికారం చేపట్టిన వేళ ప్రకటించిన కేసీఆర్.. పవర్ చేజారిన కొద్ది రోజులకే తనలో మిస్ అయిన ఉద్యమ నేతను తెర మీదకు తీసుకొస్తానని ప్రకటన చేయటం గమనార్హం.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ముఖ్యమంత్రిగా పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలతో మమేకం కావటానికి.. వారి ఆశలు.. ఆకాంక్షలు తెలుసుకోవటానికి ఏ మాత్రం ఇష్టపడని కేసీఆర్ తాజా బస్సు యాత్రలో తన తీరుకు భిన్నంగా వ్యవహరించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. బస్సు యాత్రల్ని కేవలం రోడ్ షోలకు పరిమితం చేయకుండా.. ఎక్కడికక్కడ ప్రజలతో మమేకం అయ్యేలా ప్లాన్ చేశారు.
పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం చెమటలు చిందించాల్సిన సమయం వచ్చిందన్న విషయాన్ని గుర్తించిన గులాబీ బాస్ అందుకు మానసికంగా సిద్ధమయ్యారు. దీంతో.. జనంలోకి వచ్చేందుకు భారీ ప్లాన్ సిద్ధం చేసుకున్న ఆయన.. ముఖ్యమంత్రి రేవంత్ ను.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ఆడిపోసుకోవటానికి అంశాల్ని సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పదేళ్ల తమ పాలనలో తెలంగాణ ఎంతలా డెవలప్ అయ్యిందన్న విషయాన్ని చెప్పటంతో పాటు.. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీల్నిఅమలు చేయకపోవటాన్ని ఎండగడుతూ తన ఎన్నికల ప్రచారాన్నినిర్వహిస్తారని చెబుతున్నారు.
తెలంగాణ ఉద్యమ కాలం నాటి వాతావరణాన్ని తలపించేలా.. ఉద్వేగాన్ని తట్టి లేపేలా బస్సు యాత్రకు డిజైన్ చేసినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో.. రాజకీయ వాతావరణం మరింత వేడెక్కేలా కేసీఆర్ వ్యాఖ్యలు ఉంటాయని.. తన మాటల మంటలతో ప్రజల్లో ఎమోషన్ ను రగల్చటమే లక్ష్యంగా రంగంలోకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. పదేళ్ల పాలనలోని వైఫ్యలాలను ఒప్పుకోకుండా.. వంద రోజుల పాలన మాత్రమే చేసిన రేవంత్ సర్కారు మీద మితిమీరిన విమర్శలు చేస్తే ఫలితం ఉంటుందా? బూమ్ రాంగ్ అవుతుంది కదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
మొత్తంగా చూస్తే.. తాను అధికారంలో ఉన్నప్పుడు అయితే ప్రగతి భవన్.. లేదంటే ఫాం హౌస్ లోనే ఉండే ఆయన.. పదేళ్ల కాలంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఎంత కష్టం వచ్చినా బయటకు వచ్చి పలుకరించింది లేదు. అభయం ఇచ్చింది లేదు. అలాంటి విపక్షంలోకి వెళ్లిన నాలుగు నెలలకే.. రాజ ప్రసాదాన్ని వదిలి.. ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమైన గులాబీ సారులో మార్పు మరింత అవసరమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన మాటలతో ప్రజలను తనకు తగ్గట్లుగా మార్చుకునే సత్తా తనకుందని భావిస్తున్న కేసీఆర్ కు.. ప్రజలు సరైన రీతిలో స్పందించాల్సిన అవసరం ఉందంటున్నారు. అప్పుడే మరింత బాధ్యతగా ప్రజల విషయంలో వ్యవహరిస్తారని చెప్పక తప్పదు.