కేసీఆర్‌కు కాల పరీక్ష.. నిలుస్తారా? కుప్పకూలుతారా?
నా అంతటివాడు లేడంటూ.. ఏడాదిన్నర కిందటి వరకు వ్యాఖ్యలు గుప్పించి.. దేశంలో చక్రం తిప్పుతాన న్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నిజంగా ఇప్పుడు కాలమే పరీక్ష పెడుతోంది.
నా అంతటివాడు లేడంటూ.. ఏడాదిన్నర కిందటి వరకు వ్యాఖ్యలు గుప్పించి.. దేశంలో చక్రం తిప్పుతాన న్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నిజంగా ఇప్పుడు కాలమే పరీక్ష పెడుతోంది. ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్‌ల రూపంలో ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ రెండు పార్టీలకూ ప్రత్యామ్నాయంగా బీఆర్ ఎస్ మారబోతోందని చెప్పిన ఆయన అనేక పార్టీలను సమ్మిళితం చేసేందుకు కొన్నాళ్లు ప్రయత్నించారు.
కానీ, ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ దందాలో కుమార్తె కవిత పేరు బయటకు రావడం.. తర్వాత జరిగిన పరిణామాలతో కేసీఆర్ రాజకీయంగా కుంగిపోయారు. అప్పటి వరుకు మోడీని దించేస్తాం.. గుజరాత్కు పంపిస్తాం.. అన్న ఆయన.. కనీసం మోడీ పేరు ఎత్తకుండా నేగత అసెంబ్లీ ఎన్నికలను కానిచ్చేశారు. ఫలితంగా ఆయన బీజేపీతో కుమ్మక్కయ్యారనే పేరు తెచ్చుకుని.. ఇది అసెంబ్లీలో పార్టీ పలుచన చేసింది.
మరోవైపు.. కూరలో కరివేపాకు అంటూ..చులకనగా చూసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు కొరకరాని కొయ్యగా మారిపోయారు. అంతేకాదు.. రేవంత్ కనుసైగ చేస్తే చాలు.. దాదాపు 15 - 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కండువా మార్చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్న నివేదికలు కేసీఆర్‌కు గుండెల్లో గుబులు రేపుతున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు ముందు అనేక నాయకులు పార్టీ మారుతుండడం.. పోటీకి కూడా పెద్దగా ఎవరూ ఆసక్తి చూపకపోవడం.. కేసీఆర్‌కు భారీ అగ్నిపరీక్షగా మారిపోయింది.
ప్రస్తుతమున్న పరిస్థితిని అధిగమించి పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటితే.. కేసీఆర్ పార్టీకి మెరుగులు ఉంటాయి. లేకపోతే.. వచ్చేఎన్నికల నాటికి.. బీఆర్ ఎస్ స్థానాన్ని బీజేపీ భర్తీ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. పైగా అప్పటికి.. కేసీఆర్ ఇప్పుడున్నంత ఉత్సాహంగా ముందుకు సాగే పరిస్థితి ఉండకపోవచ్చు. కేటీఆర్‌పై బీఆర్ ఎస్ నాయకుల్లో పెద్దగా విశ్వాసం లేకపోవడం.. కూడా పార్టీకి శరాఘాతంగా మారుతోంది. సో.. ఈ కాల పరీక్షను కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.