ఉద్యమాలు తలనొప్పిగా మారాయా ?

ఇంతకీ విషయం ఏమిటంటే ఉద్యోగాల భర్తీలో కేసీయార్ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఈ విషయాన్ని ప్రభుత్వం అంగీకరించకపోయినా అదే వాస్తవం.

Update: 2023-09-25 04:35 GMT

కేసీయార్ ప్రభుత్వానికి ఉద్యమాలే తలనొప్పిగా మారాయా ? జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఒకపుడు ఉద్యమాల్లో నుండి పుట్టిన పార్టీకి ఇపుడు అవే ఉద్యమాలు పెద్ద తలనొప్పిగా మారటమే విచిత్రం. ఎక్కడ మాట్లాడినా తమది ఉద్యమచరిత్రున్న పార్టీ అని, ఉద్యమాలు తమకు కొత్తకాదని కేసీయార్, మంత్రులు పదేపదే చెప్పుకుంటారు. మరిపుడు న్యాయంకోసం, హక్కుల కోసం ఉద్యమాలు చేస్తున్న పార్టీలను, విద్యార్ధిసంఘాలను కేసీయార్ ఎందుకు అణిచేస్తున్నారో అర్ధంకావటంలేదు.

ఇంతకీ విషయం ఏమిటంటే ఉద్యోగాల భర్తీలో కేసీయార్ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఈ విషయాన్ని ప్రభుత్వం అంగీకరించకపోయినా అదే వాస్తవం. లక్షలాదిమంది నిరుద్యోగులు హాజరవుతున్న పోటీపరీక్షలను ప్రభుత్వం సక్రమంగా నిర్వహించలేక చేతులెత్తేసింది. టీఎస్సీఎస్సీ ఆధ్వర్యంలో ఏ పరీక్ష నిర్వహించినా ప్రశ్నపత్రం లీకవ్వటమే. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో కేసీయార్ ప్రభుత్వం ఆటలాడుకుంటోందనటంలో సందేహంలేదు. ఈ నేపధ్యంలోనే నిరుద్యోగులు, విద్యార్ధులు టీఎస్పీఎస్సీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు.

వెంటనే బోర్డు ఛైర్మన్, సభ్యులను తీసేసి కొత్తవాళ్ళని నియమించాలని పదేపదే డిమాండ్లు చేస్తున్నారు. దాదాపు ఐదునెలలుగా నిరుద్యోగులు, విద్యార్ధులు ఎన్ని ఆందోళనలు చేసినా పోలీసులతో ఆందోళనలను అణిచేయాలని చూస్తోంది.

ఆందోళనలను అణిచేయాలని చూస్తున్న ప్రభుత్వం వాళ్ళ డిమాండ్లను మాత్రం పట్టించుకోవటంలేదు. పరీక్షలను సక్రమంగా నిర్వహించలేకపోయిన ఛైర్మన్, సభ్యులను తీసేయమని అడగటంలో తప్పేమీలేదు. ఎప్పుడో ఒకసారి పరీక్ష పేపర్ లీకైందంటే అర్ధముంది. అంతేకానీ నిర్వహించిన ప్రతి పరీక్ష పేపర్ లీకవుతోందంటే అది బోర్డు అసమర్ధత కాక మరేమిటి ?

బోర్డును వెంటనే ప్రక్షాళన చేయాలని ఉస్మానియా యూనివర్సిటిలో విద్యార్ధి, నిరుద్యోగ సంఘాలు పెద్దఎత్తున ఆందోళనలు చేశాయి. వీళ్ళకి సహజంగానే కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాల అనుబంధసంఘాలు మద్దతుగా నిలిచాయి. ఒకపుడు టీఆర్ఎస్ కూడా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం కోసం ఉస్మానియా విద్యార్ధిసంఘాల మద్దతునే వాడుకున్నది.

కాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీయార్ ఆ విషయాన్ని మరచిపోయారు. ఇపుడు అదే యూనివర్సిటిలో కేసీయార్ ప్రభుత్వంతో పాటు బోర్డుకు వ్యతిరేకంగా ఉద్యమం ఊపందుకుంటోంది. ముందుముందు ఇదే ఉద్యమం కేసీయార్ ప్రభుత్వానికి మరింత తలనొప్పిగా మారటం ఖాయమనే అనిపిస్తోంది.

Tags:    

Similar News