ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకోవాలని కేసీఆర్ అనుకున్నారా?

ఎదుటివారు చెప్పే మాటల్ని విని.. తన అభిప్రాయాన్ని మార్చుకునేందుకు సైతం కేసీఆర్ వెనుకాడరన్న విషయాన్ని చెబుతూ.. గతంలో జరిగిన ఒక సంచలన నిజాన్ని వెల్లడించారు.

Update: 2023-11-14 05:25 GMT

అప్పుడెప్పుడో జరిగిపోయి.. బయటకు రాని ఒక నిజాన్ని చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కమ్ మంత్రి కేటీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారపూరితంగా వ్యవహరిస్తూ.. తాను ఎవరి మాట వినకుండా.. ఎవరిని కలవకుండా ఉండే లక్షణాలు ఆయన్ను ప్రజలకు దూరం చేస్తున్నాయన్న వ్యాఖ్యపై కేటీఆర్ అనూహ్యంగా రియాక్టు అయ్యారు. తాజాగా పాల్గొన్న ఒక లైవ్ ఇంటర్వ్యూలో కేటీఆర్ నోటి నుంచి వచ్చిన ఆసక్తికర వ్యాఖ్య.. రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. కేసీఆర్ ఎవరి మాట వినరని.. ఎదుటివారికి చెప్పే అవకాశం ఇవ్వరంటూ ఇంటర్వ్యూ చేసే ప్రముఖుడు వ్యాఖ్యానించగా.. అదంతా తప్పు అని.. కేసీఆర్ అందరూ చెప్పే మాట వింటారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఎదుటివారు చెప్పే మాటల్ని విని.. తన అభిప్రాయాన్ని మార్చుకునేందుకు సైతం కేసీఆర్ వెనుకాడరన్న విషయాన్ని చెబుతూ.. గతంలో జరిగిన ఒక సంచలన నిజాన్ని వెల్లడించారు. 2009 ఎన్నికల వేళలో.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకోవటానికి కేసీఆర్ నిర్ణయించారని.. ఆ విషయాన్ని తమతో చెప్పారన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన మూడేళ్ల సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుందని.. అప్పట్లో తాను.. హరీశ్.. జగదీశ్ తదితరులమంతా కూడా ప్రజారాజ్యంతో పొత్తు వద్దని చెప్పామంటూ రివీల్ చేశారు. అంతేకాదు.. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలని తాము సూచన చేశామని.. టీడీపీతో అయితే గెలవాలన్న కసితో పని చేస్తారని.. అందుకే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న తమ మాటను కేసీఆర్ అంగీకరించి.. 2009 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. తన ఉదాహరణ ద్వారా.. కేసీఆర్ ఎదుటి వారి మాటల్ని వింటారని.. తన అభిప్రాయాన్ని మార్చుకుంటారన్నట్లుగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

వైరం వ్యక్తులతో ఉండకూడదని..వ్యవస్థలో కీలక స్థానాల్లో ఉన్న వారు వ్యక్తులతో వ్యక్తిగతంగా వైరం ఎందుకు పెట్టుకోవాలన్న వ్యాఖ్యకు స్పందించిన కేటీఆర్.. ‘పాయింట్ నోటెడ్’ అంటూ ఆ చర్చకు తెలివిగా ఫుల్ స్టాప్ పెట్టారు. మరో సందర్భంలో మాట్లాడిన కేటీఆర్.. కేసీఆర్ ఏం చేసినా బాజాప్తా చేస్తారని.. ఏ విషయాన్ని అయినా ముఖాన చెప్పేయటంలో ఆయన తర్వాతే ఎవరైనా అని వ్యాఖ్యానించారు. వ్యతిరేకంగా రాసినోళ్లకు ఇళ్లు ఇవ్వమని చెప్పటానికి ఎంత ధైర్యం ఉండాలన్న కేటీఆర్ మాటలకు అడ్డుతగులుతూ.. ‘ధైర్యమా? మూర్ఖత్వమా?’ అని ఇంటర్వ్యూ చేసే ప్రముఖుడు వ్యాఖ్యానించటం గమనార్హం.

ఈసారి ఎన్నికల్లో సిట్టింగులకు సీట్లు ఇవ్వగలరా? అని రేవంత్ సవాలు విసిరారని.. కానీ ఈ రోజు సిట్టింగుల్లో అత్యధికులకు సీట్లు ఇచ్చామన్నారు కేటీఆర్. తాను ఒక సందర్భంలో వంద మందిని మార్చేసినా.. గెలుస్తామని తన తండ్రి కేసీఆర్ కు చెప్పానని.. కానీ ఆయన మాత్రం అందుకు నో చెప్పారన్నారు. పదిహేనేళ్లుగా కలిసి ప్రయాణం చేసే వారిని వదులుకోవద్దని.. దూరపు కొండలు నునుపు అనుకోవటంలో అర్థం లేదని చెప్పారన్నారు. విధేయులుగా.. నమ్మకంగా ఉన్న వారిలోని చిన్న చిన్న లోపాల్ని సరిదిద్దుకొని ముందకు వెళదామని చెప్పారంటూ సిట్టింగులకు సీట్లు ఇవ్వటం వెనుక లాజిక్ చెప్పుకొచ్చారు కేటీఆర్.

Tags:    

Similar News