మోడీకి సెగ పెట్టిన మొదటి రాష్ట్రం.. !
ఈ ఏడాది జరగనున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కీలకమైన జమిలి ఎన్నికల బిల్లును తీసుకురావాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంకల్పం.
అదేంటి అనుకుంటున్నారా? హరియాణాలో హ్యాట్రిక్ విజయంతో మంచి ఖుషీమీదున్న ప్రధానినరేంద్ర మోడీకి సెగేంటనని భావిస్తున్నారా? అంటే.. అక్కడే ఉంది చిత్రమంతా. ఈ ఏడాది జరగనున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కీలకమైన జమిలి ఎన్నికల బిల్లును తీసుకురావాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంకల్పం. ఇప్పటికే జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో వేసిన కమిటీ కూడా తన నివేదికను ప్రభుత్వానికి ఇచ్చేసింది.
ఇక, పార్లమెంటులో బిల్లు పెట్టి.. రాష్ట్రపతితో ఆమోద ముద్ర వేయించుకోవడమే తరువాయి.. అన్నట్టుగా మోడీ సర్కారు ధీమాగా ఉంది. కానీ, జమిలి ఎన్నికలు .. (అంటే దేశవ్యాప్తంగా పార్లమెంటుకు, అసెంబ్లీ లకు ఒకేసారి ఎన్నికల నిర్వహణ) నిర్వహించాలంటే.. కేవలం కేంద్రం ఒక్కటే ఒప్పుకొంటే కాదు. రాష్ట్రా ల్లో ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాల అనుమతి కూడా తప్పని సరి. అవి ఆమోదించి.. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన తర్వాతే కేంద్రానికి సదరు చట్టం చేసేందుకు అవకాశం ఉంటుంది.
అందుకే.. బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఎన్డీయే కూటమి ఉన్న ఏపీ, మహారాస్ట్ర వంటి రాష్ట్రాలను కేంద్ర ప్రభు త్వం తరచుగా దువ్వుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మూడింట రెండొంతుల రాష్ట్రాలు జమిలికి జై కొట్టాలి. అదేసమయంలో తమ అసెంబ్లీలలో తీర్మానం కూడా చేసుకోవాలి. ఈ విషయంలో కొన్ని రాష్ట్రా లు ఒకే అన్నట్టుగా ఉన్నా.. మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడు అధికార పార్టీ డీఎంకే జమిలికి ఓకే చెప్పలేదు.
ఇక, తాజాగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా జమిలికి వ్యతిరేకంగా అసెంబ్లీలోనే తాజాగా తీర్మానం చేసింది. దీనిని తాజాగా ఆమోదించింది కూడా. ఇక, పశ్చిమ బెంగాల్ సహా పలు ప్రాంతీయ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న జార్ఖండ్ వంటివి కూడా.. జమిలికి జై కొట్టడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో దేశంలోనే తొలిసారి జమిలికి వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం(అందరూ ఉన్నత విద్యావంతులే) తీర్మానం చేయడం ఒకరకంగా మోడీకి ఎదురుదెబ్బగానే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.