తెలంగాణకు ఏమైంది? రక్తమోడుతున్న వరుస ప్రమాదాలు!

ఇటీవల కాలంలో తెలంగాణలో రోడ్లు రక్తమోడుతున్నాయి. ఒకటి తర్వాత ఒకటిగా పలు ఘోర ప్రమాదాలు నమోదు అవుతున్నాయి.

Update: 2024-04-25 05:22 GMT

ఇటీవల కాలంలో తెలంగాణలో రోడ్లు రక్తమోడుతున్నాయి. ఒకటి తర్వాత ఒకటిగా పలు ఘోర ప్రమాదాలు నమోదు అవుతున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ సమీపంలోని నేషనల్ హైవే మీద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని గుర్తించే విషయంలో కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి తప్పునకు ఆరుగురు ప్రాణాలు విడవాల్సిన దుస్థితి.

ఈ రోజు తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ విషాద ఉదంతంలో చిన్నారితో సహా మొత్తం ఆరుగురు మరణించగా.. గాయపడిన మరో ఇద్దరిని కోదాడ ఆసుపత్రికి తరలించి వైద్యం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే.. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. ప్రమాదంలో మరణించిన వారెవరు? వారి వివరాలు ఏమిటి? ఏ పని మీద హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతున్నారు? లాంటి ప్రశ్నలకు పోలీసులు సమాధానం వెతుకుతున్నారు.

ఇదిలా ఉంటే.. మరో దారుణ రోడ్డు ప్రమాదం తెలంగాణలో చోటు చేసుకుంది. బాధ్యత మరిచి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిననలుగురు కుర్రాళ్లు తమ ప్రాణాల్ని పోగొట్టుకున్నారు. వారి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చారు. వరంగల్ జిల్లా వర్ధన్న పేట పట్టణ శివారులోచోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఒకే బైకు మీద ప్రయాణిస్తున్న నలుగురు కుర్రాళ్లు మరణించారు.

వర్దన్నపేటకు చెందిన గణేశ్.. ఇల్లందు గ్రామానికి చెందిన సిద్ధు.. వరుణ్ తేజ్.. రనిల్ కుమార్ లు కలిసి ఒకే బైక్ మీద ఇల్లంద నుంచి వర్ధన్న పేటకు బయలుదేరారు. ఒకేబైక్ మీద నలుగురు ప్రయాణించటం ప్రమాదమన్న విషయాన్ని వారు పట్టించుకోలేదు. ఇంటర్ ఫలితాల్లో పాస్ అయ్యామన్న ఆనందం.. ఉత్సాహంతో వారు ఒకే బైక్ మీద బయలుదేరారు. అయితే.. ఎదురుగా వస్తున్న బస్సును గుర్తించే విషయంలో చోటు చేసుకున్న లోపంతో వారి బైక్ బస్సును ఢీ కొంది. మూల మలుపులో ఈ ఘటన చోటు చేసుకోవటం.. రెండు వాహనాలు వేగంగా ఉండటంతో.. భారీ ప్రాణ నష్టం వాటిల్లింది.

ప్రైవేటు బస్సును ఢీ కొన్న వేగానికి.. బైక్ మీద ప్రయాణిస్తున్న నలుగురు స్నేహితులు 50 మీటర్ల దూరానికి ఎగిరి పడ్డారు. చెల్లాచెదురుగా పడిన ఈ కుర్రాళ్లను చూసిన వారంతా కంటతడి పెట్టుకున్నారు. ఇక.. ఈ నలుగురు కుర్రాళ్ల తల్లిదండ్రులకు వీరొక్కరే సంతానం కావటం గమనార్హం. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు.. (నాలుగో వ్యక్తి వేరే ఊరికి చెందినవాడు) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవటంతో ఆ గ్రామంలో పెను విషాదం చోటు చేసుకుంది.

Tags:    

Similar News