నానీలు....నిన్నగా నేడు లేదుగా మరి !

2019 నుంచి 2024 మధ్యలో అయిదేళ్ళ పాటు ఏపీ పాలిటిక్స్ లో నానీ అన్న పేరు ఎంత బాగా నలిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు.

Update: 2024-12-30 05:30 GMT

నాని అన్నది తెలుగు నాట ముద్దు పేరు. చాలా మందికి అసలు పేరు కంటే కొసరు పేరుగా ఉన్న ఈ పేరే పాపులర్ గా ఉంది. అది కాస్తా వారు రాజకీయాల్లో రాణిస్తున్నా ఇంకా అలవాటూగా మారింది. 2019 నుంచి 2024 మధ్యలో అయిదేళ్ళ పాటు ఏపీ పాలిటిక్స్ లో నానీ అన్న పేరు ఎంత బాగా నలిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు.

వైసీపీ ప్రభుత్వంలో ముగ్గురు నానీలు మంత్రులుగా పనిచేశారు. వారిలో ఇద్దరు ఉమ్మడి క్రిష్ణా జిల్లాకు చెందిన వారు అయితే మరొకరు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆళ్ళ నాని అలియాస్ కాళీ క్రిష్ణ శ్రీనివాస్. ఇక గుడివాడలో కొడాలి వెంకటేశ్వరరరావు అలియాస్ నాని వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా నిలిచారు.

మాటలతో సెటైర్లు పంచులు పేలుస్తూ పేర్ని వెంకటరామయ్య అలియాస్ నాని కూడా అదే పార్టీలో కీలకంగా ఉంటూ సమాచార మంత్రిగా వ్యవహరించారు. ఇలా ఈ ముగ్గురు నానీలు 2019 నుంచి 2022 దాకా మూడేళ్ల పాటు మంత్రులుగా చేశారు.

ఆ తరువాత ఈ ముగ్గురినీ పక్కన పెట్టారు. దాంతో మాజీ మంత్రులు అయ్యారు. ఆ తరువాత 2024 ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓటమి పాలు కావడంతో కొడాలి నాని ఫుల్ సైలెంట్ అయితే ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ గడప దగ్గర ఉన్నారు. ఆ పార్టీలో చేరేందుకు ఆయన వెయిట్ చేస్తున్నారు అని అంటున్నారు

పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి వైసీపీకి ఒక బలమైన వాయిస్ గా ఉంటున్నా ఇటీవల కాలంలో రేషన్ బియ్యం వ్యవహారంలో ఆయన కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక ఈ ముగ్గురు నానీలకు ఇపుడు రాజకీయం అంతా రివర్స్ లో నడుస్తోంది.

వెలుగులు అన్నీ పోయి చీకట్ల చికాకులు కమ్ముకుంటున్నాయి. కొడాలి నాని అయితే ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు అని అంటున్నారు. ఆయన మీద కేసులు పెట్టి అరెస్టు చేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం చూస్తోంది అని వార్తలు అయితే వచ్చాయి కానీ ఇప్పటిదాకా అలాంటిది లేదు. మరో వైపు చూస్తే కొడాలి నాని రాజకీయ సన్యాసం స్వీకరిస్తారు అని అంటున్నారు. అది కూడా పెద్ద ఎత్తున ప్రచారంగా సాగుతోంది.

ఇంకో వైపు చూస్తే పేర్ని నాని కూడా ఇటీవల బాగా డీలా పడిపోతున్నారు. తన కుటుంబం మీద కూడా రాజకీయాలు వచ్చేస్తున్నాయని కలత చెందుతునారు దాంతో ఆయన సైతం రాజకీయాలకు దూరంగా ఉంటారు అన్న చర్చ ఒకటి బయల్దేరింది. అది ఎంతవరకు నిజమో చూడాల్సి ఉంది.

ఇక ఆళ్ళ నాని విషయం తీసుకుంటే ఆయన టీడీపీలో చేరాలని చూస్తున్నా అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ అడ్డుకుంటున్నారు. ఆయన పార్టీలో చేరినా పెద్దగా తేడా అయితే ఉండదని అంటున్నారు దాంతో ఆయన సైతం తన ప్రయత్నాలు ఫలించకపోతే రాజకీయాల నుంచి విరామమే బెటర్ అని ఆలోచిస్తున్నారు అంటున్నారు

ఇక వీరితో పాటుగా మరో నాని ఉన్నారు. ఆయనే కేశినేని నాని. విజయవాడ ఎంపీగా వరసగా రెండు సార్లు టీడీపీ నుంచి గెలిచిన ఆయన 2024లో మాత్రం వైసీపీలో చేరి ఎంపీగా పోటీ చేసి ఓటమి మూటగట్టుకున్నారు ఆ వెంటనే ఆయన తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించేశారు. మొత్తానికి అయిదేళ్ల పాటు అలా జనంలో నానిన నానీల రాజకీయం ఇపుడు ఇలా అయిందేంటి అంటే అదే నిన్నా నేడూ రేపటికి తేడా అని అంటున్నారు.

Tags:    

Similar News