నందమూరి సుహాసిని కొడుకు పెళ్లిలో కొడాలి నాని!
దివంగత నందమూరి హరిక్రిష్ణ మనమడు.. ఆయన కుమార్తె నందమూరి సుహాసిని కొడుకు పెళ్లికి కొడాలి నాని హాజరై.. వధూవరులను ఆశీర్వదించిన ఫోటో ఒకటి
గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నానిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయంగా చంద్రబాబుపై నిప్పులు చెరగాలన్నా.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడాలన్నా బయటకు వచ్చి.. చెలరేగిపోయి మాట్లాడే నేతల్లో కొడాలి నాని ముందుంటారు. చంద్రబాబును అభిమానించే వారందరికి ఆయన ప్రధమ శత్రువు. చంద్రబాబును ఆయన సతీమణితో సహా అందరిని అడ్డూ ఆపూలేని రీతిలో వ్యాఖ్యలు చేస్తారంటూ కొడాలి నానిపై తెలుగు తమ్ముళ్లు విరుచుకుపడుతుంటారు. రాజకీయంగా సవాలచ్చ ఉండొచ్చు కానీ.. కొడాలి మాదిరి వ్యక్తిగత వ్యాఖ్యల్ని విమర్శిస్తుంటారు. చంద్రబాబు మీద చేసే వ్యాఖ్యల నేపథ్యంలో కొడలికి.. నందమూరి ఫ్యామిలీకి మధ్య దూరం పెరిగిందన్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్న మాట తెర మీదకు వచ్చిన ఉదంతం ఇప్పుడు కలకలాన్ని రేపుతోంది.
దివంగత నందమూరి హరిక్రిష్ణ మనమడు.. ఆయన కుమార్తె నందమూరి సుహాసిని కొడుకు పెళ్లికి కొడాలి నాని హాజరై.. వధూవరులను ఆశీర్వదించిన ఫోటో ఒకటి.. ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఏడాది ఆగస్టు 20న హైదరాబాద్ లో జరిగిన ఈ వివాహానికి కొడాలి నాని వచ్చారన్న విషయాన్ని ఖరారు చేసేలా ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చంద్రబాబును నోటికి వచ్చినట్లుగా విరుచుకుపడే కొడాలి నానిని.. నందమూరి వారింట్లో జరిగిన పెళ్లికి పిలవటమా? అన్న విస్మయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రక్ట్ లో జరిగిన ఈ వివాహ వేడుకకు చంద్రబాబు దంపతులు కూడా హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ వేడుకలో బాలయ్య.. ఆయన తనయుడు తో పాటు జూనియర్ ఎన్టీఆర్.. కల్యాణ్ రామ్ తో సహా పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు. పెళ్లి జరిగిన దాదాపు పాతిక రోజుల తర్వాత ఈ పెళ్లికి కొడాలి నాని రావటం.. కొత్త జంట నెత్తిన అక్షింతలు వేసి ఆశీర్వదించిన వైనాన్నిజీర్ణించుకోలేని పరిస్థితి. రాజకీయం.. రాజకీయంగా ఉంటే ఫర్లేదు. వ్యక్తిగత వ్యాఖ్యలతో బాబు ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేసే కొడాలి నానిని నందమూరి వారింట జరిగిన పెళ్లికి ఆహ్వానించటమా? అన్నదిప్పుడు చర్చగా మారింది.
తన మాటలతో చంద్రబాబును ఫుట్ బాల్ ఆడుకునే కొడాలి నానికి నందమూరి వారింట్లో ఇంత ప్రయారిటీ ఇవ్వటమా? అన్నదిప్పుడు చర్చగా మారింది. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ కాగా.. వీడియో మాత్రం ప్లే కావట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలికి మధ్య స్నేహం ఎంతన్న విషయం తెలియంది కాదు.
అయితే.. మారిన రాజకీయ పరిస్థితుల్లో కొడాలితో నందమూరి ఫ్యామిలీకి సంబంధాలు ఉండవన్న చర్చ జరిగేది. అందుకు భిన్నంగా రాజకీయాలు రాజకీయాలే.. వ్యక్తిగత సంబంధాలు సంబంధాలే అన్న విషయాన్ని తాజాగా వెలుగు చూసిన ఫోటో స్పష్టం చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.