కోదండం మాష్టారికే ఎందుకిలా? ప్రమాణ వేళ హైకోర్టు షాక్!
ఉద్యమంలో పోగొట్టుకున్న భూములకు బదులు అంతకు రెట్టింపు భూముల్ని సంపాదించుకోవాలన్న కసి ఆయనలో ఎప్పుడూ కనిపించేది కాదు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిజాయితీగా పని చేసిన అతి కొద్ది మందిలో కోదండం సారు ఒకరు. ఇక్కడో విషయాన్ని తప్పనిసరిగా ప్రస్తావించాలి. ఉద్యమ వేళ.. ఆ పేరు చెప్పుకొని డబ్బులు దండుకున్న ఎంతో మందికి భిన్నంగా కోదండం సారు.. తన వ్యవసాయ భూమిని అమ్మేసుకొని మరీ ఆ డబ్బుల్ని ఉద్యమానికి ఖర్చు చేశారు. తాను పెట్టిన డబ్బుల్ని పెట్టుబడిగా చూడకుండా.. తనకు జన్మనిచ్చిన తెలంగాణకు బదులు తీర్చుకోవటానికి కలిగిన అవకాశంగా భావించారే తప్పించి.. మరోలా ఆయన ఆలోచించలేదు.
ఉద్యమంలో పోగొట్టుకున్న భూములకు బదులు అంతకు రెట్టింపు భూముల్ని సంపాదించుకోవాలన్న కసి ఆయనలో ఎప్పుడూ కనిపించేది కాదు. ఆ మాటకు వస్తే.. తాను అమ్ముకున్న ఎకరాల లెక్కను ఏ వేదిక మీదనే కాదు.. తన సన్నిహితుల వద్ద కూడా ప్రస్తావించేవారు కాదు. నిజానికి ఆయన రాజీ పడాలని డిసైడ్ అయి ఉంటే.. ఎప్పుడో పదవులతో మునిగి తేలుతూ ఉండేవారు కాదు. అలాంటి ఆయనకు రాక రాక ఎమ్మెల్సీ అయ్యే అవకాశం వచ్చింది. వచ్చినట్లే వచ్చి మళ్లీ చేజారింది.
అనుకున్నట్లుగా జరిగితే ఈ రోజు (జనవరి 31) ఆయన తన పదవీ ప్రమాణస్వీకారాన్ని చేయాల్సి ఉండేది. గవర్నర్ కోటాలో ఆయన్ను.. మరొకరిని (అమీర్ అలీఖాన్) ఎంపిక చేయటం తెలిసిందే. అయితే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు కీలక ఉత్తర్వు జారీ చేయటంతో ఆయన ప్రమాణస్వీకార ప్రోగ్రాం ప్రస్తుతానికి వాయిదా పడింది. ఇప్పుడున్న స్టేటస్ కోను కంటిన్యూ చేయాలని.. కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించొద్దని హైకోర్టు తన ఆదేశాల్లో జారీ చేసింది. దీంతో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రొఫెసర్ కోదండరామ్.. అమీర్ అలీఖాన్ లు ప్రమాణం చేయటానికి వీల్లేని పరిస్థితి. ఎందుకిలా? అంటే.. గతంలోఈ స్థానాల్లో ఒకదానికి ఎంపిక చేసిన దాసోజు శ్రవణ్ హైకోర్టును ఆశ్రయించటమే.
ఎందుకంటే.. కొద్ది నెలల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ప్రకటించారు. అందులో భాగంగా దాసోజు శ్రవణ్.. సత్యనారాయణ నామినేట్ చేస్తున్నట్లుగా కేసీఆర్ కేబినెట్ తీర్మానం చేసింది. దానిపై గవర్నర్ అభ్యంతరాలు వ్యక్తం చేయటంతో అది ఆగింది. తాజాగా దాసోజ్ శ్రవణ్ హైకోర్టును ఆశ్రయిస్తూ.. తమను బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసిందని.. ఆర్టికల్ 171 ప్రకారం తమ నియామకాన్ని తిరస్కరించే హక్కు గవర్నర్ కు లేదని పేర్కొన్నారు. వీరి పిటిషన్ రాష్ట్ర హైకోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ లోపు.. అదే కోటా కింద (వారి స్థానంలో) కోదండరాం.. అమీర్ అలీఖాన్ లను ఎంపిక చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శ్రవణ్ కోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఇదంతా చూస్తే.. తెలంగాణ ఏర్పడి పదేళ్లు అయినా ఏదో ఒక కారణంగా ఆయనకు పదవులు రాని పరిస్తితి. నిజాయితీగా కొట్లాడిన వారికే ఈ పరీక్షలు అన్న భావన కలుగక మానదు.