వైసీపీ నుంచి వెళ్ళిపోయే ఎమ్మెల్యేలు ఎంతమంది ?

వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు టీడీపీ గేట్లు తెరిస్తే దూకడం ఖాయమని మంత్రి కొల్లు రవీంద్ర తాజాగా చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్ పార్టీలో దుమారం రేపుతున్నాయి.

Update: 2024-08-16 03:38 GMT

వైసీపీకి భారీ షాక్ కి రంగం సిద్ధం అవుతోందా. ఎన్నికల్లో ఘోర ఓటని తరువాత కేవలం 11 సీట్లకు పరిమితం అయిన వైసీపీ ఎలా ముందుకు సాగాలని ఆలోచిస్తోంది. ఆ ఉన్న 11 మందిలో కూడా రెండు వంతుల మంది గీత దాటుతారా లేక గోడ దూకుతారా అన్నది చర్చగా ఉంది.

వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు టీడీపీ గేట్లు తెరిస్తే దూకడం ఖాయమని మంత్రి కొల్లు రవీంద్ర తాజాగా చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్ పార్టీలో దుమారం రేపుతున్నాయి. ఏకంగా వైసీపీ నుంచి ఎనిమిది మంది దాకా ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు అని కొల్లు రవీంద్ర హాట్ కామెంట్స్ చేశారు.

అంటే వైసీపీలో గెలిచిన వారు 11 మంది. అందులో జగన్ ని తీసేస్తే పది మంది, ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఉన్నారు. అలగే జగన్ కి అత్యంత ఆప్తుడు గా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఉన్నారు. ఈ ఇలా నలుగురు తప్ప వైసీపీలో మిగిలిన వారి మీద అంతగా నమ్మకాలు లేవని అంటున్నారు.

అందులో పడేరు అరకు నుంచి ఇద్దరు, కడప నుంచి ఒకరు, అలగే మరికొన్ని సీట్లలో వైసీపీ గెలిచింది. వీరంతా పెద్దగా జనాలకు తెలిసిన వారు కారు. వైసీపీ అయితే అసెంబ్లీ ముఖమే చూడవద్దు అంటోంది. ఇక ఎమ్మెల్యేలకు విలువ గౌరవం ఏమైనా దక్కుతాయీ అంటే అసెంబ్లీ వైపు చూస్తేనే కదా.

మరి ఆ అవకాశం పార్టీ ఇవ్వడం లేదు. నియోజకవర్గంలో ఎటూ వైసీపీ ఎమ్మెల్యేలకు పనులు కావు. దాంతో ఇవన్నీ చూసిన వారు ఈ రోజు కాకపోయినా రేపు అయినా వైసీపీ నుంచి టీడీపీ వైపు జంప్ చేసినా చేయవచ్చు అని అంటున్నారు. నిజానికి టీడీపీ ఇపుడు హౌజ్ ఫుల్ బోర్డు ఒక్కటే తరువాయి అన్నట్లుగా ఉంది. ఆ పార్టీలో ఎక్కువ మంది గెలిచారు.

వారికి ఫిరాయింపులు అవసరం లేదు. కానీ వైసీపీని ముప్పతిప్పలు పెట్టాలని అనుకుంటే చేర్చుకోవచ్చు. ఇక చేరిన వారు కూడా తాము అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉంటే చాలు అసెంబ్లీకి రావచ్చు. నియోజకవర్గంలో పనులు అవుతాయి అని ఎంతో కొంత సంతృప్తిని చెందుతారు అని అంటున్నారు.

మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ విధంగా కొల్లు రవీంద్ర కామెంట్స్ చేశారా అన్న చర్చ సాగుతోంది. మరో వైపు వైసీపీ అధినాయకత్వం తీరు కూడా మారాలని అంటున్నారు. 11 మంది ఎమ్మెల్యేలు అంటే డబుల్ డిజిట్. ఆ నంబర్ ని అయినా కాపాడుకుంటూ అసెంబ్లీకి జగన్ వెళ్లి ప్ర్తిపక్ష పాత్ర పోషించాలని కోరుతున్నారు.

అదే విధంగా ఉన్న ఎమ్మెల్యేలను కలుపుకుంటూ వారితో ఎప్పటికపుడు టచ్ లో ఉంటూ వారికి దిశా నిర్దేశం చేస్తూ ముందుకు సాగాల్సి ఉంటుందని అంటున్నారు. అలా లేకపోతే మాత్రం ఎంతకాలం వారు వెయిట్ చేస్తారు అన్న చర్చ కూడా ఉంది.

టీడీపీ తమకు అవసరం లేదు అనుకుని ఆగుతోంది కానీ ఒకవేళ రమ్మని పిలిస్తే వెళ్లకుండా వైసీపీలో ఉండేవారు ఎంతమంది అని కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఏది ఏమైనా వైసీపీ తనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బలాన్ని వాడుకుంటూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే రేపటి రోజున ఉన్న వారిలో ఎవరు టీడీపీలోకి జంప్ అయినా నింద వారి మీదనే పడుతుంది, సానుభూతి వైసీపీకి దక్కుతుంది అని అంటున్నారు. అలా కాకుండా వారిని అసెంబ్లీకి వెళ్లకుండా చేస్తూ ఎమ్మెల్యేలుగా వారికి ఏ అవకాశాలు లేకుండా చేస్తే మాత్రం టీడీపీ ప్రమేయం లేకుండానే గోడ దూకుడు స్టార్ట్ చేస్తారు అని అంటున్నారు.

Tags:    

Similar News