పోలింగ్ సరళి: అత్యధికం కోనసీమ.. అత్యల్పం అల్లూరు

అంతా ఆసక్తిగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ఘట్టం విజయవంతంగా ముగిసింది.

Update: 2024-05-14 05:18 GMT

అంతా ఆసక్తిగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ఘట్టం విజయవంతంగా ముగిసింది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో పలు చెదురుముదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్నిచోట్ల హద్దులు దాటిన ఆవేశాలు ఆవిష్క్రతమయ్యాయి. అందరి అంచనాలకు తగ్గట్లే పోలింగ్ భారీగా నమోదైంది. ఏపీకి చెందిన ప్రజలు దేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ వారంతా ఎన్నికల సమయానికి ఏపీకి రావటం.. తమ ఓటుహక్కును వినియోగించకునేందుకు ఆసక్తి ప్రదర్శించటం తెలిసిందే.

అర్థరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత ఎన్నికల కమిషన్ విడుదల చేసిన జిల్లాల వారీగా పోలింగ్ శాతం చూస్తే.. ఏపీలో ఓటరు చైతన్యం ఏ రేంజ్ లో ఉందన్నది అర్థం కాక మానదు. ఏపీలో 80 శాతం పోలింగ్ దాటిన జిల్లాలు ఏకంగా 9 ఉండటం విశేషం. 70 శాతానికి పైనే పోలింగ్ నమోదైన జిల్లాలు 14. ఏపీలోని అత్యధిక జిల్లాల్లో పోలింగ్ 70 శాతానికి దాటం ఆసక్తికరంగా మారింది. ఇక.. 60 - 70 శాతం మధ్యలో పోలింగ్ నమోదైన జిల్లాలు కేవలం రెండు మాత్రమే నిలిచాయి.

ఏపీలో అత్యధికంగా పోలింగ్ నమోదైన జిల్లాగా కోనసీమ నిలిచింది. కోనసీమ వ్యాప్తంగా 83.19 శాతం పోలింగ్ నమోదైంది. కోనసీమ కంటే తక్కువగా.. అదే సమయంలో 83 శాతం నమోదైన జిల్లాగా ఏలూరు జిల్లాగా నిలిచింది. ఈ జిల్లాలో పోలింగ్ 83.04 శాతంగా నమోదైంది. అత్యధిక పోలింగ్ కు ఒక శాతం కంటే తక్కువగా నమోదైన జిల్లాలు ఏకంగా ఐదు ఉన్నాయి. ఇదంతా చూస్తే.. ఏపీలోని అన్ని జిల్లాలకు చెందిన ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని చెప్పాలి. ఇక.. అతి తక్కువగా పోలింగ్ నమోదైన జిల్లాల జాబితాలో అల్లూరి జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 63.19 శాతంపోలింగ్ నమోదైంది. ఏపీలో అతి తక్కువ పోలింగ్ నమోదైన జిల్లా ఇదే. దీని తర్వాత రెండో అతి తక్కువ జిల్లాగా విశాఖ నిలిచింది. ఇక్కడ 65.50 శాతం పోలింగ్ నమోదైంది.

Tags:    

Similar News