కృష్ణయ్య రాజీనామా.. కొన్ని రాజకీయాలు..!
ఆర్. కృష్ణయ్య.. వివాదాస్పద నిర్ణయాలకు.. వివాదాస్పద రాజకీయాలకు పెట్టింది పేరనే వాదన తెచ్చుకున్న బీసీ నాయకుడు.
ఆర్. కృష్ణయ్య.. వివాదాస్పద నిర్ణయాలకు.. వివాదాస్పద రాజకీయాలకు పెట్టింది పేరనే వాదన తెచ్చుకున్న బీసీ నాయకుడు. ఒకప్పుడు బీసీల కోసమే పోరాటం చేసిన కృష్ణయ్య.. తొలిసారి 2014 ఎన్నికల్లో రాజకీయాల్లోకి అడుగులు వేశారు. వస్తూ వస్తూనే ఆయన బీసీలకు వెన్నుదన్నుగా ఉన్న టీడీపీ వైపు మొగ్గు చూపారు. ఆ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేసిన ఆయన ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రచారంలోకి వచ్చారు.
అయితే.. సరైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ.. నిర్మాణాత్మక రాజకీయాలు చేయడంలోనూ కృష్ణయ్య ఎప్పుడూ.. వెనుకబడే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన తీరు మారలేదన్న వాదనే వినిపిస్తోంది. ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా వ్యవహరిస్తారన్న పేరు కూడా తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన చూపు బీజేపీవైపు ఉందన్న విషయం కొన్నాళ్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆయన మనసులో ఏముందో మాత్రం ఇప్పటికీ చెప్పలేదు.
ఇంతలోనే అందరూ ఊహించినట్టుగానే కృష్ణయ్య వైసీపీ ఇచ్చిన రాజ్యసభ సీటుకు రాజీనామా చేశారు. ఇదొక రాజకీయ నిర్ణయంగానే చూడలేం. దీని వెనుక.. అనేక వ్యూహాత్మక అడుగులు కూడా ఉన్నాయని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ఆర్. కృష్ణయ్యకు జగన్ ఏరికోరి రాజ్యసభ సీటును సమర్పించారు. నిజానికి ఎంతో మంది ఈ పదవి కోసం ఎదురు చూశారు. కానీ, వారందరినీ తప్పించి.. బీసీ ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు జగన్ ప్రయత్నించారు.
ఈ వ్యవహారం కృష్ణయ్యకు బాగానే కలిసి వచ్చింది. కానీ, క్షేత్రస్థాయిలో వైసీపీకి ఒరిగింది ఏమీ లేదు. ఇదే పరిస్థితి.. గతంలో టీడీపీకి కూడా ఎదురైంది. అప్పట్లోనూ ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా కృష్ణయ్యను ప్రతిపాదించిన టీడీపీకి.. ఆయన ఝలక్ ఇచ్చారు. అంటే.. ఒకరకంగా.. రాజకీయ విన్యాసా లు చేయడంలో కృష్ణయ్య పంథా ఇప్పుడు కొత్తకాదు. ఆయనను దరిచేర్చిన వారిదే తప్పంతా! అనేది వాస్తవం. ఎలా చూసుకున్నా.. కృష్ణయ్య రాజకీయాలు వ్యక్తిగత సౌకర్యాల కోసమే తప్ప.. పార్టీల కోసం కాదనేది మరోసారి స్పష్టమైంది.