మిఠాయిలు పంచితే సస్పెండ్ చేయరా కేటీఆర్?

హైదరాబాద్ మహానగర శివారు పరిధిలోని ఒక పాఠశాలలో ప్రిన్సిపల్.. విద్యార్థులకు కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మిఠాయిలు పంచటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

Update: 2025-02-19 07:30 GMT

ఉద్యోగి తన ఉద్యోగాన్ని చేసుకుంటూ పోతే సరి. వ్యక్తిగత అభిరుచుల్ని ప్రదర్శించటం అంత మంచిది కాదు. అందులోనూ రాజకీయ అంశాలకు సంబంధించి మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయంలో చేసే పొరపాట్లకు భారీగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా స్కూల్లో ప్రిన్సిపల్ మిఠాయిలు పంచటం తప్పా? అని ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్.

హైదరాబాద్ మహానగర శివారు పరిధిలోని ఒక పాఠశాలలో ప్రిన్సిపల్.. విద్యార్థులకు కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మిఠాయిలు పంచటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై కేటీఆర్ మండిపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి పుట్టినరోజు నాడు స్కూల్లో మిఠాయిలు పంచితే తప్పా? అని ప్రశ్నిస్తున్నారు. 14 ఏళ్ల పాటు అహింసాయుత పోరాటం చేసి.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి.. తెలంగాణ ఆత్మగౌరవాన్నినిలబెట్టిన కేసీఆర్ పుట్టిన రోజున విద్యార్థులకు మిఠాయిలు పంచితే తప్పా? అని ప్రశ్నిస్తూ.. సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డికి వస్తే మాత్రం స్కూల్లో ఆయనకు పూలు చల్లి.. విద్యార్థుల చేత సెల్యూట్ చేయిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.

పదేళ్లు ప్రభుత్వాన్నినడిపిన కేటీఆర్ లాంటి వాళ్లకు ఏ విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన అవగాహన ఎక్కువే ఉంది. అదే సమయంలో.. ఇప్పుడున్న కాలంలో ఎవరికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. మంచి చెడుల గురించి అవగాహన ఉంది. ఒకవేళ కేటీఆర్ చెప్పినట్లుగా.. స్కూల్లో కేసీఆర్ పుట్టినరోజున విద్యార్థులకు మిఠాయిలు పంచే కార్యక్రమాన్ని చేపడితే ఏమీ అనకూడదు.. స్వాగతించాలన్నట్లుగా చెబుతున్నారు. భవిష్యత్తులో కేసీఆర్ సర్కారు మళ్లీ వచ్చి.. ఐదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ పుట్టిన రోజును ఏదైనా స్కూల్లోనో.. కాలేజీలోనో వేడుక నిర్వహించినా? మిటాయిలు పంచి పెడితే ఇదే కేటీఆర్ అప్పడు స్వాగిస్తారా? చూస్తూ ఊరుకుంటారా? లాంటి ప్రశ్నలు వేసుకుంటే అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది.

ఇక్కడ చెప్పేదేమంటే.. ఇలాంటి విషయాల మీద తరచూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం వల్ల కేటీఆర్ కు ఇమేజ్ పెరగటం తర్వాత.. డ్యామేజ్ ఎక్కువ అవుతుందన్న విషయాన్ని ఆయన గుర్తిస్తే మంచిది. ఆ మాటకు వస్తే.. కొన్నిరోజుల పాటు ఏ అంశం మీదా స్పందించకుండా మౌనంగా ఉంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తవుతోంది. ఆ దిశగా కేటీఆర్ ఆలోచిస్తే కాస్త బాగుంటుంది. ఏమంటారు?

Tags:    

Similar News