పాపం.. బాధాకరం.. అంటూ బీజేపీ, కాంగ్రెస్ కు కేటీఆర్ దెబ్బ

ఓ వైపు బీఆర్ఎస్ ను ప్రచారంలో పరుగులు పెట్టిస్తూనే మరోవైపు ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, బీజేపీని దెబ్బ కొడుతూ కేటీఆర్ సాగుతున్నారు.

Update: 2023-11-15 00:30 GMT

ఓ వైపు బీఆర్ఎస్ ను ప్రచారంలో పరుగులు పెట్టిస్తూనే మరోవైపు ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, బీజేపీని దెబ్బ కొడుతూ కేటీఆర్ సాగుతున్నారు. ఆ పార్టీలపై తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు చేస్తూ మరోసారి బీఆర్ఎస్ నే గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. ఇంకోవైపు ఆయా పార్టీలోని కీలక నాయకులను బీఆర్ఎస్ లో చేర్చుకుంటూ ప్రత్యర్థులను దెబ్బకొడుతున్నారు. ఇప్పటికే ఖమ్మంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన కేటీఆర్.. అక్కడి కాంగ్రెస్ కీలక నాయకులకు కండువా కప్పేశారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలో ప్రాధాన్యత దక్కడం లేదని, టికెట్లు రాలేవని బాధపడుతున్న నాయకులను అయ్యో పాపం.. బాధాకరం అంటూ అక్కున చేర్చుకుంటున్నారనే చెప్పాలి.

దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేసిన ప్రాధాన్యత దక్కలేదని పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ నుంచి కన్నీళ్లతో బయటకు వచ్చారు. ఆయన్ని కలిసి ఓదార్చి బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు కేటీఆర్. ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి విషయంలోనూ ఇదే జరిగింది. నాగర్ కర్నూల్ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసమ్మతి వ్యక్తం చేస్తూ, ఆందోళన చెందుతూ బాధ పడ్డ నాగంను కేటీఆర్ ఓదార్చి కారెక్కించుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కు ఏళ్ల పాటు అండగా నిలిచిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని ఆ పార్టీ అవమానించిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. తాజాగా కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పాల్వాయి స్రవంతి.. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.

ఇక బీజేపీ నుంచి వేములవాడ టికెట్ ను దక్కించుకున్నట్లే కనిపించిన తుల ఉమ.. చివరి నిమిషంలో ఆ టికెట్ ను వికాస్ రావుకు ఇవ్వడంతో షాక్ కు గురయ్యారు. దీంతో బీజేపీకి గుడ్ బై చెప్పారు. తిరిగి బీఆర్ఎస్ కు జై కొట్టారు. కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వేములవాడ టికెట్ ను తుల ఉమకు ఇచ్చినట్లే ఇచ్చి గుంజుకోవడం బాధాకరమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆడబిడ్డగా బీఆర్ఎస్ ఇంటిబిడ్డగా సేవలందించిన ఉమకు బీజేపీలో అవమానం జరగడం బాధగా ఉందన్నారు. కేసీఆర్ సూచనల మేరకు తానే ఫోన్ చేసి ఉమను పార్టీలోకి తిరిగి ఆహ్వానించానని కేటీఆర్ వెల్లడించారు. గతంలో కంటే అధిక ప్రాధాన్యతనిచ్చి ఆమెను పార్టీ గౌరవించుకుంటుందని కేటీఆర్ చెప్పారు.

Tags:    

Similar News