చక్కదిద్దుతోన్న కేటీఆర్, హరీష్
పార్టీకి సమస్యగా మారిన నియోజవకర్గాలపై, అసంతృప్తి నేతలపై కేటీఆర్, హరీష్ దృష్టి సారించారు
ఎన్నికలకు ముందు ఏ పార్టీలోనైనా అసంతృప్తులు ఉండడం సహజమే. టికెట్ ఆశించిన వాళ్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకతతో ఉన్న నాయకులు ఉంటారు. వీళ్లను బుజ్జగించి దారికి తెచ్చుకోవడానికి పార్టీలు ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ కూడా అదే చేస్తోంది. ఈ ఏడాది ఎన్నికల నేపథ్యంలో టికెట్లను ఆశించే బీఆర్ఎస్ నాయకుల సంఖ్య పెరిగిపోతోంది.
సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వద్దంటూ కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు రంగంలోకి దిగారని సమాచారం.
పార్టీకి సమస్యగా మారిన నియోజవకర్గాలపై, అసంతృప్తి నేతలపై కేటీఆర్, హరీష్ దృష్టి సారించారు. ఒక్కో నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నారు. అసంతృప్తులను బుజ్జగిస్తూ దారికి తెచ్చుకుంటున్నారు. ఎన్నికల నాటికి ఎలాంటి సమస్య ఉండకుండా ముందే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రామగుండం ఎమ్మెల్యే కోరుగంటి చందర్‌కు ఈ సారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దంటూ అక్కడి బీఆర్ఎస్‌లోని కీలక నేతలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీళ్లను హైదరాబాద్‌కు పిలుపించుకుని కేటీఆర్ మాట్లాడారు.
ఇదివరకు స్టేషన్ ఘన్‌పూర్, జనగామ, డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్‌లో ఇలాగే అసమ్మతి సెగ రేగింది. వెంటనే కేటీఆర్ ఈ నియోజకవర్గంలోనూ నాయకులను పిలిచించి మాట్లాడారు. దీంతో ఆ నాయకుల్లో మార్పు వచ్చింది. మరోవైపు మెదక్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఇద్దరు నేతలు కార్యక్రమాలు నిర్వహించగా హరీష్ రావు రంగంలోకి దిగి చక్కదిద్దారు.
ఇక కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ సమస్యల పరిష్కరం కోసం మంత్రులకు బాధ్యతలు కూడా అప్పజెబుతున్నట్లు తెలిసింది. భవిష్యత్‌లో తప్పకుండా అవకాశం ఇస్తామని, వేరే పదవి దక్కేలా చూస్తామని తదితర హామీలతో అసంతృప్తులను శాంతపరుస్తున్నట్లు సమాచారం.